Thursday, May 16, 2024

సులభ వాణిజ్య తెలంగాణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను తెలియజేసే పింక్‌బుక్-21ను ఆవిష్కరిస్తూ మంత్రి కెటిఆర్

పెట్టుబడులకు రాష్ట్రంలో గల అవకాశాలు, మౌలిక వసతుల సమాచార గ్రంథం
రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి దోహదకారి
రాష్ట్ర వాణిజ్య పారిశ్రామిక విధానాల సమగ్ర పత్రం – మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: సులభతర వాణిజం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమగ్ర సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన పింక్‌ బుక్ పెట్టుబడిదారులకు ఎంతగానో ఉపయోగపడనుందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర విధానాలపై జాబితా తయారు చేసే సమగ్ర పత్రంగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాలను, సులభతర వాణిజ్యాన్ని పెంపొందించటంలో ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అన్నారు. పెట్టుబడిదారుల దృక్కోణంలో రాష్ట్రాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పింక్ బుక్-ఇన్వెస్టర్ గైడ్‌ను మంత్రి కెటిఆర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలు, ఇతర అంశాలతో సమగ్రంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలు, మౌలిక వసతులను తెలిపే ఈ పుస్తకం పెట్టుబడిదారుల భవిష్యత్ నిర్ణయాలకు ఉపయోగపడుతుందని కెటిఆర్ అన్నారు. అలాగే రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నా రు. పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల వివరాలతో పాటు పెట్టుబడిదారులకు తమ పెట్టుబడి ప్రణాళికలపై పూర్తి సమాచారం ఇవ్వడానికి ఈ పుస్తకం ఒక గైడ్‌గా పనిచేస్తుందన్నారు. ఈ ఇన్వెస్టర్ గైడ్…2021 రాష్ట్ర పెట్టుబడిదారులకు అందించే అవకాశాల గురించి మొత్తం సమాచారాన్ని ఇస్తుందన్నారు. అలాగే రాష్ట్రం కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై కూడా సమాచారం అందిస్తున్నారు.

అనంతరం ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, ఇది పెట్టుబడిదారులు ఎదురుచూసే రాష్ట్రాలు అందించే ప్రోత్సాహకాలు మాత్రమే కాదన్నారు. కార్యకలాపాల సౌలభ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, వనరులకు ప్రాప్యత, టాలెంట్ పూల్ వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విధానాలు క్రమబద్ధీకరించబడినప్పుడు, సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో మంచి గుర్తింపు పొందడం సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా పెట్టుబడిదారులకు రాష్ట్రం గురించి అవసరమైన సమాచారాన్ని పింక్‌బుక్ ఇవ్వనుందన్నారు. ఈ నేపథ్యంలో దీనిని ప్రతి సంవత్సరం ఆధునీకరిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్, ఇవి అండ్ ఇఎస్‌ఎస్ సుజై కరంపురితో పాటు ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

KTR Launches Pink Book at Pragathi Bhavan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News