Friday, May 3, 2024

ఉద్దీపన రుణాలతోనా?

- Advertisement -
- Advertisement -

Centre announces stimulus package worth over Rs 628993 crore

 

మొదటి కొవిడ్ బాధల నుంచి కాపాడడానికి గత ఏడాది మే నెలలో రూ. 20 లక్షల కోట్ల అతి భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ ప్రభుత్వం అనూహ్య స్థాయిలో విజృంభించిన సెకండ్ వేవ్ సందర్భంగా తాజాగా రూ. 6 లక్షల 28 వేల కోట్లతో మరో ప్యాకేజీని సోమవారం నాడు విడుదల చేసింది. అప్పుడు మొదటి ప్యాకేజీని వరుసగా ఐదు రోజుల పాటు సీరియల్ పద్ధతిలో ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామనే ఇప్పుడు రెండవ దానిని కూడా అందించారు. తాజా ప్యాకేజీలో మొదటి దానిలో మాదిరిగానే కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల దెబ్బతిన్న వివిధ పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు సులభ రుణాలను గుప్పించారు.

మెట్రో నగరాల బయట సరికొత్తగా నెలకొన్న, ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు రూ. 50 వేల కోట్ల కిమ్మత్తు రుణ సదుపాయం, రుణాలపై వడ్డీ రేటును 7.95 శాతానికి పరిమితం చేయడం, చిన్న పిల్లల ఆరోగ్య భద్రతను పెంచడానికి ఉద్దేశించిన పబ్లిక్‌రంగ ప్రాజెక్టులకు ఐసియు బెడ్లు, ఆక్సిజన్ సరఫరా రంగాలకు, వైద్య సిబ్బందికి రూ. 15 వేల కోట్లు, అత్యవసర రుణ గ్యారం టీ పథకం కింద అదనంగా రూ. 1.5 లక్షల కోట్లు, 25 లక్షల మంది స్వల్ప రుణ గ్రహీతలకు మైక్రో ఫైనాన్స్ కంపెనీల ద్వారా స్వల్ప వడ్డీపై పూచీలేని అప్పులివ్వడానికి రూ. 7500 కోట్లు, విహార యాత్రా రంగాన్ని ప్రోత్సహించడానికి టూరిజం ఏజెంట్లు, గైడ్లకు రూ. 11 వేల కోట్ల మేరకు తాజా రుణాలు, దేశంలో విహార యాత్రకు వచ్చే మొదటి 5 లక్షల మందికి ఉచితంగా వీసాలివ్వడం, నెలకు రూ. 15 వేల కంటే తక్కువ జీతం ఉద్యోగులకు ఇపిఎఫ్ రాయితీలువచ్చే మార్చి వరకు వర్తింప చేయడం వంటివి ఈ ప్యాకేజీ ప్రధానాంశాలుగా ఉన్నాయి.

ఇంతకు ముందే ప్రకటించిన పేదలకు నవంబర్ వరకు ఉచిత ఆహార ధాన్యాల సరఫరా, ఎరువులపై పెంచిన సబ్సిడీ వంటి వాటిని కూడా ఇందులో చేర్చారు. అందుచేత ఈ ప్యాకేజీని చూసీచూడగానే ఇది కూడా రుణానుబంధ సాయమేనని అర్థమైపోయింది. పేదలకు నవంబర్ వరకు ఉచిత ఆహార ధాన్యాల పంపి ణీ, ఎరువులపై సబ్సిడీ పెంపు మినహా కొవిడ్ వల్ల ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మందికి, సెకండ్ వేవ్ వల్ల మళ్లీ అనేక కష్టాలు అనుభవించిన వలస కార్మికులకు ఈ పథకం నుంచి ఒరిగేదేమీ ఉండదని చెప్పవచ్చు. గత ఏడాది మే నెలలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ లోని నిబంధనలు కఠినంగా ఉన్నందున దాని వల్ల లభిస్తుందని చెప్పిన రుణ సదుపాయాన్ని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇలు) పొందలేకపోయాయని అనుభవంలో నిగ్గు తేలింది. గత ప్యాకేజీ వల్ల తెలంగాణ లోని 80 శాతం ఎంఎస్‌ఎంఇలకు ఎటువంటి ప్రయోజనం సిద్ధించలేదని, 20 శాతం ఎంఎస్‌ఎంఇలు తిరిగి కోలుకోలేని విధంగా మూతపడిపోయాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు స్వయంగా ప్రకటించారు.

అందుచేత వాటికి గ్రాంట్ రూపంలో సాయం చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రికి ఇటీవలే లేఖ రాశారు. తక్కువ వడ్డీకి రుణాలిచ్చేందుకు గత ప్యాకేజీలోని 40 శాతం మొత్తాన్ని బ్యాంకులకు అందుబాటులో ఉంచే బాధ్యతను రిజర్వు బ్యాంకు మీద పెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని గాని రుణాలివ్వని, అలాగే అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెట్టే పద్ధతి బాగా అలవాటైపోయిన బ్యాంకులు కేంద్రం ప్రకటించే ఈ రుణ వితరణ పథకాలను అమలు చేయడంలో ఎంత విముఖంగా వ్యవహరిస్తాయో తెలుసు. ప్యాకేజీలోని షరతులను సంతృప్తి పరచలేక లాక్‌డౌన్ మూసివేతల వల్ల అప్పటికే కుంగికునారిల్లిపోయిన చిన్న పరిశ్రమల యజమానులు ఎంతగా విసిగిపోయి బ్యాంకులకు ఓ దండం పెట్టేస్తారో ఊహించవచ్చు. మొదటి ప్యాకేజీ పేరిట వివిధ రంగాల్లో భారీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

తల్లి అడుగు జాడల్లోనే పిల్ల మాదిరిగా తాజా ప్యాకేజీ కూడా రుణాలనే సాయంగా చూపిస్తోంది. నెలల తరబడి మూతపడిపోయిన అవ్యవస్థీకృత రంగంలోని ఉత్పాదక సంస్థలకు, వాటిలో పని చేసి కొవిడ్ కాలంలో నిరుద్యోగులైపోయిన అసంఖ్యాక అభాగ్యులకు నేరుగా నగదు సాయం చేయడం వల్ల వారు ఆర్థికంగా మెరుగు పడి, వారి జీవన వ్యయం పెరిగి మార్కెట్‌లో అమ్మకాలు పై చూపు చూస్తాయనీ, పర్యవసానంగా ఆర్థిక వృద్ధి రేటు పుంజుకుంటుందని నిపుణులు ఎంతో కాలంగా చెబుతున్నారు. అలాగే పట్టణ పేదలకు కూడా ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఇటువంటి మంచి ఆలోచనలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం రుణాలకు విశేష ప్రాధాన్యతనిచ్చే ఇటువంటి ప్యాకేజీలు ప్రకటించినందువల్ల ఆశించిన లక్షం నెరవేరదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News