Wednesday, May 1, 2024

కరోనా కోరలు ఊడుతున్నాయ్

- Advertisement -
- Advertisement -

Corona cases

 

రాష్ట్రంలో క్రమంగా అదుపులోకి మహమ్మారి, హడలెత్తించిన జిల్లాల్లోనూ ఒకటి, రెండు కేసులకే పరిమితం, నాలుగు జిల్లాల్లో జీరో కేసులు, ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు, వచ్చే వారం రోజులు కీలకం, కేసుల ఆధారంగానే లాక్‌డౌన్ సడలింపు నిర్ణయం? గ్రేటర్ పరిధిలో 45 కంటైన్మెంట్ల ఎత్తివేత

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పరిస్థితులు మెల్లగా ఆదుపులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు కేసులు అధికంగా నమోదైన జిల్లాల్లోనూ జీరోకు పడిపోవడం, కొన్ని జిల్లాలో ఒకటి, రెండు కంటే ఎక్కువగా పాజిటివ్ రావడం లేదు. మర్కజ్, విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కాంటాక్టులకు పరీక్షలు ముగియడంతో ఇప్పుడు లక్షణాలతో వస్తున్న అనుమానితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారికి ఎలా వైరస్ సోకిందో వివరాలు సేకరించడంతో పాటు… వ్యాప్తి ఎలా జరిగిందనే దానిపై ఒక అంచనాకు వచ్చి రానున్న వారం రోజుల్లో ఒక నివేదికను రూపొందించనుంది. దాని ఆధారంగానే మే 3వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపు, ఇతర సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు ఉన్నతస్థాయి అధికారి ఒకరు మన తెలంగాణకు వెల్లడించారు. ప్రభుత్వం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయడం, కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్, పాజిటివ్ వ్యక్తులను కాంటాక్ట్ అయిన ప్రైమరీ, సెకండరీ వ్యక్తులను ట్రేస్ చేసి పరీక్షలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని ఆదుపులోకి తీసుకువచ్చింది.

దీంతో గత మూడు రోజులుగా కేసుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. సగటున ఒక్కో రోజు 700 మంది నుంచి 800 మందికి పరీక్షలు జరుపుతున్నారు. మూడు రోజుల నుంచి నమోదైన కేసుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది.ఈ నెల 22న 15 పాజిటివ్ కేసులు, 23న 27 కేసులు, 24న 13 కేసులు, 25న కేవలం ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వారం, పది రోజుల పాటు నిజామాబాద్, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, జిహెచ్‌ఎంసిలలో విజృంభించిన వైరస్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా నిజామాబాద్‌లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి మర్కజ్ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేసిన ప్రభుత్వం వారందరికీ పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు అనుమానంతో వచ్చిన వారు, ఎటువంటి లక్షణాలు లేకుండా బయటపడుతున్నవారు ఒక్కొక్కరిగా వస్తున్నారు. వీరికి టెస్టులు చేసి పాజిటివ్ వస్తే ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేస్తున్నారు.

అదే సమయంలో ఎలా వైరస్ వచ్చిందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. దీనిద్వారా వైరస్ ఏ మేరకు వ్యాప్తి చెందిందనే దానిపై ఒక అంచనాకు రానున్నారు. ఒకవేళ అనుమానంతో, లక్షణాలతో వచ్చిన వారికి నెగిటివ్ వస్తే పూర్తిగా కరోనా కంట్రోల్‌లోకి వచ్చినట్లేనని, అందుకు అనుగుణంగా మే 7 తరువాత లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. నాలుగు జిల్లాల్లో వనపర్తి, వరంగల్ రూరల్, యదాద్రి భువనగిరి, మంచిర్యాల్ జిల్లాల్లో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

లక్షణాలపై గందరగోళం
నాలుగు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం విదేశాల నుంచి 25,937 మంది రాగా, వారిలో 32 మందికి పాజిటివ్ వచ్చింది. వారితో కాంటాక్ట్ అయినవారు 918 కాగా, వారిలో 18 మందికి కరోనా సోకింది. ఇక మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు 1345 మందికాగా, వారిలో 237 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మర్కజ్ వెళ్లివచ్చిన వారితో కాంటాక్ట్ అయినవారు 3,193 మంది కాగా, వారిలో 537 మందికి కరోనా సోకిందని ఈ నివేదికలో పేర్కొంది. అయితే వారిలో దాదాపు 100 నుంచి 120 మంది వరకు 14 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు బయటపడటంతో పాటు పాజిటివ్ వచ్చింది. కొందరికి 20 రోజులకు, మరికొందరికి 22 రోజులకు, ఒకరిద్దరికైతే 28 రోజులకు కూడా కరోనా లక్షణాలు వెలుగుచూసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే క్వారంటైన్ పీరియడ్‌ను 28 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

Corona cases are on Decline
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News