Friday, May 3, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకోల్ బస్టాండ్‌లో గురువారం రాత్రి కారు ఢీ కొన్న సంఘటనలో పెద్దకొత్తపల్లికి చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆర్మీ జవాన్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ఉ్ర-దిక్తత నెలకొంది.

ఇందుకు సంబంధించి సిఐ యాలాద్రి తెలిపిన వివరాల మేరకు గురువారం రాత్రి నాగర్‌కర్నూల్ వైపు నుంచి కొల్లాపూర్ మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్ తన సొంత వాహనంలో కొల్లాపూర్ వస్తుండగా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ బస్‌స్టాప్‌లో రోడ్డు పక్కనే నిల్చున్న కల్వకోల్‌కు చెందిన ఘనమోని శేషమ్మ(35)ను తాగిన మైకంలో అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారు మరికొంత దూరంలో బైకు పై నిల్చున్న ఆర్మీ జవాన్ సురేష్ గౌడ్‌ను ఢీ కొట్టడంతో అతనికి కుడికాలు రెండు చోట్ల విరిగి తీవ్ర గాయాలయ్యాయని, బైక్ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. అదే రోజు రాత్రి శేషమ్మ మృతదేహాన్ని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, క్షతగాత్రుడు ఆర్మీ జవాన్ సురేష్ గౌడ్‌ను నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాద స్థలంలో తాగిన మైకంలో ఉన్న వాహనంలోని ముగ్గురిలో ఇద్దరు పరారు కాగా ఒక వ్యక్తి దొరకడంతో అతన్ని పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యిందని సిఐ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన శేషమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తరపున కల్వకోల్, చుక్కాయిపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు చెందిన బంధువులు, ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ధర్నాతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి ఎస్సైలు, సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాధితురాలికి ఇద్దరు మగ పిల్లలు, భర్త ఉండడంతో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు నాలుగు గంటల పాటు చర్యలు కొనసాగుతుండగానే ఒకానొక దశలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడి బాధితురాలి బంధువులు సమీపంలో ఉన్న మాజీ జెడ్పిటిసి హనుమంత్ నాయక్ ఇంటి ముందు ధర్నాకు ఉపక్రమించారు. దీంతో స్పందించిన పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

అంతకు ముందు స్టేషన్‌కు కొంత దూరంలో మహాత్మ జ్యోతిరావుపూలే చౌరస్తాలో ధర్నా చేశారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిహారం చెల్లింపు కోసం జాప్యాన్ని నిరసిస్తూ స్థానిక ఆసుపత్రిలో ఉన్న శేషమ్మ మృతదేహాన్ని ఆటోలో తీసుకువచ్చి ఎన్‌టిఆర్ ఔరస్తాలో బంధువులు రాస్తారోకో నిర్వహించారు. ఇంతలో ప్రమాద కారకులైన మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్ మృతురాలికి రూ. 22 లక్షల పరిహారం చెల్లించేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మృతురాలి భర్త బాలపీరు ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహి ంచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటనపై పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, శంకర్ నాయుక్, గోపి నాయులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ యాలాద్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News