Sunday, May 19, 2024

ఉగ్ర ఎంఫాన్

- Advertisement -
- Advertisement -

State wide Rains for three days

 

ఒడిశాకు దక్షిణ దిశగా 990 కిలోమీటర్ల దూరంలో
కేంద్రీకృతమైన ‘ఎంఫాన్’
48 గంటల్లో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు
మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ‘ఎంఫాన్’ తీవ్ర తుఫానుగా మారి ఒడిశాకు దక్షిణ దిశగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ అధికారులు తెలిపారు. రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 48 గంటల్లో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని, మూడురోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.

ఆదివారం రాత్రి, సోమవారం అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర ఉపరితల వాతావరణం అనుకూలించడంతో శరవేగంతో బలపడుతున్న ఈ తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం దిశగా దూసుకువస్తోంది. ఇది మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని, ఆపై ప్రచండ తుఫానుగా బలపడి మే 20వ తేదీన తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) పేర్కొంది.

మే 20 సాయంత్రం తీరం దాటే అవకాశం

ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర తుఫాను, ఆపై ఉత్తరదిశలో పయనిస్తుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. మే 20 సాయంత్రం పశ్చిమబెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హాతియా ఐలాండ్స్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఈ తీవ్ర తుఫాను మరింత బలపడితే గాలుల వేగం గంటకు 190 కిలోమీటర్ల వరకు చేరుకుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ తీవ్ర తుఫాను తీరానికి దూరంగా, ఇంకా సముద్రంలోనే ఉన్నందున వర్షపాతం వివరాలపై మరింత స్పష్టత రాలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, బెంగాల్‌లపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News