Monday, April 29, 2024

92 శాతం సన్న, చిన్నకారు రైతులే

- Advertisement -
- Advertisement -

రైతుబంధు అందుకుంటున్న
బడాబాబులు తక్కువే

రెండోరోజు 36లక్షల మంది ఖాతాలకు నిధులు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సాగుకు అరకొర కేటాయింపులు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న రైతుబంధు పథకం లబ్దిదారుల్లో 92.50 శాతం మంది 5ఎకరాల్లోపు సన్న చిన్నకారు రైతులే ఉన్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి రైతుబంధు పథకం అమలును వివరించారు. రైతుబంధు ద్వారా తొలిరోజు 19.98 లక్షల మంది రై తులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు గాను రూ.586.65 కోట్లు జమ అయినట్లు తెలిపారు. రెండో రోజు 16.32 లక్షల మంది రైతులకు చెందిన 24.68 లక్షల ఎకరాలకు రూ.1234.10 కోట్లు జమ అయ్యాయన్నారు. రెండు రోజుల్లో మొత్తంగా 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు గాను రూ.1820.75 కోట్లు జమ చేసినట్టుతెలిపారు. రైతుబంధుపై కొందరు దురభిప్రాయాలు ప్రచారం చేస్తున్నారన్నారు.10 ఎకరాల లోపు రైతులకు సింహభాగం రైతుబంధు నిధులు అందుతున్నాయనడంలో వాస్తవం లేదన్నారు. తొమ్మిదవ విడతలో 65 లక్షల మందికి రూ.7508 కోట్లు అందనుయన్నారు.

రైతుబంధుకు అర్హులుగా 68.10 లక్షల మంది తేలినట్టు తెలిపారు. కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతుందన్నారు. ప్రధాని మోడీ భారత రైతాంగాన్ని మోసం చేశారన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతుల పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేశారన్నారు. సీ2ప్లస్50 అమలు చేస్తామని ఎ2ప్లస్ 50 అమలు చేస్తూ రైతులను మోసం చేసి స్వామినాధన్ సిఫార్సులను అవమానిస్తున్నారన్నారు. 60 ఏండ్లు నిండిన రైతులకు ఫించను ఇస్తామని దాని ఊసెత్తడం లేదన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన నుండి గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాలు వైదొలిగినట్టు తెలిపారు.దీని అమలులో చెల్లించే ప్రీమియం ఎక్కువ .. రైతులకు చెల్లించే పరిహారం తక్కువ అన్నారు. బెంగాల్ లో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు.రైతుల మోటర్లకు మీటర్లు పెట్టమంటున్నారని , యూపీలో వస్తున్న బిల్లులు చూసిఈ విధానంపై రైతులు ఆందోళనలు చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో ఆరు కోట్ల ఎకరాల సాగు అనువైన భూమి ఉన్నదని, ఇక్కడ మొత్తం బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది గత మూడేళ్లుగా 4 నుండి 4.5 శాతమే అని వివరించారు.

గుజరాత్ లో 2.50 కోట్ల ఎకరాల సాగు అనువైన భూమి ఉండగా అక్కడి బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు గత మూడేళ్లలో 1.7 శాతం నుండి 2.8 శాతం మాత్రమేనని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయిస్తున్న బడ్జెట్ జాతీయ సగటు 6 నుండి 6.50 శాతం మాత్రమే అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 11.50 శాతం నుండి 12 శాతం బడ్జెట్ కేటాయించామన్నారు. దీన్ని బట్టి ఎవరు రైతుల పక్షమో ఎవరు కార్పోరేట్ల పక్షమో అర్ధమవుతుందన్నారు.అబద్దపు మాటలతో ప్రజలను కేంద్రం మోసం చేస్తోందన్నారు. 13 వ ఫైనాన్స్ కమీషన్‌తోపాటు 14,15వ ఫైనాన్స్ కమీషన్ల ద్వారా , వెనుకబడినప్రాంతాల అభివృద్దికింద, జీఎస్టీ బకాయిల కింద , సిఎస్‌ఎస్ బకాయిల కింద కేంద్రం నుండి మొత్తం రూ.7183.71 కోట్లు తెలగాణ రాష్ట్రానికి రావాల్సి ఉందని వెల్లడించారు.తెలంగాణ నుండి ఏడేళ్లలో రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో వెళ్లగా కేంద్రం నుండి తిరిగి వచ్చినవి రూ.1,68,647 కోట్లు మాత్రమే అని వివరించారు. రైతుబంధు పథకాన్ని దేశమంతటా అమలుచేయాలని,ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.రైతుల మోటర్లకు మీటర్లు బిగించడం ఆసాలన్నారు.ప్రధాని మోడికి ఏమాత్రం నైతికత ఉన్నా తెలంగాణ బకాయిలు వెంటనే చెల్లించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీడ్స్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News