Saturday, April 27, 2024

ఎదురులేని శక్తిగా ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లో తనకు ఎదురులేదనే విషయాన్ని ఆస్ట్రేలియా మరోసారి చాటింది. భారత్‌తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా తానెంటో ఆస్ట్రేలియా నిరూపించింది. కొన్నేళ్ల క్రితం వరుస ఓటములతో ప్రపంచ క్రికెట్‌లో అట్టడుగు స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా క్రమంగా పూర్వవైభవం దశగా అడుగులు వేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి చిన్న జట్లను ఓడించేందుకు కూడా తీవ్రంగా శ్రమించిన ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకుంది. యాషెస్‌లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఇదే క్రమంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌సిప్‌లో కూడా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టించింది. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను సయితం అలవోకగా ఓడిస్తూ పూర్వవైభవాన్ని చాటింది. వన్డే ఫార్మాట్‌పై ఆస్ట్రేలియా ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. ఏ జట్టు కూడా అందుకోలేనంత స్థాయిలో ప్రపంచకప్ ట్రోఫీలను సాధించింది.

దాంతో పాటు టి20 వరల్డ్‌కప్‌లోనూ విజేతగా నిలిచి సత్తా చాటింది. తాజాగా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా ట్రోఫీని సాధించి ప్రపంచ క్రికెట్‌లో తనను మించిన జట్టు మరేది లేదని చాటింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా బలంగా తయారైంది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, లబుషేన్, అలెక్స్ కారీ తదితరులు అద్భుత ఆటతో ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిపారు. మిఛెల్ స్టార్క్, లియాన్, కమిన్స్, బొలాండ్ తదితరులు బంతితో మెరిశారు. ఇలా సమష్టిగా పోరాడిన ఆస్ట్రేలియా తన ఖాతాలో మరో అరుదైన ట్రోఫీని సాధించింది. ఈ విజయంతో రానున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఆస్ట్రేలియాకు అవకాశం ఏర్పడింది. భారత గడ్డపై జరిగే వరల్డ్‌కప్‌లో కంగారూలు ఫేవరెట్‌గా కనిపిస్తున్నారు. కిందటిసారి పేలవమైన ఆటతో నిరాశ పరిచిన ఆస్ట్రేలియా ఈసారి మాత్రం ఎలాగైనా వరల్డ్‌కప్ ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఉంది. అంతకుముందు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో విజయం సాధించాలని తహతహలాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News