Monday, April 29, 2024

ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు

- Advertisement -
- Advertisement -

ఖరీఫ్ పంటల మద్దతు ధరలు ఖరారు
వరికి క్వింటాలు ధర రూ 72 పెంపు
నువ్వులకు రూ 452 హెచ్చింపు
కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో తొలకరి తరుణంలో కేంద్రం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల కనీస మద్దతు ధరలను ఖరారు చేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కనీస మద్దతు ధరలు(ఎంఎస్‌పి) పెంపుదలకు ఆమోదం తెలిపారు. వరి ధాన్యం ధరను క్వింటాలకు రూ 72 మేర పెంచారు. ఇప్పటివరకూ క్వింటాలు ధర రూ 1868. ఇప్పటి పెంపుదలతో క్వింటాలు ధర రూ 1940 చెల్లిస్తారు. వరి ధాన్యంతో పాటు ఇతర పంటల కనీస మద్దతు ధరలను కూడా ఖరారు చేశారు. క్వింటా నువ్వులకు కనీస మద్దతు ధరను రూ 452 పెంచారు. ఇక క్వింటాలు కంది, మినుములు కనీస మద్దతుధరలను రూ 300 మేర కేంద్రం పెంచింది. ఇప్పటి వరకూ క్వింటాలు సజ్జలకు రూ 2150 ఇస్తున్నారు. దీనిని ఇప్పుడు రూ 2250కి పెంచారు. ఈ విధంగా జొన్నలకు వందరూపాయలే పెరిగింది. 202122 మార్కెట్ సీజన్‌కు సంబంధించి పెరిగిన కనీస మద్దతు ధరలు వర్తిస్తాయి.

కేబినెట్ సమావేశం అనంతరం వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరులకు తెలిపారు. ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం ఉంటుందని, సకాలంలోనే వానలు పడుతాయనే విశ్లేషణల నడుమ ఖరీఫ్‌కు సంబంధించి మద్దతు ధరలను కేంద్రం ఖరారు చేసింది. ఖరీఫ్‌కు సంబంధించి అన్నింటితో పోలిస్తే వరి ప్రధానమైన పంటగా ఉంది. వర్షాలు పడుతూ ఉండగానే వరినాట్లు వేస్తుంటారు. ప్రత్యేకించి దక్షిణాదిలో విస్తారంగా వరి పంట వర్షాధారిత పంటగా ఉంది. కనీస మద్దతు ధరల గురించి ఎటువంటి ఆందోళనలు అవసరం లేదని, పంటలకు ప్రోత్సాహపు ఆయువు పట్టు వంటి మద్దతు ధరలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయని, భవిష్యత్తులో కూడా ఇవి ఉండనే ఉంటాయని వ్యవసాయ మంత్రి తెలిపారు. వ్యవసాయ చట్టాల నేపథ్యంలో మద్దతు ధరలు ఉండబోవని, అంతా వ్యాపారుల గుత్తాధిపత్యం చేతిలోకి పోతుందనే రైతాంగపు ఆందోళనలు సుదీర్ఘ దీక్షలుగా సాగుతున్న దశలో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైతుల సాగు వ్యయంతో పోలిస్తే ఏ పంటకు అయినా కనీసం 50 శాతం అంతకు మించి లాభం ఉండేలా చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ దిశలో అత్యధికంగా సజ్జ పంటపై ఎక్కువ మద్దతు ధర అంటే 85 శాతం దక్కుతుంది. తరువాతి క్రమంలో మినపపప్పు 65 శాతం కంది 62 శాతం వరకూ మద్దతు ధరలు దక్కుతాయని వ్యవసాయ వర్గాలు అంచనావేశాయి.
రైల్వే సిగ్నలింగ్ పటిష్టం
భారతీయ రైల్వేలో మరింత భద్రత, ప్రమాదాల నివారణకు కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ తీసుకుంది. ఇందుకు అవసరం అయిన 5 ఎంహెచ్‌జడ్ స్పెక్ట్రమ్‌ను 700 ఎంహెచ్ జడ్ బ్యాండ్‌లో అనుసంధానించింది. ఈ బృహత్తర కార్యక్రమానికి దాదాపుగా రూ.25,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని కేబినెట్ వివరాలను వివరించినదశలో సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థ కోసం అత్యధికంగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌పై ఆధారపడుతున్నారని, దీనిని ఇప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన స్పెక్ట్రమ్ దిశకు తీసుకువెళ్లుతున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. ఇప్పటి మార్పుతో హై స్పీడ్ రేడియో సిగ్నల్స్‌ను ఖచ్చితమైన సమయంలో నిర్ణీత దూరాలకు ఎప్పటికప్పుడు అందించేందుకు వీలేర్పడుతుంది.

Centre announces hike in MSP for Kharif crops

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News