Saturday, May 4, 2024

ఎకరా ఆయిల్ పామ్ తోట సాగుకు రూ. 49,800 రాయితీ: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy speech over Agriculture Sadassu Meetings

హైదరాబాద్: రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇది రైతు ప్రభుత్వమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో పథకాలు ఉన్నాయని ప్రశంసించారు.  రాష్ట్రంలోని 26.81 లక్షల బోరు బావులకు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం మోయడంతో పాటు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఏడాదికి రూ.1500 కోట్లు పెట్టి రైతుభీమా పథకాన్ని తీసుకొచ్చామని, ఏడాదికి రూ.15 వేల కోట్లతో 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకం కింద ఇస్తున్నామన్నారు.

దేశంలో ఏటా 23 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల డిమాండ్ ఉందని,  కానీ దేశంలో 10 నుంచి 11 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెలు మాత్రమే దేశీయంగా లభిస్తున్నాయని,  దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల కోసం దిగుమతుల మీద ఆధారపడుతున్నామన్నారు.  రూ.80 నుండి రూ.90 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వెచ్చించి థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుండి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తెలియజేశారు. ఈ డిమాండ్ ను గమనించే 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటి వరకు 30 వేల మంది రైతులను క్షేత్రస్థాయి సందర్శనలకు తీసుకెళ్లి అవగాహన కల్పించామన్నారు.  అందులో భాగంగా 2022-23 సంవత్సర ప్రణాళిక ప్రకారము 2 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణములో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకుగాను ఈ వార్షిక బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించడం జరిగిందని,  ఇప్పటికే వేలాది ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం పూర్తి చేశామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఒక ఆయిల్ పామ్ మొక్కకు రూ. 193 రాయితీ చొప్పున, ఎకరానికి 57 మొక్కలకు రూ . 11,000 రాయితీ లభిస్తుందన్నారు. ఒక ఎకరం డ్రిప్ కోసం రూ. 22,000 రాయితీని అందిస్తున్నామన్నారు.

అదేవిధముగా 4 సంవత్సరముల వరకు ప్రతి సంవత్సరం రూ.4200/ చొప్పున మొక్కలకు ఎరువు, ఇతర ఖర్చులకు రూ. 16,800 ఎకరానికి సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందన్నారు.  మొత్తంగా ఒక ఎకరానికి ఆయిల్ పామ్ తోట సాగుకు రూ. 49,800 రాయితీగా ఇస్తున్నామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగులో సబ్సిడీలు ఎత్తివేసినట్లు పలు దినపత్రికలలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు. ఎవరైనా రైతులు రుణం తీసుకుని ఆయిల్ పామ్ సాగు చేస్తే వారికి చెందాల్సిన సబ్సిడీ వారి ఖాతాలలో జమ అవుతుందన్నారు. అది ఒక అప్షన్ గా మాత్రమే ఇస్తున్నామని,  ఆయిల్ పామ్ సబ్సిడీపై పలు పత్రికలలో వచ్చిన నిరాధారమైన వార్తలను రైతు సోదరులు పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News