Tuesday, April 30, 2024

రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!

- Advertisement -
- Advertisement -

Farmers to hold Tractor Parade towards Delhi on Jan 26

 

2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు ఉన్నాయా? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు. ఈ నియామకాలన్నీ బిజెపి నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్ధ్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి. నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు.

వివిధ పథకాలకు, ఆపద్ధర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరు బయట నిల్వ చేయటాన్ని నిలిపివేయాలి, నిల్వ పద్ధతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహార ధాన్యాలను కేటాయించాలి. ఆపద్ధర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు. కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

ధాన్యసేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్ధర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి. మార్కెట్లలో ఏజెంట్ల కమీషన్ నిలిపివేయాలి. ధాన్యసేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ర్ట ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రైవేటు రంగం , బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.

దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్ అభిజిత్ సేన్ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిస్ఠంగా 4 శాతం పన్నులు , లెవీలు చెల్లించాలి. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.

సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార ప్యాకేజ్‌లను అమలు జరపాలి. వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రైవేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఎసిపిని సాధికార చట్టబద్ధమైన సంస్థగా మార్చాలి. గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్ ముందుకు తెచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే. డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25 30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ర్ట ప్రభుత్వాలతో గత 2022 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్ సేన్, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్ హయాంలోనివే. వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25 30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.

ప్రపంచ బ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్ మెమోరాండం ( రిపోర్ట్ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు. కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపథ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ర్టపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశవిదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.

మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ధి కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి వినియోగించుకొనే దేశాలకూ లబ్ధి చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపద తారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత. ఇంతకీ ప్రపంచ బ్యాంకు వ్యవసాయ రంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి?

అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న ఎరువులు, నీటి, విద్యుత్, బ్యాంకు రుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీ వాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి. ( అనివార్యమైన స్థితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85 శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008 09నాటికి 1.52 శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే “రైతు బంధు” నరేంద్ర మోడీ ఏలుబడి ప్రారంభంలో 2014 నాటికి 0.6 శాతానికి తగ్గింది.

2016లో 0.5, తరువాత 2019 వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.) బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి. (తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రైవేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు) సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి. డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలి చర్యగా ఖాద్య తైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి. ఇ) ప్రైవేటు పరిశోధనా సంస్థల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రైవేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి. ఎఫ్) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను కూడా పెంచాలి.

2. మొత్తం ఆహార సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి. ఏ) భారత ఆహార సంస్థ ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసెన్సు ఉన్న ప్రైవేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. బి) ఆపద్ధర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్ల వైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి. సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు. డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రైవేటు రంగం ద్వారా పంపిణీ పద్ధతిని కూడా వినియోగించాలి.

పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కుపోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఎ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీ లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ అమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News