Saturday, May 4, 2024

నగుబాట్ల ట్రంప్‌ను ఇంటి బాట పట్టించాలి

- Advertisement -
- Advertisement -

Biden says Trump must be removed from power

 

అమెరికన్లకు బిడెన్ పిలుపు

పిట్స్‌బర్గ్ : అమెరికాలో విభజనలను సృష్టించిన ప్రెసిడెంట్ ట్రంప్‌ను అమెరికన్లు ఈసారి ఇంటిబాట పట్టించాలని ప్రత్యర్థి జో బిడెన్ పిలుపు నిచ్చారు. గత నాలుగేళ్లలో ట్రంప్ ఈ దేశాన్ని అన్ని విధాలుగా వైఫల్యపు బాట పట్టించారని విమర్శించారు. పిట్స్‌బర్గ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో డెమోక్రాటిక్ అభ్యర్థి బిడెన్ ప్రసంగించారు. వచ్చే మూడు రోజులలో మనమంతా కలిసి దేశాన్ని పలు విధాలుగా దెబ్బతీసి , పలు స్థాయిలలో విభేదాలు కల్పించిన అధ్యక్షుడి పాలనకు ముగింపు పలికే అవకాశం వచ్చిందని , దేశమంతా విద్వేషపు చిచ్చు రగిల్చిన వారిని సాగనంపాల్సిన అవసరం ఉందా? లేదా? అని బిడెన్ ప్రశ్నించారు. డెట్రాయిట్, మిచిగాన్‌లలో జరిగిన కారు ర్యాలీల్లో బిడెన్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈసారి ఎన్నికలలో అమెరిన్లు ట్రంప్‌ను ఓడించి తీరుతారని తనకు నమ్మకం ఏర్పడిందన్నారు. ఇప్పటికే కోట్లాది మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఈ రెండు మూడు రోజులలో లక్షలాది మంది మిగిలిన వారు ఓట్లేస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా తాను విడమర్చి చెప్పేది ఒక్కటే అని, ఈ దేశ భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉందని , దీనిని తాను స్పష్టాతిస్పష్టంగా విదితం చేయదల్చుకున్నానని చెప్పారు. ఇక ట్రంప్ మూటముల్లె సర్దుకుని ఇంటిబాట పట్టాల్సిందేనని తెలిపారు. గందరగోళాలు, ట్వీట్లు, విద్వేషాలు , ఆగ్రహాలు అన్నింటికి మించి పాలనాపరమైన వైఫల్యాలన్నింటిని ఇన్నేళ్లో చవిచూశామని , బాధ్యతారాహిత్యం నిర్లక్ష ఫలితాలను అనుభవిస్తున్నామని తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నుంచి అమెరికాను తిరిగి చక్కదిద్దాల్సి ఉందన్నారు.

తాను అధ్యక్షుడిని అయితే ఈ విశేష కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారం చేపట్టేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. తాము చర్యలకు దిగుతామని తెలిపారు. ఈ దిశలో కోవిడ్‌ను నియంత్రించి తీరుతామని ప్రకటించారు. ట్రంప్ ఐరాసలో మాట్లాడినప్పుడు ఈ ప్రపంచం అంతా నవ్వుకుందని బిడెన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రెసిడెంట్ తనకు తాను పెద్ద గట్టి మనిషిని, ధీరుడిని శూరుడిని అనుకుంటారని, అయితే ఐరాస సభలో ఆయన మాటతీరు బహుధా నగుబాటుకు దారితీసిందని , హీరోయిజం పోయి కామెడిజాన్ని సంతరించుకుందని తెలిపారు. ఐరాసలో ఇతర వేదికల్లో, చివరికి నాటో సదస్సులో మన మిత్రపక్షాల నుంచి కూడా ఈ నేత పట్ల ఈసడింపులు వ్యక్తం అయ్యాయని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News