Wednesday, May 1, 2024

బాగున్నాయ్

- Advertisement -
- Advertisement -

Central Team

 

తెలంగాణలో కరోనా నివారణ వ్యూహాలు అద్భుతం
కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు భేష్
ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తోంది

రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ప్రశంసలు
వైద్య సదుపాయాలు, క్వారంటైన్లు, కంటైన్మెంట్ల నిర్వహణ, పేదలు, వలస కార్మికులకు ప్రభుత్వ సాయంపై సిఎస్ వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయని కేంద్రబృందం ప్రశంసించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులను తెలుకునేందుకు మొదటి రోజు పర్యటన పూర్తయిన తర్వాత కేంద్ర బృందం ప్రతినిధులు శనివారం సాయంత్రం సిఎస్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. బి.ఆర్.కె భవన్‌లో సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ఈక్రమంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు.

ఈసందర్బంగా కేంద్ర ప్రతినిధులు మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు అద్బుతంగా ఉన్నాయన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు బాగున్నాయన్నారు. అధికారులు కూడా ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తున్నారని కేంద్రం కొనియాడింది. అనంతరం సిఎస్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ..కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతతో పనిచేసేందుకు కోవిడ్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేశామని కేంద్ర ప్రతినిధులకు తెలిపారు.

రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు, కంటైన్‌మెంట్ జోన్‌ల నిర్వహణ, క్వారంటైన్ సెంటర్లు, ఆసుపత్రుల సన్నద్దత, నిఘా బృందాలు ఏర్పాటు, వైద్య పరీక్షలు, హెల్ఫ్‌లైన్‌తో, వైద్యపరికరాల సేకరణ, తెల్లరేషన్‌కార్డు, లబ్థిదారులకు ఉచిత బియ్యం పంపిణీ, వలస కార్మికులకు అన్నపూర్ణ సెంటర్లు, షెల్టర్‌హోమ్స్, తదితర అంశాలపై వివరణాత్మకంగా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కొవిడ్‌పై నిత్యం మానిటరింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నారన్నారు. అదే విధంగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ కేంద్ర బృందానికి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం అధికారులు అరుణ్‌భరోకా, ప్రజా ఆరోగ్య సీనియర్ స్పెషలిస్టు డా చంద్రశేఖర్, ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా హేమలత, నేషనల్ కన్సూమర్, అఫెర్స్ మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ ఠాకుర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అసొసియేట్ ప్రో శేఖర్ చతుర్వేదిలతో పాటు రాష్ట్ర అధికారులు వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వ్యవసాయ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి , హైదరాబాద్ సి.పి అంజనీకుమార్, పంచాయితీరాజ్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, సివిల్ సప్లయ్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఐఏఎస్ అధికారులు రోనాల్డ్‌రాస్, రజత్‌కుమార్ సైనీ, సర్ఫరాజ్ అహ్మాద్ తదితరులు పాల్గొన్నారు

 

Central Team Observation at TIMS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News