Friday, April 26, 2024

కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!

- Advertisement -
- Advertisement -

BJP conspiracy on Rajasthan politics

మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అమిత్ షా మోడీ ద్వయం బిజెపియేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి తమదారికి తెచ్చుకునే కుట్రలకు తెరలేపారు. అవసరమైతే ఆ ప్రభుత్వాలను కూల్చేందుకు కూడా వెనుకాడడం లేదు. మొన్నటి ఉత్తరాఖండ్ నుండి నేటి రాజస్థాన్ వరకు వారు అనుసరించిన విధానాలే ఇందుకు నిదర్శనం. వారి దారిలోకిరాని రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఎలాంటి చర్యలకు పాల్పడ్డారో కూడా చూశాం. దీని బట్టి చూస్తే వారు ఏ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో అర్ధం అవుతోంది. గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో వారు చేసిన కుట్ర రాజకీయాలను చూస్తే వారి ఆలోచలనలకు అవి అద్దం పడుతున్నాయి.
బిజెపి పగ్గాలు మోడీ, అమిత్ షా ద్వయం చేతిలోకి వచ్చాక ఆ పార్టీ సిద్ధాంతాలు గాడి తప్పాయి. శ్యాం ముఖర్జీ, వాజ్‌పేయ్, అద్వానీ కాలంనాటి రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. అధికారమే పరమావధిగా భావించారు. తాము అధికారంలో లేని రాష్ట్రాలను తమ కబ్జాలోకి తెచ్చుకునేందుకు అడ్డదారులు తొక్కారు. కాంగ్రెస్‌ను తలదన్నే విధంగా కక్ష సాధింపు రాజకీయాలను ఉధృతం చేశారు. ఐ టి, ఇడి, సిబిఐ లను ఉపయోగించి ప్రత్యర్థులపై దాడులు చేసి వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదా భయపెట్టి వారిని రాజకీయంగా సైలెంట్ చేసే పని పెట్టుకున్నారు. ఇలా తమ రాజకీయ క్రీడను కొనసాగిస్తూనే ఉన్నా రు. ఇది ఇలా ఉంటే మోడీ నాయకత్వంలోని కేంద్రం ప్రభు త్వం కూడా వివక్ష రాజకీయాలు చేస్తోంది. బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. అరకొర నిధులు మాత్రమే ఇస్తోంది. కేంద్రం నుండి అందించాల్సిన సహాయం సంపూర్ణంగా అందించడం లేదు. పైగా తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తే రాష్ట్రాలకున్న కొద్దిపాటి హక్కులను కూడా హరించేవిగా ఉన్నాయి. విద్యుత్ సవరణ చట్టం ఆ కోవాలోనిదే. అలాగే సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం, అంతర్ రాష్ట్రాల జల వివాదాలపై తీసుకున్న నిర్ణయాలు కూడా రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేవిగానే ఉన్నాయి. ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే మార్కెట్, ఒకే దేశం ఒకే రేషన్ ఇలా ఏదయినా ఒకటే విధానం ఉండాలి అనే వాదన వెనుక బలమైన రాజకీయ కారణం ఉదనిపిస్తోంది. బహుశా… ఈ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఖతం పట్టించాలనే ఆలోచనదాగి ఉందనిపిస్తుంది.
గత లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కూడా అయ్యారు. తాజాగా కేంద్రం కొత్తగా తేనున్న విద్యుత్ సవరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అంటూ కెసిఆర్ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. లాక్ డౌన్ సమయంలో తెలంగాణ సర్కార్ వలస కూలీలు, పేదలను ఆదుకొనే విషయంలో తీసుకున్న నిర్ణయాలు, ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లలో సిఎం కెసిఆర్ రాష్ట్రాలను ఆదుకోవాలంటూ చేసిన సూచనలు, చైనా సైనికుల దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న తీరు, తెలంగాణ సంక్షేమ పథకాల అమలులో నెంబర్ వన్‌గా ఉండడం లాంటి అంశాలు మోడీ, అమిత్ షాలకు మింగుడుపడినట్లు లేదు. అందుకే తెలంగాణ సర్కార్‌ను టార్గెట్ చేశారనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే అనేక విషయాల్లో కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన సందర్భాలున్నాయి.
పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లులకు టిఆర్‌ఎస్ మద్దతుగా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలకు అంగా నిలబడ్డారు. అంతే కాదు చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని మోడీ ఇచ్చిన పిలుపులపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసిన వారిని మీడియా సమావేశంలో కెసిఆర్ ఉతికి ఆరేశారు. మంచిని మంచి, చెడుని చెడు అనడం బిజెపి వారికి ఇష్టం లేనట్లుంది. అందుకే కరోనాను అడ్డంపెట్టుకొని కెసిఆర్ సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం విఫలమైంది అంటూ విమర్శలు చేస్తున్నారు. వారు చేసే వాదన కరెక్ట్ అయితే దేశ వ్యాప్తంగా పెరిగిన కేసులకు కూడా మోడీనే కారణమనుకోవాలా…? కేసుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంకు చేరుకుంది.
దీనికి మోడీ అసమర్థతే అని అందామా…? గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో కేసులు పెరగడానికి ఆ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలే కారణమంటే తెలంగాణ బిజెపి నాయకత్వం ఒప్పుకుంటుందా…? దేనిని రాజకీయం చేయాలో దేనిని చేయకూడదో కూడా తెలియకపోతే ఎలా..? మోడీనే స్వయంగా కరోనా తో సహజీవనం తప్పదు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలే తప్పా అంతకన్నా చేయగలిగేది ఏమిలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో కరోనా వ్యాప్తికి కెసిఆర్ ప్రభుత్వమే కారణం అని బిజెపి అనడమంటే రాజకీయం కాకా మరేమిటి..? ఇలాంటి జాతీయ విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంటుంది. ఇలాంటి విపత్తు సమయాల్లో స్థానిక బిజెపి నాయకత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలి. తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. అప్పుడు మాత్రమే ప్రజలు వారిని విశ్వసిస్తారు. కేవలం ఓటు బ్యాంకు పాలిటిక్స్‌తో పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడానికి పరిమితం అయి రాజకీయాలు చేస్తే బిజెపినీ ప్రజలు విశ్వసించరు.

పి.వి శ్రీనివాసరావు
(ఇన్‌పుట్ ఎడిటర్
టి న్యూస్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News