Wednesday, May 15, 2024

హమ్మయ్య… ఏడు కేసులే

- Advertisement -
- Advertisement -

Corona

 

16 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 990కి చేరిన కరోనా బాధితులు, కొవిడ్ రోగులకు పండ్లతో ఇఫ్తార్
గాంధీలో రెండు గంటలకొకసారి శానిటేషన్
రేపట్నించి నల్లగొండ, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ర్యాండమ్ టెస్టులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితుల డిశ్చార్జ్‌ల సంఖ్య పెరుగుతోంది. శనివారం 16 మంది డిశ్చార్జ్ కాగా, కొత్తగా ఏడుకేసులు మాత్రమే నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 6, వరంగల్ అర్బన్‌లో మరోక కేసు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 990కి పెరిగింది. ఇప్పటి వరకు వేర్వేరు ఆసుపత్రుల్లో 658 మంది చికిత్స పొందుతుండగా, మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 307, మరణాల సంఖ్య 25గా ఉందని అధికారులు వెల్లడించారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతుండగా, ఇప్పటికే వైరస్ బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో ప్రతి రోజూ సుమారు 40 నుంచి 50 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టా యి. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం బుధవారం 15 పాజటివ్ కేసులు నమోదుకాగా, గురువారం 27 కేసులు, 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం కూడా కేవలం 13 కేసులు రాగా 29 మంది డిశ్చార్జ్ అయ్యారు.

శుక్రవారంతో పోల్చితే శనివారం రోజున సగానికి తగ్గి కేవలం 7 కేసులు మాత్రమే నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశమే. అయితే కేసులు తగ్గడంలో అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పలువురు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సిఎం, వైద్యమంత్రి నిరంతరం పర్యవేక్షణతో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. కొవిడ్ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, లక్ష పాజిటివ్‌లు వచ్చిన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

కొవిడ్ పాజిటివ్ వ్యక్తులకు పండ్లతో ఇఫ్తార్
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్బంగా ప్రతి రోజూ ముస్లీం కొవిడ్ పాజిటివ్ రోగులకు ఉపవాస దీక్షను విరమించడానికి పండ్లు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. తగిన జాగ్రత్తలతో వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లన్ని చేయాలని మంత్రి చెప్పారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి గాంధీ ఆసుపత్రిలో పలువురు రోగులకు పండ్లతో ఇప్తార్‌ను ఇచ్చారు. ఈసందర్బంగా రోగులు గాంధీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

గాంధీలో రెండు గంటలకోసారి శానిటేషన్
గాంధీ ఆసుపత్రిలో రెండు గంటలకోసారి కొవిడ్ వార్డులను శానిటేషన్ చేస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా రాజారావు తెలిపారు. ఆసుపత్రిలో రోగులపై ఎంత జాగ్రత్తలు వహిస్తున్నామో, ఆసుపత్రి పరిశుభ్రతపై కూడా అంతే దృష్టి పెడుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి రోజు రెండు గంటల వ్యవధిలో డిస్‌ఇన్పెక్ట్ లిక్విడ్‌తో శుభ్రం చేస్తున్నామన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న గాంధీ వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రతి ఒక్కరూ మనోధైర్యం కల్పించేలా కృషి చేయాలని కోరారు. డిశ్చార్జ్ అయిన రోగులు సౌకర్యాలు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సోమవారం నుంచి ర్యాండమ్ టెస్టులు
తెలంగాణలోని మూడు జిల్లాల్లో ర్యాండమ్ టెస్టులు చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి తొలి విడతగా నల్గొండ, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనుమానిత లక్షణాలు కల్గిన వారి నుంచి సుమారు 100 నుంచి 150 మంది శాంపిల్స్ అన్ని సేకరించి, సిసిఎంబిలో ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ నెగటివ్ వస్తే వాళ్లందరికి వైరస్ సోకలేదని, పాజిటివ్ వస్తే మొత్తం అందరికి తిరిగి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. దీని వల్ల సమయం ఆదా కావడమే కాకుండా, ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

 

Discharge of corona victims in state is increasing
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News