Friday, May 3, 2024

రుణాలు, డిపాజిట్ల వృద్ధి శాతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరంలో రుణాలు, డిపాజిట్ల విషయంలో శాతాల వారీగా చూసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రగామిగా నిలిచింది. అంతేకాదు లాభాల విషయంలో కూడా అత్యధిక వృద్ధి రేటును ఈ బ్యాంక్ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాక్ లాభాలు 126 శాతం వృద్ధి చెంది రూ.2,602 కోట్లకు చేరుకున్నాయి. అయితే మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభాలు 57 శాతం పెరిగి రూ.1,04,649 కోట్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. మొత్తం రుణాల వితరణకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 29.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం రూ.1,75,120 కోట్ల రుణాలను ఇచ్చింది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(21.2 శాతం), యూకో బ్యాంక్ (20.6 శాతం) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే మొత్తం రుణ వితరణ విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బిఐ) ఇచ్చిన రుణాలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రుణాలకన్నా 16 రెట్లు ఎక్కువ ఉన్నాయి.2022 23 ఆర్థిక సంవత్సరంలో ఆ బ్యాంక్ మొత్తం రూ.27,76,802 కోట్ల రుణాలు ఇచ్చింది. ఇక డిపాజిట్ల వృద్ధి విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర15.7 శాతం వృద్ధితో రూ.2,34,083 కోట్లు సమీకరించింది. డిపాజిట్ల విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 13 శాతం వృద్ధితో(రూ.10,47,375 కోట్లు) రెండో స్థానంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 11.26 శాతం వృద్ధి(రూ.12,51,708 కోట్లు)తో మూడో స్థానంలో నిలిచాయి.

తక్కువ ఖర్చు కలిగిన కరెంటు ఖాతా, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు సమీకరించడంలో కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 53.38 శాతం వృద్ధితో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.50.18 శాతంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది.2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం వ్యాపార వృద్ధి 21.2 శాతం (రూ.4,09, 202 కోట్లు)తో అత్యధికంగా నిలిచింది. 14.3 శాతం వృద్ధి( రూ.18,42,935 కోట్లు)తో బ్యాంక్ ఆఫ్ బరోడా రెండో స్థానంలో నిలిచింది. రిటైల్, వ్యవసాయ, ఎంఎస్‌ఎంఇ రుణాల విషయంలో కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News