Tuesday, April 30, 2024

ముంబయిలో మూడు రైల్వే స్టేషన్లు, అమితాబ్ బంగ్లాకు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

Bomb scare at Three Mumbai railway stations

పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్
తనిఖీల తర్వాత ఉత్తుత్తి బెదిరింపుగా పోలీసుల నిర్ధారణ
ఫోన్‌కాల్ చేసిన వ్యక్తి సహా ఇద్దరి అరెస్టు

ముంబయి: మహారాష్ట్ర ముంబయిలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లతో పాటుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బంగ్లాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాలుగు చోట్ల బాంబుల పెట్టినట్లు శుక్రవారం రాత్రి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ రావడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏదీ గుర్తించలేదని వారు తెలిపారు. అది ఉత్తుత్తి బెదిరింపుగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పొరుగున ఉన్న ఠాణెలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు శనివారం చెప్పారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఒక ట్రక్కు డ్రైవర్ అని, అదుపులోకి తీసుకున్న వారిలో అతను ఉన్నాడని ఆ అధికారి తెలిపారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లు, జుహులోని అమితాబ్ బచ్చన్ బంగ్లాలో బాంబులు పెట్టినట్లు శు్రక్రవారం రాత్రి 9.45 గంటలకు పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చిందని పోలీసు అధికారి చెప్పారు. ఈ ఫోన్‌కాల్ అందుకున్న తర్వాత ప్రభుత్వ రైల్వే పోలీసులు, ఆర్‌పిఎఫ్‌తో పాటు బాంబు డిస్పోజల్ బృందం, పోలీసు శునకాలు, స్థానిక పోలీసులతో కలిసి ఆ ప్రాంతాలకు హుటాహుటిన వెళ్లి సోదాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అయితే అన్ని ప్రాంతాల్లో అనేక గంటల పాటు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించినప్పటికీ అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువూ కనిపించలేదని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తిమొబైల్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేసి ఠాణె జిల్లాలోని ముంబ్రా సమీపంలో షిల్‌ఫటా ప్రాంతంలో గుర్తించినట్లు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన ట్రక్కు డ్రైవర్ అని, అతనికి తాగుడు అలవాటు ఉన్నట్లు తెలిసిందని ఆ అధికారి తెలిపారు. మరో వ్యక్తితో పాటుగా అతడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని ఆ పోలీసు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News