Tuesday, April 30, 2024

నాడు – నేడు!

- Advertisement -
- Advertisement -

All countries now look at India with pity

 

నాలుగు మాసాల క్రితం ప్రపంచానికి ప్రాణ దాతనని చెప్పుకున్న భారత దేశాన్ని ఇప్పుడు దేశ దేశాలన్నీ జాలిగా చూస్తున్నాయి. ఇక్కడ కొవిడ్ విజృంభిస్తున్న తీరును, మన పాలకుల వల్లమాలిన నిర్లక్ష్యాన్ని పక్కపక్కన ఉంచి చూపిస్తూ మన స్వయంకృతాపరాధాన్ని అంతర్జాతీయ మీడియా ఎండగడుతున్నది. జనవరి నెలలో 16వ ప్రవాస భారతీయ దిన సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని మోడీ కరోనా పీడిత ప్రపంచానికి భారత దేశం అభయ ప్రదాతగా నిలబడిందని చెప్పుకున్నారు. “ఇండియా ఈ రోజున కరోనా మృతులు అతి తక్కువగానూ, కోలుకున్న వారు అత్యధిక సంఖ్యలోనూ గల దేశాల్లో ఒకటిగా ఉంది. ఒకటి కాదు రెండు మేడిన్ ఇండియా టీకాలతో మానవాళికి ప్రాణ దానం చేసే స్థితిని సాధించుకున్నది” అని మోడీ తనకు తానే జబ్బలు చరుచుకున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం ఇండియాలో ఉందని చాటారు. ప్రవాస భారతీయులు పిఎం కేర్స్ నిధికి విరివిగా విరాళాలిచ్చినందుకు వారిని మెచ్చుకున్నారు.

తాను అధికారానికి రాడానికి ముందు దేశం అవినీతి కంపు కొడుతూ ఉండేదని, దానిని సమూలంగా మార్చి వేశానని, సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించానని, భారతీయుల్లో 75 శాతానికి మించి తనను అభిమానిస్తున్నారని చెప్పుకొచ్చారు. అప్పటికి ఇప్పటికి దాదాపు నాలుగు మాసాలు గడిచింది. కరోనా రెండో కెరటం కోరలు చాచి స్మశానాల్లో చోటు కూడా లభించనంతగా ప్రజల ప్రాణాలను కరకర నమిలి మింగేస్తున్న వర్తమానంలో ఆ గొప్పలన్నీ దేశ దేశాల దయాదాక్షిణ్యాల కోసం అర్రులు చాస్తున్న చిప్పలుగా మారిపోయాయి. ఇంగ్లాండుకు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక భారత దేశంలో వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ప్రజలు కొవిడ్ నరకంలో కూరుకుపోయారని వ్యాఖ్యానించింది. జనం పెద్ద ఎత్తున ఒక చోట చేరకూడదని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కొవిడ్ నివారణ నియమాలు గట్టిగా చెబుతుంటే బెంగాల్‌లో ఒక ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ ‘ఇంతటి మహా జన సముద్రాన్ని నేనెప్పుడూ చూడలేదని’ ఆశ్చర్యపోయి పలికిన పలుకులను ప్రస్తావించి ది గార్డియన్ ఎద్దేవా చేసింది.

గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కొవిడ్ మృతుల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయని, అవి చెబుతున్న దానికి ఆసుపత్రుల శవాగారాలలో (మార్చురీలు) కుప్పలు పడిఉన్న మృత దేహాల లెక్కకు పొంతన కుదరడం లేదని ఎత్తి చూపింది. ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఇండియాలో అదుపు తప్పిన కొవిడ్ గురించి అనేక కథనాలు ప్రచురించింది. తొందరపడి కూసిన కోయిలలా కొవిడ్‌పై విజయం సాధించినట్టు భారత ప్రభుత్వం ముందుగానే ప్రకటించుకొని ఆ తర్వాత దాని విష కోరలకు తన ప్రజలను విందుగా అందిస్తున్నదని న్యూయార్క్ టైమ్స్‌లో ఒక ప్రసిద్ధ కాలమిస్టు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్లక్షం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోడమే ఈ మహా మృత్యు సంక్షోభానికి కారణమని భోపాల్‌లో శవ దహనాలు 1984లో యూనియన్ కార్బైడ్ విష వాయువు లీక్ సంభవించినప్పటి దృశ్యాలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. హరిద్వార్‌లో కుంభమేళాను అనుమతించడాన్ని ఏకి పారేశారు. అలాగే ఫ్రాన్సు పత్రిక లీ మాండ్, బ్రెజిల్‌కు చెందిన ఓ గ్లోబో, జపాన్ పత్రిక జపాన్ టైమ్స్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ (ఆస్ట్రేలియా), గల్ఫ్ టైమ్స్ (కతార్) వంటి పత్రికలు భారత దేశంలో కొవిడ్ రెండో కెరటం ఉధృతిని గురించి ప్రచురిస్తూ మోడీ ప్రభుత్వం చేతగాని తనాన్ని, నిర్లక్షాన్ని తీవ్రంగా విమర్శించాయి.

సెకండ్ వేవ్ ఇండియాను ఎక్కువగా బాధిస్తుందని గత అక్టోబర్‌లోనే హెచ్చరికలు వెలువడినా పాలకులు దాని గురించి బొత్తిగా పట్టించుకోలేదని చెరిగి వదిలి పెట్టాయి. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా చెప్పనలవికాని కొవిడ్ అప్రతిష్ఠ మూటగట్టుకున్న మన కేంద్ర ప్రభుత్వ సారథులు సహాయం కోసం అమెరికాను అర్థించవలసి వచ్చింది. టీకా ముడి సరకులు సరఫరా చేయాలని వారం రోజుల క్రితం అమెరికాను మనం కోరగా అక్కడ అమల్లో ఉన్న యుద్ధ కాలపు రక్షణ చట్టాన్ని ప్రస్తావించి అది అందుకు నిరాకరించింది. భారత్ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నామని అంటూనే ముందుగా తమ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పడం లేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రభుత్వం మన అభ్యర్థనను మర్యాదగా తిరస్కరించింది.

ఇప్పుడు అమెరికా తన జనాభాలో మెజారిటీకి టీకాలు వేసుకున్నది గనుక మనకు టీకా ముడి సరకును, ఇతర కొవిడ్ వైద్య పరికరాలను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రెసిడెంట్ బైడెన్, ప్రధాని మోడీ ఫోన్‌లో మంచిగా మాట్లాడుకున్నారు. ఇంకా బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరప్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాలూ భారత దేశాన్ని ఆదుకోడానికి సిద్ధమయ్యాయి. ఈ విధంగా ముందు స్వాతిశయంతో గొప్పలు చెప్పుకొని ప్రపంచానికే అభయ హస్తం చాచి, ఇప్పుడు చతికిలపడిపోయి విశ్వం ముందు మోకరిల్లవలసిన స్థితిని తెచ్చుకున్నందుకు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఏమనాలి?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News