Tuesday, April 30, 2024

దళితబంధు నిలిపివేతపై పిల్

- Advertisement -
- Advertisement -
Pill in High Court on Dalit Bandhu Retention
హుజూరాబాద్‌లో పథకం అమలు నిలిపివేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య

మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్‌లో దళిత బంధు నిలిపివేతపై ఇసి ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని, దళితబంధు యథావిధిగా కొనసాగేలా చూడాలని సామాజిక వేత్త మల్లెపల్లి లక్ష్మయ్య హైకోర్టులో గురువారం నాడు పిల్ దాఖలు చేశారు. ఈక్రమంలో ఇసి, సిఇవొ రాష్ట్ర ప్రభుత్వాన్ని పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఇసి లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇసి పేర్కొంది.

హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని ఎన్నిక తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిధులు జమ చేసే ప్రక్రియ నిలిపివేత హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను నిలిపివేయనున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సైతం వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్‌లో దళితబంధును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఎస్సీ కుటుంబాలున్నాయి. ఇప్పుడు దళితబంధు కోసం లెక్కలు వేయగా, దాదాపు 25 వేల కుటుంబాలున్నట్లు తేలింది. లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తున్నారు.

ఇప్పటివరకు 18 వేల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులు జమయ్యాయి. స్వయం ఉపాధి పథకానికి అధికారులు ఆమోదం తెలిపిన తరువాత ఆ నిధులను వినియోగించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో దళితబంధుకు బ్రేక్ పడింది. గతంలో ఇసి కి లేఖ రాసిన సుపరిపాలనా వేదిక హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసే వరకు దళితబంధు పథకం అమలు నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సం ఘాన్ని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న దళితబంధు పథకం మంచిదే అయినా హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ నియోజవర్గంలోనే తొలుత అమలుచేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయని, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైన ఉందని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News