Monday, April 29, 2024

మాదక ద్రవ్యాల విముక్తి మోడీ ప్రభుత్వ లక్ష్యం : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం నుంచి మాదక ద్రవ్యాల ముప్పును మోడీ ప్రభుత్వం సమూలంగా నిర్మూలిస్తుందని, దేశం మీదుగా వీటి రవాణా కానీయకుండా చూస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నిర్ధారించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదనే విధానాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుసరిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం లోని వివిధ విభాగాల సమన్వయంతో మోడీ ప్రభుత్వ మొత్తం చొరవతో మాదక ద్రవ్యాల వాణిజ్యానికి వ్యతిరేకంగా ప్రాథమికంగా విజయం సాధించడమైందని పేర్కొన్నారు. 2006 నుంచి 2013 మధ్యకాలంలో రూ.768 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకోగా, 2014 నుంచి

2022 మధ్య కాలంలో రూ. 22,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకోవడమైందని, అంతకు ముందు కన్నా ఇది 30 రెట్లు ఎక్కువని అమిత్ షా వివరించారు. అలాగే 2006 నుంచి 2013 మధ్యకాలంలో డ్రగ్ రవాణాదారులపై 1257 కేసులు నమోదు కాగా, 2014 2022 మధ్యకాలంలో 3544 కేసులు నమోదై కేసుల సంఖ్య 181 శాతం పెరిగిందని, ఇంతే కాకుండా 2022 జూన్ నుంచి 6 లక్షల కిలోగ్రాముల డ్రగ్స్ ధ్వంసం చేయడమైందని వివరించారు. దేశాన్ని డ్రగ్స్ విముక్తి భారత్‌గా చేయడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉండడాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రజల సహకారం లేనిదే మాదక ద్రవ్యాలపై యుద్ధంలో విజయం సాధించలేమన్నారు. ఈ మేరకు ప్రచారోద్యమాన్ని మరింత పటిష్టం చేయడానికి హోం మంత్రిత్వశాఖ 2019లో నేషనల్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్ ను నెలకొల్పిందని, ప్రతి రాష్ట్రంలో పోలీస్ విభాగంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడమైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News