Tuesday, April 30, 2024

కశ్మీర్ ప్రజల్ని నిరాశపర్చిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హామీ ఇచ్చిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి కుదించిన మోడీ ప్రభుత్వం చర్యలు సబబేనంటూ సుప్రీం కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీసుకున్న ఈ చర్యలు జాతీయ సమైక్యతకూ, సమగ్రతకూ తీరని హానిని కల్గిస్తాయి. సుప్రీం కోర్టు తీర్పుతో అందరూ సృజనాత్మకంగా, కలిసికట్టుగా ఎదగడానికి వీలు కల్పించే సమాఖ్య చట్రానికి తూట్లుపడ్డాయి. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే చట్టం పేరు తో జాతీయ స్థాయిలో భావోద్వేగాలు ప్రేరేపించి, భారతీయ సమాజాన్ని మొత్తంగా అతి తీవ్ర జాతీయవాదం వైపు, సైనికీకరణ మనస్తత్వం వైపు నడిపించడానికి ఆర్‌ఎస్‌ఎస్ సాగిస్తున్న ప్రయత్నానికి ఈ తీర్పు అండగా నిలబడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీం కోర్టు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం, రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించిన కార్యనిర్వాహకులను బాధ్యులను చేయడంలో సుప్రీం కోర్టు వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. అంతేకాక రాజ్యాంగం పట్ల ప్రజల విశ్వాసాన్ని కూడా సుప్రీం కోర్టు దిగజార్చింది.ఆర్టికల్ 370 జమ్మూ-కశ్మీర్‌కు సార్వభౌమాధికారాన్ని ఇవ్వలేదు,

కానీ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా లో విలీనం చేయడంలో ఇది కీలకమైనది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగ రక్షణ కల్పించడం అనేది సుప్రీం కోర్టు పేర్కొన్నట్లు కేవలం ‘అసమాన సమాఖ్య’ అంశం మాత్రమే కాదు, భారత దేశంతో కశ్మీర్ విలీన చరిత్రలో దాని మూలాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 వంటి కొన్ని ప్రత్యేక హక్కులను కలిగి ఉన్న అనేక ఇతర రాష్ట్రాలు భారత దేశంలో ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు సుప్రీం కోర్టు జమ్మూ, కశ్మీర్‌ను మాత్రమే అసమాన సమాఖ్య కేసుగా ప్రకటించింది. ఆపై అసమానతలను సరిదిద్దే పేరుతో, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దుచేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వ చర్యను విస్మరించింది.

జమ్మూ-కశ్మీర్‌ను రాష్ట్రంగా ఏర్పాటు చేసి నాలుగేళ్ళు గడిచినా శాసనసభ ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రజలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య హక్కును కోల్పోయారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మౌఖిక హామీ ఆధారంగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దోషిగా ప్రకటించడం దురదృష్టకరం. ఈ చర్య రాజ్యాంగ ఔచిత్యాన్ని విస్మరించింది. రాజకీయ ప్రతిపక్షాన్ని, ప్రాథమిక హక్కులను అణచివేసే కశ్మీర్ లోయ నమూనా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని తోసిపుచ్చేందుకు ఉపయోగించబడుతోంది. జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు చర్యలను సుప్రీం కోర్టు ఆమోదించడం వల్ల భారత దేశంలో ఫెడరలిజాన్ని బలహీనపరిచే మోడీ ప్రభుత్వం ముందు ముందు మరింత పేట్రేగిపోతుంది. ఈ ఆర్టికల్ కశ్మీర్‌కు స్వతంత్ర హోదా కల్పిస్తుంది. రక్షణ, విదేశాంగ వ్యవహారాల్లో మినహా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ చట్టం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మాత్రమే చేయాల్సి వుంటుంది. కానీ అలాంటి ప్రక్రియ యేదీ లేకుండానే కేంద్రం ఏకపక్షంగా ఈ ఆర్టికల్‌ని రద్దు చేసింది. పైగా అక్కడ ప్రజా ప్రభుత్వమేదీ లేని సమయాన్నీ,

రాష్ట్రపతి పాలన ద్వారా తమ నియంత్రణ కొనసాగుతున్న సమయాన్నీ ఒక అవకాశంగా తీసుకుని ఈ చర్యకు తెగబడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండా చేయడానికి సన్నాహకంగానే అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది. కానీ సుప్రీం కోర్టు ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా అక్కడ ప్రభుత్వమే లేనప్పుడు ఇక అనుమతులకూ, అభిప్రాయాలకూ ఆస్కారమే లేదన్నట్టుగా వ్యవహరించడం న్యాయమేనా? ఈ ఆర్టికల్ ద్వారా కశ్మీర్‌కు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా కల్పించబడ్డాయి. అయితే ఇవన్నీ సుప్రీం ధర్మాసనం గమనంలో ఉన్నాయో లేవో తెలియదుగానీ ఇకపై దేశంలోని అన్ని రాష్ట్రాల వలనే జమ్మూ కశ్మీర్ కూడా అని తన తీర్పులో వ్యాఖ్యానించింది. దీంతో 371 అధికరణం ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు దాఖలుపడిన హక్కులు కూడా కశ్మీర్‌లకు లేకుండా పోతాయా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. బ్రిటీష్ ఇండియాలో రూపుదిద్దుకున్న జాతీయ ఆకాంక్షలతో గానీ, జాతీయోద్యమ ఆదర్శాలతో గానీ, రాజ్యాంగ రూపకల్పనా ప్రక్రియతో గానీ ఏ మాత్రం సంబంధంలేని శక్తులు నేడు దేశాన్ని పాలిస్తున్నాయి.

