Saturday, May 4, 2024

‘ఉల్ఫా’తో శాంతి ఒప్పందం:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అసోంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రానికిచెందిన సాయుధ వేర్పాటు వాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఉల్ఫా)తో దీర్ఘకాలంగా ప్రభుత్వం జరుపుతున్న చర్చలు ఫలించాయి.ఈ క్రమంలో ఉల్ఫా, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందంపై శుక్రవారం సంతకాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటుగా ఉల్ఫా ప్రతినిధులు పాల్గొన్నారు. అసోం ప్రజలకు ఇది గొప్ప రోజని ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉల్ఫా హింసాకాండ కారణంగా అసోం దీర్ఘకాలంగా ఎంతో నష్టపోయిందని, 1979నుంచి ఈ హింస కారణంగా 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. హింసను విడనాడడానికి, సంస్థను రద్దు చేయడానికి,ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకోవడానికి ఉల్ఫా అంగీకరించిందని షా చెప్పారు.

ఒప్పందంలో భాంగా అసోంకు భారీ అభివృద్ధి ప్యాకేజి ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు అసోంలో హింస 87 శాతం తగ్గిందని, మరణాలు 90 శాతం, కిడ్నాప్‌లు 84 శాతం తగ్గాయని కూడా హోంమంత్రి చెప్పారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమైనదిగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అభివర్ణిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వం, మార్గదర్శకం కారణంగా ఈ ఒప్పందం సాధ్యమయిందని చెప్పారు. అరబిందో రాజ్‌ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా వర్గం, ప్రభుత్వం మధ్య 12 ఏళ్లుగా సాగిన బేషరతు చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు చెప్పారు. ఈ ఒప్పందం అసోంలో దశాబ్దాల తిరుగుబాటు చర్యలకు ముగింపు పలుకుతుందని భావిస్తున్నారు.

‘ప్రత్యేక అస్సాం’ డిమాండ్‌తో 1979లో ఉల్ఫా ఏర్పాటయింది.తిరుగుబాటు పేరుతో ఆయుధాలు చేతపట్టిన తిరుగుబాటుదారులు అనేక విధ్వంసక చర్యలకు పాల్పడడం మొదలుపెట్టారు.1990లో ఉల్ఫాను కేంద్రప్రభుత్వం నిషేధించింది.ఈ క్రమంలో శాంతిచర్చలకు సుదీర్ఘ ప్రయత్నాలు జరిగాయి.అరబింద రాజ్‌ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా వర్గం బృందం ఈ చర్చలకు 2011లో తొలిసారి ముందుకు వచ్చింది.అయితే పరేశ్ బరువా నేతృత్వంలోని ఉల్ఫా( స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. బరువా ప్రస్తుతం చైనామయన్మార్ సరిహద్దుల్లో తలదాచుకున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News