Friday, April 26, 2024

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Bryant

 

ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి
శోక సంద్రంలో క్రీడాభిమానులు

కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు మృతి చెందారు. బ్రియాంట్ కుటుంబ సభ్యులతో కలిసి తన ప్రైవేటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలో మీటర్ల దూరంలోని క్యాలబస్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది.

హెలికాప్టర్ కిందపడుతున్న సమయంలోనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేక పోయారు. మృతదేహాలన్నీ గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇదిలావుండగా హెలికాప్టర్ దుర్ఘటనలో లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ బ్రియాంట్, అతని కుమార్తె గయానా మృతి చెందడంతో క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగి పోయింది. బ్రియాంట్ అకాల మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

విషాధంలో అమెరికా
బ్రియాంట్ మృతి వార్త తెలియగానే అమెరికాలో విషాధ ఛాయలు నెలకొన్నాయి. దేశంలోని అన్ని నగరాల ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రపంచ బాస్కెట్‌బాల్‌పై తనదైన ముద్ర వేసిన బ్రియాంట్ దుర్ఘటనలో మృతి చెందడంపై అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. ఇక, దిగ్గజ ఆటగాడి మృతిని అమెరికా ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. మరణావార్త విని అమెరికా ప్రజలు శోక సముద్రంలో మునిగి పోయారు. అమెరికాలోని అన్ని టీవీ ఛానళ్లలో బ్రియాంట్ మృతికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.

పలు ఛానళ్ల న్యూస్ రీడర్లు బ్రియాంట్ మరణావార్తను తెలుపుతూ కన్నీటిపర్యంతరమవుతున్నారు. ఇదిలావుండగా దేశ వ్యాప్తంగా బ్రియాంట్ మృతికి సంతాపంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరప్‌తో సహా పలు దేశాల్లో కూడా బ్రియాంట్ అకాల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అంతేగాక పలు చోట్ల బ్రియాంట్, అతని కూతురు గయానా చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

ట్రంప్ సంతాపం
మరోవైపు తమ దేశ బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అతని మరణావార్తను విని షాక్ గురయ్యానని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బ్రియాంట్ చిన్న వయసులోనే దుర్మరణం చెందడం అమెరికాకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రమాదంలో అతని కూతురు కూడా మరణించడం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. అమెరికాలో బాస్కెట్‌బాల్ అభివృద్ధి కోసం బ్రియాంట్‌తో ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. బ్రియాంట్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్రంప్ ప్రార్థించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బ్రియాంట్ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. బ్రియాంట్ మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు.

కెటిఆర్ దిగ్భ్రాంతి
బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ మృతిపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఎంతో అభిమానించే బ్రియాంట్ దుర్మరణం పాలుకావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాని తెలిపారు. అసాధారణ ఆటకు మరో పేరుగా నిలిచే బ్రియాంట్ అంతే తనకు ఎంతో అభిమానమని, అతను ఆడిన ఎన్నో మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూశేవాడినని వివరించారు. ప్రమాదంలో అతని కుమార్తె కూడా మృతి చెందడం మరింత బాధకు గురి చేసిందన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా బ్రియాంట్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నాడు. బ్రియాంట్ ఆట తనను కట్టి పడేసేదని, కోర్టులో పాదరసంలా కదుల్తూ అతను చేసిన ఎన్నో గోల్స్ తనను కట్టి పడేసేవన్నాడు. బ్రియాంట్, అతని కూతురు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధకరమన్నాడు. ఇక, మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌తో పాటు బుమ్రా, రోహిత్ శర్మ, హర్షాభోగ్లే తదితరులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు.

Basketball giant Bryant is dead
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News