Tuesday, April 30, 2024

బిఆర్‌ఎస్ చారిత్రక అవసరం

- Advertisement -
- Advertisement -

KCR enter into national politics

తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏప్రిల్ 27 2001న కెసిఆర్ రాష్ట్ర సాధన కోసం, స్వయం పాలన కోసం, ఆంధ్ర పాలన నుండి విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరచడం ఆనాటి పరిస్థితుల్లో గొప్ప సాహసంగా భావించాలి. రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారుల పట్ల, సమస్యల పట్ల అణచివేత వైఖరి కొనసాగుతున్న తరుణం. తెలంగాణ అంటేనే నక్సలైట్‌గా ముద్ర వేసి ఎన్‌కౌంటర్లు చేయడం, జై తెలంగాణ అంటే నాలుక కోస్తామని బెదిరించడం, ఆటపాట బందై, అత్యంత నిర్బంధం ఎదుర్కొంటున్న తెలంగాణ సమాజానికి ఒక ఇంటి పార్టీగా తెరాస ఏర్పడడం కొండంత విశ్వాసాన్ని ఇచ్చింది. రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాల కాలంగా పని చేస్తున్న ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు ప్రజాస్వామికవాదులు తమ ప్రచారాన్ని తమ ఆటపాటను విస్తృతం చేసుకోవడానికి రాజకీయ పార్టీ అవతరించిందని విశ్వాసం, నమ్మకం ఏర్పడింది. ప్రొ.జయశంకర్ సార్ తెలంగాణ సాధించాలంటే భావజాల వ్యాప్తి, ఉద్యమం, రాజకీయా ప్రక్రియ అవశక్యతను వివరించారు.

ఉద్యమ నాయకుడు కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ పార్టీ జయశంకర్ సార్ సూచించిన పద్ధతిని అనుసరించి విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యం పరిచింది. 20012014 వరకు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను అసెంబ్లీ, పార్లమెంటు వేదికల ద్వారా ప్రపంచానికి తెలియచేస్తూనే ఆనాటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేసింది. దీని ఫలితంగా జై తెలంగాణ అనాల్సిన అనివార్యత అన్ని పార్టీలకు కలిగించడం కెసిఆర్ సాధించిన గొప్ప విజయం. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలిసి తెలంగాణ పరిస్థితులు, ఆకాంక్షలు వినిపించి ఉద్యమానికి మద్దతుగా లేఖలు తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు, సకల జనుల సమ్మె, పెన్‌డౌన్, మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనభేరి, ఢిల్లీ ధర్నా లాంటి అనేక విశాల ప్రజా ఉద్యమాలకు జెఎసిలు ప్రజాసంఘాలు భాగస్వామ్యంతో కెసిఆర్ తెలంగాణను సాధించడం ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి నమూనా, రైతు కేంద్రీకరణగా పని చేయాల్సిన బాధ్యతను రూపొందించుకొని ప్రజల మధ్య విస్తృతంగా చర్చలు జరిపి ఉద్యమ కాలంలోనే స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవడం కెసిఆర్‌కే సాధ్యమైంది.

CM KCR speech at Warangal public meeting

భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ భవిష్యత్తు పట్ల ఆ రాష్ట్రాలకి సరైన స్పష్టత లేక ఎజెండా రూపొందించుకోవడంలో, అభివృద్ధిని ఎంచుకోవడం లో విఫలమైన నేపథ్యం కనబడుతున్నది. అందుకే ప్రజల ఆకాంక్షల ఎజెండాగా మారి తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికగా ప్రజల ముందుకు రావడం, ప్రజలందరూ ఎన్నికల ప్రణాళికను తమదిగా భావించి 2014లో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితిపై ఎంత విషం కక్కినా ప్రజలు అద్భుతమైన ప్రేమతో అధికారంలోకి తీసుకురావడం కీలక పరిణామం. 2014లో టిఆర్‌ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి ఆచరణలో పెట్టే ప్రయత్నం జరిగింది. గతంలో రైతాంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు నిరంతర విద్యుత్, సాగునీటి సమస్యను పరిష్కరించడానికి యుద్ధప్రాతిపాదికగా కృషి చేసి కేవలం 6 నెలల కాలంలోనే నాణ్యమైన నిరంతర విద్యుత్తు ఇవ్వడంలో ప్రభుత్వం విజయం సాధించింది.

సాగు నీటికి రైతాంగం పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి కాకతీయ మిషన్ ద్వారా 45 వేల చెరువులను బాగు చేసుకుని నిల్వ సామర్థ్యాన్ని పెంచి, కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుతో పాటు అనేక రిజర్వాయర్లు నిర్మించడంతో నీటికోసం తల్లాడిన తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారం అయ్యింది. దీనితో పాట రైతు బంధు కార్యక్రమాన్ని ప్రారంభించి 65 లక్షల రైతు కుటుంబాలకు పంట పెట్టుబడి ఇచ్చి ప్రభుత్వం మాది అనే విశ్వాసం కలిగించే ప్రయత్నం సఫలమైంది.

CM KCR will announce National party to dussehra?

తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలోని అన్ని ఆవాసాలకు స్వచ్ఛమైన నీరు అందించే ప్రయత్నం పూర్తయింది. దీనితో ఫ్లోరైడ్ నివారణతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడే వీలు కలిగింది. విద్య-, వైద్యంలో అనేక నూతన ప్రయోగాలకి శ్రీకారం చుట్టి వేలాదిమంది విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య అందించి ప్రపంచంలో తెలంగాణ విద్యార్థి అన్ని రంగాలలో పోటీపడే విధంగా ప్రయత్నాలు కొనసాగించింది. వైద్యరంగంలో అనేక నూతన ఆసుపత్రులు నిర్మించి పేదలకు వైద్యం అందించి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే పాటను తిరగరాసి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానాకు అనే భావనకి ప్రజలు వచ్చే విధంగా అనేక మౌలికమైన మార్పులు శ్రీకారం చుట్టింది.

నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టి వేలాది పరిశ్రమలు తెలంగాణవైపు రావడానికి కెసిఆర్ ప్రభుత్వం కృషి చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అనేక దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు ఆలోచించని అనేక వినూత్న పథకాలు తెలంగాణలో ప్రారంభించి ప్రజల మన్నన పొంది రెండుసార్లు ప్రజల దీవెనతో అధికారంలోకి రావడం కెసిఆర్‌కి ప్రజల పట్ల ప్రేమ, నిబద్ధత, అభివృద్ధి పట్ల కాంక్ష వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక స్వతంత్ర సంస్థలు రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పథకాలను పరిశీలించి అనేక అవార్డులు ప్రకటించడం తెలంగాణలో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ఇతర పార్టీలకు అడ్డంకిగా మారాయి.

కెసిఆర్ ఆలోచన కంటే సృజనాత్మకమైన ఆలోచనతో ముందుకు రావలసిన పార్టీలు కేవలం టిఆర్‌ఎస్‌పై గుడ్డి వ్యతిరేకత కనబరచడం ప్రభుత్వం తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని సమర్థిస్తే ఎందుకు ప్రతిపక్షం అవుతుంది అని సమర్థించుకోవడం అనేక యాంత్రిక రాజకీయ కోణంలో ప్రతిస్పందించడంతో తెలంగాణ ప్రజలు అనేక సందర్భాల్లో ఆయా పార్టీలకు సరైన జవాబు తమ తీర్పు ద్వారా వెల్లడించారు. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశంలో ఏక పార్టీ పాలన డబుల్ ఇంజిన్ ఉండాలని కుట్రలకు తెరలేపి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి అనేక రాష్ట్రాలలో అక్రమంగా అధికారంలోకి రావడం ప్రారంభమైంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాసే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. రాష్ట్రాలను సంప్రదించకుండా అనేక రంగాలలో ప్రజా వ్యతిరేక సంస్కరణలు తీసుకురావడం, ప్రాంతీ య పార్టీలు దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేయడం, ప్రాంతీయ అస్తిత్వాలను కాలరాయడానికి వాటిపై ఆధిపత్యం కోసం నిరంతరం ప్రయత్నం జరుపుతూనే ఉంది.

ప్రజా పోరాటాలతో వచ్చిన అనేక కార్మిక చట్టాలను తొలగిస్తూ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు తెరలేపింది. రాష్ట్రంలో కెసిఆర్ కృషి వలన వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల వలన, రూపొందించిన మౌలిక సౌకర్యాల వలన లక్షలాది ఎకరాలలో పండిన పంటను కొనాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కును కాలరాసే ప్రయత్నం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసింది. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి అనేక చట్టాల వలన రాష్ట్రాల్లో ప్రజలు పడిన ఇబ్బందులను పట్టించుకోకుండా అసత్య ప్రచారాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చి ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపే ప్రయత్నం చేసింది.

కరోనా కాలంలో లక్షలాది శ్రామికులకు కనీసం వారి స్వస్థలాలకు పోవడానికి ప్రయాణ సౌకర్యం కూడా కలిగించని సన్నివేశాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు బిజెపి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదు. చట్టబద్ధంగా విభజన అంశాలలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసింది. సుదీర్ఘకాలం రైతులు ఉద్యమాలు చేస్తే క్రూరంగా అణచివేసి 900 మంది రైతుల హత్యలకు కారణమైంది. తప్పక చివరికి నల్ల చట్టాలను రద్దు చేసుకుంది. ప్రజా సమస్యల్ని పరిష్కరించని బిజెపికి మిగిలిన ఒకే ఒక ఆయుధం మతం. మతం పేర విభజించి పాలించాలని కుట్రలో భాగంగా శవం కావాలా శివం కావాలా, – ఖురాన్ కావాలా భగవద్గీత కావాలా అనే ప్రశ్నలు వేసి విద్వేషాలను రెచ్చగొట్టి, స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్రలేని పార్టీ చరిత్రను వక్రీకరించడం ద్వారా లబ్ధి పొందే కుటిల రాజనీతికి తెర లేపింది. స్వాతంత్య్ర ఉద్యమం నుండి సాయుధ రైతాంగ పోరాటం వరకు చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నది. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం, నిర్మాణం కార్యాచరణ ఆలోచన లేకపోవడం వలన చతికిలపడిపోయింది.

