Saturday, April 27, 2024

మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్నచూపు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్న చూపు చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బోగ శ్రావణిని కలిసేందుకు శుక్రవారం బండి సంజయ్ జగిత్యాలకు వచ్చారు. శ్రావణి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ, మహిళా బిల్లు విషయంలో సిఎం కెసిఆర్ కూతురు కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానని మాట్లాడటం చూస్తే నవ్వొస్తుందన్నారు. మహిళలకు నీవు ఏం చేశావు అని తన తండ్రిని నిలదీసిన తర్వాత జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని కవితకు సూచించారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఎంత మంది మహిళలకు చోటు కల్పించారు… మీ ప్రభుత్వంలో మహిళలు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు.

పోయిన కేబినేట్‌లో మహిళలకు అసలే ఎందుకు చోటివ్వలేదని, మహిళా గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో చెప్పాలన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగితే సిఎం కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ ప్రతులను చించేసిన పార్టీలతో ఎందుకు దోస్తానో చేస్తున్నారో నిలదీయాలని కవితకు సూచించారు. మెడికో ప్రీతి చనిపోతే, నిర్మల్‌లో బాలికపై మీ పార్టీ నేత అత్యాచారం చేస్తే కనీసం సిఎం కెసిఆర్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో గంటలో లైంగిక వేధింపు, పూటకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని మీ నాన్న కెసిఆర్‌ను నిలదీసే ధైర్యముందా అని కవితకు సవాల్ విసిరారు. బిజెపి అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వాళ్లకు చుక్కలు చూపిస్తామన్నారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. గ్యాస్ ధరల పెంపుపై బిఆర్‌ఎస్ నేతలు ధర్నాలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ కంటే రూ.15 తక్కువ ఉందని, తెలంగాణలో ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు 10 సార్లు పెంచారని, ఆర్టీసీ చార్జీలు 7 సార్లు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నల్లా చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న మీరు ఎందుకు ధర్నాలు చేయలేదని బిఆర్‌ఎస్ నేతలను సంజయ్ ప్రశ్నించారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల చమురు కొరత ఏర్పడటంతోనే ధరలు పెరిగాయనే విషయం ప్రజలకు తెలుసన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News