Home జాతీయ వార్తలు ఒకే రోజు 8000

ఒకే రోజు 8000

 7964 new COVID 19 cases and 265 deaths in India

 

దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా
ఇద్దరు విదేశాంగ శాఖ ఉద్యోగులకు వైరస్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణకు రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. రోగుల రికవరీ రేటు పెరుగుతుండడం ఊరటనిచ్చే అంశామై నా, కేసులు ఎగబాకడం ప్రజలను కలవరానికి గురిచేస్తున్నది.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 7,964 కరోనా కేసులు నమోదు కాగా, 265 మంది రోగులు మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1,73,763 కేసులు కా గా, 4,971 మంది రోగులు మృతిచెందారని తెలిపారు. ఇప్పటివరకు కరో నా యాక్టివ్ కేసులు 86,422 కాగా, 82,369 మంది రోగులు డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. అదేవిధంగా, గత 24 గంటల్లోగా 11,264 రోగులు కోలుకున్నారని అధికారులు వివరించారు. మొత్తం మీద కరోనా రోగుల రివకరీ రేటు 47.40శాతంగా ఉందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మృతిచెందిన 265 మంది కరోనా రోగుల వివరాలు వివిధ రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలో 116 మంది రోగులు చనిపోగా, ఢిల్లీలో 82, గుజరాత్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 13, తమిళనాడు (9), పశ్చిమబెంగాల్ (7), తెలంగాణ, రాజస్తాన్‌లో నలుగురి చొప్పున, పంజాబ్‌లో ఇద్దరు, చత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కరు చొప్పున మృతిచెందారని వివరించారు. దేశవ్యాప్తంగా 2,098 మంది కరోనా రోగుల మృతితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్‌లో (980), ఢిల్లీ (398), మధ్యప్రదేశ్ (334), వెస్ట్‌బెంగాల్ (302), ఉత్తరప్రదేశ్ (198), రాజస్థాన్ (184), తమిళనాడు (154), తెలంగాణ (71), ఆంధ్రప్రదేశ్ (60), కర్ణాటక (48), పంజాబ్ (42), జమ్మూకశ్మీర్ (28), హర్యానా (19), బిహార్ (15), కేరళ (8), ఒడిశాలో ఏడుగురు కరోనా రోగులు మృతిచెందారని తెలిపారు. అయితే, మృతిచెందిన వారిలో 70శాతం ఇతర రోగాలు ఉన్నవారేనని అధికారులు పేర్కొన్నారు.

ఇద్దరు విదేశాంగ శాఖ ఉద్యోగులకు కరోనా
న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆఫీసు సిబ్బందితో పాటు వారి వారి కుటుంబాలను 14 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. గత వారం ఎంఇఎ న్యాయ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి పని నిమిత్తం కేంద్ర యూరఫ్ డివిజన్ కలిశారని ఉన్నతాధికారులు తెలిపారు.

ఎలాంటి లక్షణాలు లేని కేసులు 40,184
కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేకుండానే కేసులు పాజిటివ్‌గా నిర్థారవుతున్న విషయం విదితమే. దేశవ్యాప్తంగా జనవరి 22 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు జరిగిన పరీక్షల్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే 40,184 మంది (28 శాతం) కి కరోనా పాజిటివ్ తేలినట్టు ఐసిఎంఆర్ అధ్యయనంలో తేలింది. ఐజెఎంఆర్ వెల్లడించిన అధ్యయనంలో ఇన్ఫెక్షన్ సోకిన ఆరోగ్య కార్యకర్తలు 5.2శాతంగా ఉన్నారని పేర్కొంది. ఎలాంటి లక్షణాలు లేని కేసులు 28.1శాతం కాగా, అధిక ప్రమాద తీవ్రత, ప్రత్యక్ష సంబంధాలు కలిగినవి 25.3శాతం, ఎలాంటి రక్షణ లేకుండా నిర్థారణ అయిన ఆరోగ్య కార్యకర్తల కేసుల్లో 2.8శాతంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలినట్టు ఐసిఎంఆర్ పేర్కొంది.

7964 new COVID 19 cases and 265 deaths in India