Thursday, April 25, 2024

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్ అనే సంస్థ రూ.1000 కోట్ల పెట్టబడిని పెట్టనున్నట్టు ప్రకటించాయి. అందులో భాగంగా మౌలిక సదుపాయల కల్పన కోసం రెండువేల కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడి పెడతామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలీయన్‌లో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు -చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్‌ల సమావేశం తరువాత ఎయిర్‌టెల్ సంస్థ ఈ ప్రకటన చేసింది.

60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ రాబోతుందని, డేటా భద్రతలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటాసెంటర్ రాబోయే 5-7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది. తెలంగాణలో హైపర్ స్కేల్ డేటాసెంటర్‌లు ఏర్పాటుచేస్తున్న భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్‌ట్రా ద్వారా భారతీ ఎయిర్ టెల్ ఈ డేటాసెంటర్‌ను నెలకొల్పుతుంది.

హైపర్ స్కేల్ డేటా సెంటర్‌లకు హైదరాబాద్ హబ్: కెటిఆర్

ఈ సందర్భంగా ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ ఎయిర్‌టెల్- నెక్స్ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉందన్నారు. భారతదేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్‌లకు హైదరాబాద్ హబ్‌గా మారిందని, ఎయిర్‌టెల్ తాజా పెట్టుబడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నానని ఆయన తెలిపారు. ఎయిర్ టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్‌టెల్- నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని కెటిఆర్ తెలిపారు.

తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది: సునీల్ భారతీ మిట్టల్

భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు -చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో ఒకటి అని ఆయన తెలిపారు. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. 2022 మే లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా పని చేసిందన్నారు. ఇతర రంగాల్లోనూ తమ ఉనికిని, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో క్యాంపస్ ను నెలకొల్పనున్న యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్

హైదరాబాద్‌లో అత్యాధునిక క్యాంపస్‌ను ఏర్పాటుచేస్తున్న యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్ అనే సంస్థ ప్రకటించింది.
భారతీయ ఔషధ మార్కెట్‌లో తన కంపెనీని విస్తరించేందుకు హైదరాబాద్‌లో క్యాంపస్ ను నెలకొల్పుతున్నట్టు ఫ్రాన్స్ కు చెందిన యూరోఫిన్స్ ప్రకటించింది. ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలో యూరోఫిన్స్ గ్లోబల్ పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే దావోస్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో యూరోఫిన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఫార్మా రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో తమ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలను (ల్యాబ్) హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేస్తున్నట్టు యూరోఫిన్స్ ప్రకటించింది. ఆహారం, పర్యావరణం, ఫార్మాస్యూటికల్, కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలో, బయో అనలిటికల్ టెస్టింగ్ లో ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్‌గా ఉంది. హైదరాబాద్‌లో ప్రారంభించే అధునాతన టెస్టింగ్ ల్యాబ్ తో భారతీయ ఔషధ మార్కెట్ లో తన సంస్థను యూరోఫిన్స్ విస్తరించబోతుంది.

కంపెనీ విస్తరణపై మంత్రి కెటిఆర్‌తో చర్చ

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావుతో సమావేశమైన యూరోఫిన్స్ ప్రతినిధి బృందం తమ విస్తరణ ప్రణాళికలపై చర్చించింది. 90,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అత్యాధునిక ప్రయోగశాలలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ ఆర్ అండ్ డి, బయోఅనలిటికల్ సర్వీసెస్, ఇన్-వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన అంతర్జాతీ స్థాయి దేశ, విదేశ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో పాటు చిన్న బయోటెక్ కంపెనీలకు అవసరమైన సేవలు అందించనుంది.

హైదరాబాద్‌లో ప్రయోగశాల ఏర్పాటు

తన అనుబంధ సంస్థ యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా హైదరాబాద్‌లో ప్రయోగశాలను యూరోఫిన్స్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మన దేశంలో యూరోఫిన్స్ కొనసాగిస్తున్న కార్యకలాపాలతో పాటు డిస్కవరీ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, బయోఅనలిటికల్ సర్వీస్‌లను ఈ ల్యాబ్ ద్వారా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఫార్ములేషన్ డెవలప్‌మెంట్‌తో పాటు ఇన్-విట్రో, ఇన్-వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు ఈ సంవత్సరం నుంచే యూరోఫిన్స్ అడ్వినస్ కు ఈ ల్యాబ్‌తో అవకాశం కలుగుతుంది.

ఔషధాల తయారీ, పరిశోధనలకు హైదరాబాద్

ఔషధాల తయారీ, పరిశోధనలకు ఆసియాలో ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ పరిగణించబడుతోంది. లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, తయారీ, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాల కోసం భారతదేశంలో మొదటిసారిగా జీనోమ్ వ్యాలీలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ప్రత్యేక ఆర్థిక మండళ్ల రూపంలో పారిశ్రామిక, నాలెడ్జ్ పార్కులు ఏర్పాటయ్యాయి. దాదాపు 15,000 మంది నిపుణులతో 200 కంటే ఎక్కువ కంపెనీలు జీనోమ్ వ్యాలీలో దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు తమ సేవలను అందిస్తున్నాయి. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ స్థానాన్ని యూరోఫిన్స్ అడ్వినస్ తాజా పెట్టుబడి మరింత బలోపేతం చేసింది.

కొత్త క్యాంపస్‌తో ఔషధాల అభివృద్ధి: యూరోఫిన్స్ సీఈఓ

ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు లేబోరేటరీ నెట్‌వర్క్‌ను మరింత సుస్థిరం చేసుకునే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు తమ దగ్గర ఉన్నాయని యూరోఫిన్స్ సీఈఓ డాక్టర్ గిల్లెస్ మార్టిన్ పేర్కొన్నారు. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ప్రాధాన్యత తమ దృష్టిలో ఉందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే కొత్త క్యాంపస్‌తో ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణల్లో హైదరాబాద్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.

యూరోఫిన్స్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ ప్రవేశిస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. తమ విస్తరణ-వృద్ధి ప్రణాళికల కోసం హైదరాబాద్ ను ప్రధాన కేంద్రంగా యూరోఫిన్స్ పరిగణించడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తాజా పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలోని గ్లోబల్ కంపెనీల జాబితాలో చేరిన యూరోఫిన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News