భిన్నత్వంలో ఏకత్వం భావనకు విరుద్ధంగా హిందూ రాష్ట్ర భావనను ప్రాచుర్యంలోకి తెచ్చిన సావర్కర్, హెగ్డేవార్, గోల్వాల్కర్ వంటివారు అప్పట్లో తమ ప్రజల మద్దతును కూడగట్టుకోలేకపోయా రు. గాంధీజీ, జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, భగత్ సింగ్, కమ్యూనిస్టులు అనేక అంశాలలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ స్వాతంత్య్రానంతర భారత దేశం ఒక ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద దేశంగా, ఆధునిక, నాగరిక, శాస్త్రీయ వివేచన గల సమాజంగా వుండాలని గట్టిగా భావించారు. మహమ్మదాలీ జిన్నా, సావర్కర్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని వారు గట్టిగా ఎదుర్కొన్నారు. బ్రిటీష్ పాలకుల విభజించి పాలించే కుటిల నీతిని ప్రతిఘటించారు. దేశ విభజన తప్పని పరిస్థితుల్లో జాతీయ నాయకత్వం విభజన గాయాలను త్వరితగతిన మాన్పే ప్రయత్నం చేసింది. స్వదేశీ సంస్థానాలలోని ప్రజా పోరాటాలను జాతీయోద్యమం గట్టిగా బలపర్చింది. సంస్థాన పాలకుల అభిప్రాయాల కంటే స్థానిక ప్రజల అభిప్రాయాలకే విలువ ఇవ్వాలన్న ఒక మౌలిక సూత్రానికి నాయకత్వం ప్రాధాన్యం ఇచ్చింది.

1935 భారత చట్టం, 1947 భారత స్వాతంత్య్ర చట్టం, రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలు, రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణలు నాటి పరిస్థితులను తేటతెల్లం చేస్తాయి. జాతీయోద్యమ నాయకత్వపు ఆలోచనలను, అవగాహనలను ఆ నేపథ్యంలో పరిశీలించాల్సి వుంటుంది. అయితే అప్పట్లో సమాజాన్ని ఒప్పించడంలో విఫలమైన హిందూ రాష్ట్రవాదులు అనంతర కాలంలో అలనాటి పరిస్థితులను, వాస్తవికతలను వక్రీకరిస్తూ, అసత్యాలతో, అర్ధసత్యాలతో ఒక నిరంతర దుష్ప్రచారోద్యమాన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా జమ్మూ-కశ్మీర్ విషయంలో జాతీయోద్యమ నేతల వైఖరులను వక్రీకరించారు. నేతల మధ్య లేనిపోని వైరుధ్యాలను సృష్టించారు. వారిని నేరస్థులుగా చూపించారు. 370 అధికరణాన్ని బూచిగా చిత్రీకరించారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా వుండటానికి 370 అవకాశం కల్పించిన వాస్తవాన్ని తల్లకిందులుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పటికే 370ను రద్దు చేసిన కేంద్రం నేడు వేలాది మంది రాజకీయ నేతలను నిర్బంధించి, వార్తా, ప్రసార సాధనాలను, ఆఖరికి న్యాయస్థానాల్ని కూడా నియంత్రించి, కమ్యూనికేషన్ వ్యవస్థలను బంద్ చేసి, కశ్మీర్‌లో నేడు అంతా సవ్యంగానే వుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కానీ ప్రభుత్వ చర్యలు సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. ప్రజల మనోగతాన్ని గౌరవించాలన్న జాతీయోద్యమ ఆదర్శాన్ని నేటి పాలకులు తుంగలోకి తొక్కారు. ప్రజాభిప్రాయాన్ని సైనిక బలం ద్వారా అణచడానికి చూస్తున్నారు. ఇటువంటి చర్యల ద్వారా సమస్య పరిష్కారం కాదు. ఆ పేరుతో మరిన్ని భావోద్వేగాలను సృష్టించడం, నియంతృత్వాధికారాలను కేంద్రీకృతం చేసుకోవడం, రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని మార్చడం లక్ష్యంగా పాలకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పాలకుల కుట్రలను, తప్పుడు ప్రచారాలను ఎదిరించి, భారత రాజ్యాంగ మౌలిక భావనలను రక్షించుకోవడం మనముందున్న తక్షణ కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News