Monday, May 6, 2024

స్పీడ్ పెంచిన ‘కారు’

- Advertisement -
- Advertisement -

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్
ప్రజలకు మరింత చేరువ కావడానికి
మంత్రులు, ఎంఎల్‌ఎల ముమ్మర కార్యక్రమాలు
జిల్లాల్లో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల సుడిగాలి పర్యటనలు
పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ‘కారు’ స్పీడ్ పెంచింది. ప్రజలకు మరింత చేరువ కావడానికి కారును మరింత వేగంగా ప్రజల చెంతకు తీసుకువెళుతున్నారు.అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఒక పక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తూనే, మరో పక్క పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మంత్రులు, ఎంఎల్‌ఎలు వారి వారి నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక్కొక్క రోజు 15 నుంచి 25కు పైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాలకు ప్రచారం కోసం వచ్చేవరకు సమస్యలను అన్నింటినీ పరిష్కరించుకొని ఎన్నికలకు సిద్ధం కావాలన్న లక్ష్యంతో మంత్రులు, ఎంఎల్‌ఎలు ఉన్నారు.
కెటిఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలు
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, బిఆర్‌ఎస్ కీలక నాయకులు, మంత్రి హరీశ్‌రావులు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండటంతో పార్టీ కేడర్‌లో జోష్ పెరుగుతోంది. మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు ఒక్కపక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూనే మరో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కేడర్‌లో భరోసా నింపుతున్నారు. ఇద్దరు నేతలు హెలికాప్టర్‌లో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఒక్కో రోజు దాదాపు 5 నుంచి 10కిపైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బలంగా అసమ్మతి ఉన్న నియోజకవర్గాలలో ఇప్పటికే సంప్రదింపులు జరిపి అసమ్మతిని చల్లార్చింది. అసమ్మతి ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థుల విషయంలో పార్టీ కేడర్‌కు స్పష్టతనిస్తూ అభ్యర్థిని గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేసేందుకు సమాయత్తం చేస్తున్నారు.
జోరుగా ప్రారంభోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాలు
రాష్ట్రంలో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మధ్యకు వెళ్తేనే.. మరోవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలలో వేగం పెంచారు. ప్రతి రోజూ ప్రభుత్వం కార్యక్రమాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలను సైతం నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ లేక్ ఫ్రంట్ పార్క్, సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించడంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ వేగవంతం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు ముమ్మరం చేశారు.
‘సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం’తో నవ శకానికి నాంది
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నవ శకానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందించేందుకు మానవీయ కోణంలో స్పందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించగా, వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అలాగే జిల్లాలు, నియోజకవర్గాలలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందించి, విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం వల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News