Sunday, April 28, 2024

ఎపిలోనూ సినిమా షూటింగ్‌లకు అనుమతి..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతినివ్వడంతో ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జూలై 15వ తేదీ తర్వాత ఏపీలో షూటింగ్‌లు చేసుకునేందుకు సీఎం అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను సినీ ప్రముఖులు కలిశారు. చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, త్రివిక్రమ్, రాజమౌళి, డి.సురేష్ బాబు, సి.కల్యాణ్ తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్ది, సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ “కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీఎం జగన్ షూటింగ్‌లకు అనుమతినివ్వడంతో ఆనందంగా ఉంది.

ఇక సీఎం జగన్‌ను కలిసినప్పుడు థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జీలు ఎత్తేయాలని కూడా కోరాం. నంది వేడుకలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం. పరిశీలిస్తామని సీఎం జగన్ అన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుంది. మాకు చాలా మేలు జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మాకు ఆనందం కలిగించింది”అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ “కేంద్రం అనుమతినిచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు తెరుస్తాము. 2019-20కి నంది అవార్డులకు విధివిధానాలు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు”అని పేర్కొన్నారు.

AP Govt permission for movie shootings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News