న్యూఢిల్లీ: 2025లో చివరి సూర్యగ్రహణం ఆదివారం (సెప్టెంబర్ 21న) రోజున వచ్చింది. భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, సూర్యుని కాంతిలో కొంత భాగాన్ని లేదా పూర్తిగా అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆదివారం ఆకాశ వీక్షకులు(స్కైగేజర్లు) సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణాన్ని , పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించారు. సూర్యుడిని చంద్రుడు మొత్తంగా కప్పేయకుండా కొంత భాగాన్ని మాత్రమే కప్పేయడం వల్ల నెలవంక ఆకారంలో ఉన్న సూర్యుడిలా అద్భుతమైన దృశ్యాలను సృష్టించాడు. ఈ దృగ్విషయం భారత్‌లో కనిపించలేదు. సెప్టెంబర్ 21న వచ్చిన సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంటే సూర్యునిలో కొంత భాగం మాత్రమే కప్పబడింది. ఇది భారత దేశంలో కనిపించలేదు. ఎందుకంటే ఇది గ్రహణం దృశ్యమాన మార్గం వెలుపల ఉంది. ఈ సూర్యగ్రహణంను ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో చూడడం జరిగింది.
న్యూజిలాండ్, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో సూర్య గోళం 85 శాతం వరకు కప్పబడింది. ఫోర్బ్ ప్రకారం, ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 10.59 నుంచి ఉదయం 3.23 మధ్య సంభవించింది. సెప్టెంబర్ 22న న్యూజిలాండ్ ఉదయం 6.27 గంటలకు గ్రహణం వీడి ఉదయించే సూర్యుడిని న్యూజిలాండ్‌లోని డునెడిన్ నుండి TimeAndDate.com ద్వారా ప్రసారం చేసింది. ఇక తదుపరి సూర్య గ్రహణాలు ఫిబ్రవరి 17, ఆగస్టు 12, 2026లో కనిపించనున్నాయి. అయితే అవి కూడా భారత దేశం నుండి కనిపించవు. భారత దేశంలో కనిపించబోయే సూర్యగ్రహణం ఆగస్టు 2027లోనే వస్తుంది. సూర్యగ్రహణాన్ని ఎప్పుడు నేరుగా చూడకండి, ప్రత్యేక గ్రహణ అద్దాలు లేక ఫిల్టర్ల ద్వారానే చూడాలి.