Sunday, May 12, 2024

చేవెళ్ల ఎంపీ సీటు రూ. 100 కోట్లకు బేరం

- Advertisement -
- Advertisement -

డబ్బు మూటలతో పార్టీ టికెట్లు కొనొచ్చు, కానీ, డబ్బు మూటలతో ప్రజలను, ఓట్లను కొనలేరు
మోసం, దగా, నయవంచన, వెన్నుపోటు పొడిచే వారి గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది
బిఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి బీఆర్‌ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరారని బిఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ధ్వజమెత్తారు. చేవెళ్ల ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లకు అమ్మేసిందని స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నట్లు తెలిసిందని తెలిపారు. జెండాలు మోసి పార్టీని నిలబెట్టిన వారికి ఫలితం లేకుండా పోతుందని స్థానిక నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బు మూటలతో పార్టీ టికెట్లు కొనొచ్చు, కార్యకర్తలను మీ వెంట తిప్పుకోవచ్చు కానీ, డబ్బు మూటలతో ప్రజలను, ఓట్లను కొనలేరని చెప్పారు. చేవెళ్ల ప్రాంత ప్రజలు అవకాశవాదులను తప్పకుండా ఓడిస్తారని రంజిత్ రెడ్డిపై పటోళ్ల కార్తీక్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో సోమవారం పటోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అవకాశాలు, అవసరాల కోసం పార్టీలు మారుతుంటారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ఉన్న 90 శాతం మంది నాయకులు పార్టీలు మారుతున్న వారే అని, ఇది సర్వ సాధారణమని వ్యాఖ్యానించారు. మోసం, దగా, నయవంచన, వెన్నుపోటు పొడిచే వారి గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకే తాను రంజిత్‌రెడ్డి గురించి మాట్లాడుతున్నానని చెప్పారు.

మా భుజాలపై మోసి రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాం
చేవెళ్ల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రంజిత్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీకి మోసం చేశారని కార్తీక్‌రెడ్డి మండిపడ్డారు. ఐదేండ్ల క్రితం తమ ప్రాంతానికే కాదు.. రాష్ట్ర ప్రజలకు ఆయన ఎవరో తెలియని వ్యక్తి అని, ఆయన కరీంనగర్ వ్యక్తి అయినప్పటికీ.. బిఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉన్నాడని చెప్పి, కెసిఆర్ చేవెళ్లలో అవకాశం ఇచ్చారని తెలిపారు. కెసిఆర్ ఆదేశాల మేరకు రంజిత్ రెడ్డిని తాను భుజాలపై మోసి ఎంపీగా గెలిపించామని అన్నారు. తమ ప్రాంతం వ్యక్తి కాకపోయినా కూడా తమ ప్రాంతం ఆయనను గౌరవించిందని కార్తీక్ రెడ్డి తెలిపారు.

రంజిత్ రెడ్డిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దింది కెసిఆర్ అని కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. రంజిత్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదలలో కెసిఆర్ పాత్ర ఎంతో ఉందని పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఒక పౌల్ట్రీ అసోసియేషన్ ఉండాలని, దానికి కెసిఆర్ రూపకల్పన చేసి, ఆ అసోసియేషన్‌కు రంజిత్ రెడ్డిని ప్రెసిడెంట్‌ను చేసింది కెసిఆరే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు అధినేత కుమార్తె అరెస్టయి కష్టాల్లో ఉన్న సమయంలో రంజిత్‌రెడ్డి పార్టీకి అండగా ఉండాల్సింది పోయి పార్టీని వీడడం ఎంత వరకు సమంజసమని అడిగారు. అవకాశాలు, స్వార్థాల కోసం ఈ నయవంచన అవసరమా? అని కార్తీక్ రెడ్డి నిలదీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News