కనీసం బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్న రాష్ట్రాలను నిలుపుకోవడంలో నాయకత్వం విఫలమైంది. దేశ వ్యాప్తంగా అన్ని శక్తులను కలుపుకొని లౌకిక వాదాన్ని నిలబెట్టడానికి ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల ముందు ఉంచడానికి ఎలాంటి చొరవ తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

ఇలాంటి అనివార్య స్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, రాజకీయ ప్రత్యర్థి ఎవరో తేల్చుకోలేక లౌకికవాదులపైనే తన పోరాటాన్ని ఎక్కుపెట్టి కేరళ, బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపిని బలోపేతం చేసే దుర్మార్గపు సాహసానికి దిగజారింది. ఇలాంటి నేపథ్యంలో జాతీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచే సామాజిక బాధ్యతను కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ పార్టీ తీసుకోవడం చారిత్రక అనివార్యంగా గుర్తించాలి. దేశంలో అపార వనరులు ఉన్నా వాటిని ఉపయోగించుకోలేని అసమర్థ అరాచక రాజకీయాలకు అంతం పలకాలని తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయస్థాయిలో నిలబెట్టడానికి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చే గొప్ప చారిత్రిక సాహసానికి కెసిఆర్ నిర్ణయించడం భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ సాధన కోసం నిలబడినప్పుడు వేసిన ప్రశ్నలకు తెలంగాణ ప్రజలు కెసిఆర్ నాయకత్వంలో సాధించిన గొప్ప విజయం జవాబు చెప్పింది.

రేపు భారతదేశంలో జరిగే కీలక రాజకీయ ఆర్థిక విధానాల మార్పు ఇప్పుడు ఉద్భవిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పి తీరుతుంది. కెసిఆర్ చేపట్టే ప్రతి పని విషయంలో ఇలాంటి ప్రశ్నలే సందేహాలే అందరికీ వస్తాయి. కానీ ఆయన దార్శనికత, నిబద్ధత కార్యాచరణలో తాను తలపెట్టిన లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.తెలంగాణ ఆవిర్భావం అందుకు నిదర్శనం. నీరు పల్ల మెరుగును నిజం దేవుడెరుగును అనే సామెతను తలకిందులు చేసి అత్యంత ఎత్తైన ప్రదేశానికి కాళేశ్వరం నీళ్లు ఇవ్వడం కెసిఆర్ పనితనానికి, వజ్రసంకల్పానికి నిదర్శనం.

జాతీయ పార్టీని స్థాపించడం మామూలు విషయం కాదు. ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా పెట్టడం కెసిఆర్‌కి సాధ్యమవుతుంది. పార్టీ స్థాపించిన తర్వాత, ఎజెండా ప్రకటించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలలో ప్రకంపనలు రావడం ఖాయం. 28 రాష్ట్రాల సమస్యలను ఆకాంక్షలను సరైన రీతిలో ప్రతిబింబించి వాటి కోసం నిటారుగా నిలబడితే ప్రజల దీవెనలు ఉంటే పరిష్కారం చేసుకోవడం అసాధ్యం కాదు. జాతీయ పార్టీపై భిన్నాభిప్రాయాలు రావడం సహజం వాటికి జవాబు భవిష్యత్తు కార్యాచరణ చెబుతుంది.

దేశంలో ప్రస్తుతం బిజెపి పట్ల ఉన్న విశాలమైన ప్రజా వ్యతిరేకత బిఆర్‌ఎస్‌కు బలమైన ప్రాతిపదికగా ఉంటుంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు. టిఆర్‌ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారడం పరిస్థితుల అనివార్యతగా ప్రజలు గుర్తిస్తారు. అయితే వ్యతిరేక శక్తులన్నింటినీ వాటి ఆకాంక్షల్ని గౌరవించి ఐక్య పోరాటాలతో తీసుకొచ్చే గొప్ప కార్యాచరణ రూపొందించి కెసిఆర్ నాయకత్వంలో ముందుకు పోవడం భారత దేశ ప్రజలకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక అవసరం. టిఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అవతరించడం తెలంగాణ అస్తిత్వం కనుమరుగవుతుందని ఆలోచనకు తావు లేదు. ప్రాంతీయ అన్యాయాలను అస్తిత్వాలను సరైన రీతిలో గౌరవించే ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించే ఎజెండా రూపొందించి ముందుకు పోవడం దీనికి జవాబు దొరుకుతుంది. కెసిఆర్ చేస్తున్న సాహసోపేతమైన నిర్ణయానికి అందరం మద్దతు పలుకుదాం నూతన రాజకీయ కార్యాచరణతో భాగమవుదాం. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కావాలని తపన పడుతున్న వేలాదిమంది మేధావులకు బిఆర్‌ఎస్ ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ….

దేవి ప్రసాద్
9000633404
(టిఎన్‌జిఒ మాజీ అధ్యక్షుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News