Sunday, April 28, 2024

ఉన్న మాట అంటే ఉలుకు!

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు బద్ధ వ్యతిరేకి అనే విషయంలో వేరే మాటకు అవకాశమే లేదు. ఇది ఆ ప్రభుత్వంపై కక్షతో కల్పించి చెప్పవలసిన అవసరమే లేదు. అనుక్షణం రుజువవుతున్న నిప్పులాంటి నిజం. నిరంకుశత్వంలో, అణచివేతలో పూర్వపు రాచరిక ప్రభువులు సైతం సమాధుల్లోంచి లేచి వచ్చి మన ప్రస్తుత కేంద్ర పాలకుల వద్ద పాఠాలు నేర్చుకోవలసిందే. ప్రతిపక్షాన్ని, భిన్నాభిప్రాయాన్ని తుడిచి పారేయడమే తమ పద్ధతి అని బిజెపి పాలకులు మాటల ద్వారా కాకుండా ఆచరణ ద్వారా తరచూ స్పష్టం చేస్తుంటారు. ప్రజాస్వామ్యం పేరిట దాని చేత ఊడిగం చేయించుకొంటున్న ఘనత వీరికి దక్కుతుంది అని ఎవరైనా అంటే ఎంత మాత్రం కాదనలేము. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమాన్ని నీరుగార్పించడానికి బుద్ధికి తోచినన్ని వ్యూహాలను ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు పరచిన సంగతి అందరికీ తెలిసిందే.

అప్పట్లో రైతు ఆందోళనపై ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్ రూపొందించిన టూల్ కిట్ నిర్మాణంలో పాలు పంచుకొన్నారనే ఆరోపణపై బెంగళూరుకు చెందిన దిశరవి అనే 21 ఏళ్ళ అమ్మాయిని ఢిల్లీ పోలీసులు ఆమె ఇంటి నుంచి అరెస్టు చేసి తీసుకు వెళ్ళిన సమాచారం తెలిసిందే. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో నిరసన ప్రకటనలు చోటు చేసుకోరాదనే దృష్టితో ప్రధాని మోడీ ప్రభుత్వం ట్విట్టర్‌పై తన ప్రతాపాన్ని చూపింది. ఆ విషయాన్ని ఇప్పుడు అప్పటి ట్విట్టర్ సిఇఒ జాక్ డోర్సే ఒక యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సవివరంగా బహిర్గతం చేశారు. సహజంగానే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెనువెంటనే దీనిని ఖండించారు. “రైతు ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఇండియాలో చాలా అభ్యర్థనలు దాని చుట్టూ చోటు చేసుకొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తుండిన కొందరు జర్నలిస్టుల చుట్టూ అవి మోహరించేవి అని జాక్ డోర్సే అన్నారు.

అవి చాలా రూపాల్లో వుండేవి. చివరికి భారత దేశంలో ట్విట్టర్‌ను మూసివేస్తామనే బెదిరింపు కూడా వచ్చింది” అని ఆయన అసలు విషయాన్ని బయట పెట్టారు. మీ ఉద్యోగుల ఇళ్ళల్లో దాడులు జరిపిస్తామని కూడా హెచ్చరించేవారని ఆయన చెప్పారు. ఇదెంత వరకు వాస్తవమో కాని 2021లో ట్విట్టర్ ఆఫీసుల్లో ఒక దానిపై ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారన్నది మాత్రం వాస్తవం. చివరికి అప్పటి సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ట్విట్టర్ రాజీ కుదుర్చుకొన్నది. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలు. 2002 నాటి గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసి విడుదల చేసినందుకు బిబిసి కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ చేత దాడులు జరిపించిన మాట వాస్తవం కాదా? ప్రజాస్వామ్యంలో జరగకూడని ఇటువంటి చర్యలకు పాల్పడడం మన కేంద్ర ప్రభువులకు వెన్నతో పెట్టిన విద్య కావడం ఎంతైనా బాధాకరం. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు బ్యాలట్ ద్వారా తిరగబడతారనే భయం కూడా లేకుండా బిజెపి పాలకులు తమ ఇష్టా రాజ్యాన్ని కొనసాగించడం భారతీయులుగా అందరం సిగ్గు పడవలసిన విషయం.

జాక్ డోర్సే చెప్పిన ప్రతి మాట వాస్తవం కానక్కర లేదు. ఆయన కూడా మోతాదు పెంచి వుండవచ్చు. డోర్సే 2021 లోనే ట్విట్టర్ సిఇఒ పదవి నుంచి వైదొలగారు. 2022లో దానిని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అందుచేత ఈ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ఆయనకు ప్రత్యేక ప్రయోజనాలేవో కలిగే అవకాశాలు వుంటాయని అనుకోలేము. ఇంటర్వూ ఇప్పుడు తీసుకొన్నారు కాబట్టి అప్పటి విషయాలను ఆయన పూసగుచ్చి వుండవచ్చు. తనకు గిట్టని జర్నలిస్టులపైన, కవులు, రచయితలపైన కేంద్ర పాలకులు ఎంత కసిగా వ్యవహరిస్తారో కళ్ళముందున్న వాస్తవమే. వారిపై అవసరమైతే ‘ఉపా’లు ప్రయోగించడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పాలక పక్షాల, వాటి కూటముల ప్రముఖులపై ఇడి, సిబిఐ, ఐటి దాడులను జరిపించడం, నెలల తరబడి వారిని జైళ్ళల్లో వుంచడం కేంద్రంలోని బిజెపి పాలకులకు మంచి నీళ్ళ ప్రాయమైపోయింది.

అవినీతి అంతా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే వున్నట్టు చూపించడంలోని బూటకాన్ని కూడా వారు గమనించడం లేదు. తమ పార్టీ పాలనలో బొత్తిగా అవినీతి లేదనే అబద్ధాన్ని వారు శాయశక్తులా పోషిస్తున్నారు. ఈ కారణం వల్లనే ప్రజలు ఎన్నికల్లో తమను తిరస్కరిస్తున్నా వారికి కనువిప్పు కలగడం లేదు. ప్రధాని మోడీయే ఒక సారి అన్నట్టు ఇది అనాదిగా ప్రజాస్వామిక దేశం. అంతేకాదు భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు వర్ధిల్లుతున్న నేల. దీనిని హిందూ మత ఆధిపత్య దేశంగా మార్చాలని వారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకోసమే ప్రజాస్వామిక విలువలను బలి తీసుకొంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడాన్ని అందులోని అనివార్యమైన భాగంగా అమలు చేస్తున్నారు. దానిని ఎంత తొందరగా మానుకొంటే బిజెపి భవిష్యత్తుకు అంత మేలు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News