Sunday, April 28, 2024

ఆంధ్రకు సై.. తెలంగాణకు నై

- Advertisement -
- Advertisement -

అప్పుల సేకరణకు అనుమతిపై కేంద్రం వివక్ష

రూ.వెయ్యి కోట్ల రుణ సమీకరణకు ఎపికి గ్రీన్‌సిగ్నల్, తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ మొండిచెయ్యి
ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడే రాష్ట్రం అప్పులు
ఈ చట్టాన్ని ఉల్లంఘించిన 11 రాష్ట్రాలకూ అనుమతులు, చట్టాన్ని గౌరవిస్తే వేధింపులు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడగకపోయినా అప్పులు ఇస్తూనే ఉందనే విమర్శలున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ప్రతినెలలోనూ నిర్వహించే రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఠంఛనుగా పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఏ రూలు ప్రకారం అనుమతులు ఇచ్చిందో అర్ధంకావడం లేదని, కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేంద్రం అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇవ్వకుండా భారీగా కోతలు విధించడంపై జాతీయస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. తాజాగా గురువారం నాడు రిజర్వు బ్యాంకు నిర్వహించిన వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల నిధులను సెక్యూరిటీ బాండ్ల వేలంలో వచ్చాయి. బీహార్ రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయలు అప్పుల రూపంలో నిధులు సమకూరాయి. అదే విధంగా తమిళనాడు రా ష్ట్రం సెక్యూరిటీ బాండ్లను వేలానికిపెట్టి 2000 కోట్ల రూపాయల నిధులను అప్పులు తెచ్చుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభానికి ముందే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే అప్పుల రూపంలో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలోని నియమ నిబంధనలకు లోబడి 53,970 కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకునేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టారని, ఈ బడ్జెట్‌ను కేంద్రానికి, ఆర్‌బిఐకి కూడా పంపించామని, మొదట్లో తెలంగాణ బడ్జెట్‌ను ఆమోదించిన కేంద్రం తీరా రాజకీయంగా వచ్చిన విభేదాల కారణంగా తెలంగాణకు రావాల్సిన 53,970 కోట్ల రూపాయల అప్పుల్లో భారీగా కోతలు విధించడం చర్చనీయాంశమయ్యింది. ఇప్పటి వరకూ కార్పోరేషన్ల పేరుతో సేకరించిన అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని, ఆ అప్పులను కూడా ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టం పరిధిలోనే లెక్కిస్తామని మెలికపెట్టి కేంద్రం చేసిన తప్పుడు వాదనలతో తెలంగాణ రాష్ట్రం సుమారు 20 వేల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చిందని ఆ అధికారులు వివరించారు. 2020వ సంవత్సరం నుంచి 2021వ సంవ్సరంలో కార్పోరేషన్ల ద్వారా సేకరించిన పాత అప్పులను కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చిన ఉత్తర్వులపై తెలంగాణతోపాటుగా దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయని తెలిపారు. ఎఫ్.ఆర్.బి. ఎం. చట్టానికి లోబడి అప్పులు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో చర్చలు జరిపి లిఖిత పూర్వకంగా లేఖలు ఇచ్చినప్పటికీ, వాటన్నింటికీ కేంద్ర సర్కార్ పెద్దలు బుట్టదాఖలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో జమ్ము-కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, బీహార్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, హర్యానా రాష్ట్రాలు అప్పులకు తిరిగి చెల్లింపులు, వడ్డీల చెల్లింపులు భారీగా ఉన్నాయని, ఈ రాష్ట్రాలు ఎఫ్.ఆర్.బి.ఎం.పరిమితులను దాటిపోయి అప్పులు చేస్తున్నప్పటికీ కేంద్రం కొత్త అప్పులకు ఆయా రాష్ట్రాలకు అనుమతులు మంజూరు చేస్తూనే ఉందని, ఒక్క తెలంగాణ రాష్ట్రం విషయానికొచ్చేసరికే రూల్సు పేరుతో అప్పులకు అనుమతులు ఇవ్వకుండా వేధించడమే కాకుండా, చట్ట ప్రకారం సేకరించుకునే రుణాల్లోనూ కోతలు విధించడం కేంద్ర ప్రభుత్వం ధ్వంధ్వ నీతిని నిదర్శనమని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలాగని ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా మిగతా రాష్ట్రాలన్నింటికీ అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, తమకెలాంటి అభ్యంతరం కూడా లేదని, కానీ అన్ని రాష్ట్రాలను కేంద్రం సమభావంతో చూడాలేగానీ ఇలా పక్షపాత ధోరణితో ఆర్ధికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేయడం సబబుకాదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాత అప్పులకు కొత్త రూల్సును అమలుచేస్తూ వనరుల సమీకరణకు అడ్డంకులు సృష్టించడం అన్యాయమని అంటున్నారు. ఇకనైనా కేంద్రం తమ విధానాలను మార్చుకొని అన్ని రాష్ట్రాలను సమభావంతో చూడాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టానికి లోబడే అప్పులు చేసుకోవడానికి అనుమతులు కోరిందని, కానీ ఇప్పుడు కేంద్రం అప్పులకు అనుమతులు ఇస్తున్న రాష్ట్రాలన్నీ ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టాన్ని ఉల్లంఘించి, పరిధులు, పరిమితులకు మించి అప్పులు తెచ్చుకొంటున్నా ఆ రాష్ట్రాలకు అండగా ఉంటున్న కేంద్రం ఒక్క తెలంగాణ విషయానికొచ్చేసరికే వేధింపులకు పూనుకోవడం భావ్యంగా లేదని అంటున్నారు. వనరుల సమీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహిస్తోందని, ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి అనేక రకాలుగా వేధింపులకు పూనుకుంటోందని స్పష్టమయ్యిందని, ఈ విషయంలో తెలంగాణలోని సామాన్య ప్రజలకు కూడా సంపూర్ణంగా అర్ధమయ్యిందని వివరించారు. ఇకనైనా కేంద్రం తన వైఖరిని మార్చుకొని తెలంగాణకు సహకరించాలని కోరుతున్నారు.

Centre not given permission to telangana to collect debts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News