Tuesday, April 30, 2024

పొన్నాలలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట: రాష్ట్రంలోని నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌దేనని రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులో గల టిహెచ్‌ఆర్ నగర్‌లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆయన బుధవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా ఆత్మ గౌరవంతో జీవించాలన్నదే సిఎం కేసిఆర్ సంకల్పం అని అన్నారు. పేద ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని సిఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ చూపి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీలలో పూర్తి స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేసి అసలైన లబ్దిదారులకే ఈ ఇండ్లను కేటాయించడం జరుగుతుందన్నారు.

పేద ప్రజలు కిరాయి ఇండ్లలో ఉండి ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో సిఎం కేసిఆర్ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను అమ్మినా కొన్న చట్టరిత్య నేరం అని, ఎవరైన ఇండ్లు అమ్మినా, కొన్నా, అద్దెకు ఇచ్చిన కేసులు నమోదు చేసి తిరిగి ఇండ్లను స్వాధీన పరుచుకుంటామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికి 364 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను అర్హులకు అందించడం జరిగిందన్నారు. అలాగే మిగితా ఇండ్ల నిర్మాణాలను సైతం త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామన్నారు. ప్రజలు సైతం డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం దళారులను నమ్మవద్దని, రూపాయి ఖర్చు లేకుండా, దండం పెట్టించుకోకుండానే అసలైన లబ్దిదారులను గుర్తించి ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. అలాగే పొన్నాల శివారులో 3 కోట్లతో ముదిరాజ్ ఫంక్షన్‌హాల్ నిర్మించబోతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Harish Rao Inaugurate Double Bedroom Houses in Ponnala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News