Sunday, April 28, 2024

సంక్షోభంలోనూ సంక్షేమాన్ని వదల్లేదు

- Advertisement -
- Advertisement -

CAG report on TS welfare schemes

 

ఐదు నెలల్లో పేదల కోసం రూ. 34,762 కోట్లు ఖర్చు
సగటున నెలకు రూ.7వేల కోట్లు వినియోగం
ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి సహా వివిధ పథకాల నిధులకు ఢోకా లేకుండా చూసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆగస్టు వరకు రూ.31,037 కోట్ల రెవెన్యూ ఆదాయం
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ తాజా నివేదిక

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికే పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. ఒకవైపు లాక్‌డౌన్‌తో ఆదాయం తగ్గినా ప్రతామ్నాయంగా ఎప్పటికప్పుడు రుణాలను సమకూర్చుకుని పేదల పాలిట ప్రభుత్వం నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల కాలంలో మొత్తం రూ.53,307 కోట్లు ఖర్చు చేసింది. ఆగస్టు నెల వరకు ఇందులో రూ.34,762 కోట్లు సంక్షేమానికే ఖర్చు పెట్టింది. అంటే సగటున రూ.7 వేల కోట్లు ఈ ఐదు నెలల్లో రైతులు, పేదల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. మిగతా రూ.18,545 కోట్లు జీతాలు, పెన్షన్‌లకు, రుణాల వడ్డీలకు వినియోగించింది. మూలధన వ్యయం రూ.5169 కోట్లుగా ఉంది. ఈ మేరకు కంప్రోల్టర్ అండ్ అడిటర్ జనరల్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మీ,ఆరోగ్య లక్ష్మీ,మహిళా సంక్షేమం, పేదలకు ఉచిత బియ్యం, కుటంబానికి రూ.1500 చొప్పున రెండు నెలలు అందించడం వంటి పథకాలకు ప్రభుత్వం నిధులను వెచ్చించింది.

అలాగే ప్రధానంగా కరోనా నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖకు ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తోంది. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆగస్టు నాటికి పన్ను ఆదాయం రూ.25,159 కోట్లు వచ్చింది. నిర్దేశించుకున్న లక్షంలో ఈ మొత్తం 24.66 శాతంగా ఉంది. ఇందులో వస్తు సేవల పన్ను ద్వారా ప్రభుత్వానికి రూ.8224 కోట్లు సమకూరింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1523 కోట్లు రాబడి వచ్చింది. అమ్మకపు పన్ను రూ.6256 కోట్లు రాగా, ఎక్సైజ్ ఆదాయం రూ.4847 కోట్లు వచ్చినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా రూ.3125 కోట్లు రాగా, ఇతర పన్నులు, డ్యూటిస్ ద్వారా రూ.1182 కోట్లు ఆదాయం సమకూరింది. ఇక ఆగస్టు నాటికి పన్నేతర ఆదాయం రూ.1373 కోట్లుగా ఉంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మొత్తం రూ.4504 కోట్లు రాబడి వచ్చింది.

క్రమంగా పెరుగుతున్న పన్ను ఆదాయం

లాక్‌డౌన్ సడలింపుల అప్పటి నుంచి రాష్ట్ర పన్ను ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో రూ.6677 కోట్లు వచ్చింది. అదే గతేడాది ఆగస్టు నెలలో మాత్రం రూ.5546 కోట్లు మాత్రమే. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉండటంతో వరుసగా రూ.1700 కోట్లు, రూ.3682 కోట్లు పన్ను రాబడి సమకూరింది. ఇక లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో జూన్ నెలలో రూ.6510 కోట్లు, జూలైలో రూ.6588 కోట్లు వచ్చింది. మొత్తం పన్ను ఆదాయం రూ.25,159 కోట్లుగా ఉంది. ఇక ఆగస్టు నెలలో పన్నేతర ఆదాయం రూ.304 కోట్లు, అప్పుల ద్వారా రూ.3935 కోట్లు తీసుకుంది.

ఐదు నెలల్లో ఖర్చు ఇలా

రాష్ట్ర సొంత రాబడితో పాటు రుణాల ద్వారా సమకూర్చుకున్న నిధులను ప్రభుత్వం ఆ మేరకు ఖర్చు చేసింది. ఇందులో కాగ్ నివేదిక ప్రకారం రెవిన్యూ వ్యయాన్ని పరిశీలిస్తే ఏప్రిల్‌లో రూ.4602 కోట్లు, మే నెలలో రూ.6430 కోట్లు, జూన్‌లో రూ.5584 కోట్లు, జూలైలో రూ.4693 కోట్లు, ఆగస్టులో రూ.4563 కోట్లుగా ఉంది. ఇతర ఖర్చులు రుణాల వడ్డీలు, జీత, భత్యాలు, పెన్షన్‌లు ఉన్నాయి.

పేదల పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ కమిట్‌మెంట్‌కు నిదర్శనం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

కరోనాతో లాక్‌డౌన్ విధించుకున్నాం. ప్రభుత్వానికి రెండు నెలల పాటు అసలు ఆదాయం లేని పరిస్థితి. అటువంటి సమయంలోనూ పేదల సంక్షేమ వైపే సిఎం కెసిఆర్ ఆలోచించారు. ముఖ్యంగా రైతులకు అండగా నిలిచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాం. సమయానికి రైతుబంధు ఇచ్చినం. విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టి పేదలకు ఆసరా పెన్షన్‌లు అందించాం. ఇది టిఆర్‌ఎస్ ప్రభుత్వం కమిట్‌మెంట్. పేదలకు ప్రభుత్వ సొమ్ము పథకాల రూపంలో నేరుగా అందాలనేది సిఎం ఆలోచన. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ ఈ ఐదు నెలల్లో తెలంగాణ మాదిరి సంక్షేమం కొనసాగలేదు. ఆదాయం పుంజుకుంటే పేదలకు లబ్ధి చేకూరేలా మరిన్ని పథకాలు సిఎం ప్రకటిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News