Saturday, May 4, 2024

చత్తీస్‌గఢ్‌లో నేడే తొలి విడత పోలింగ్

- Advertisement -
- Advertisement -

రాయపూర్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మంగళవారంనుంచి మొదలు కానుంది.తొలి విడతగా చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మిజోరాంలోని 40 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. చత్తీస్‌గఢ్‌లో తొలి విడత ఎన్నికలు జరగనున్న 20 అసెంబ్లీ స్థానాల్లో 12 నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతంలోనే ఉన్నాయి.దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినఅధికారులు ఈ ప్రాంతంలోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది సిఆర్‌పిఎఫ్, 20 వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ పిలుపు, ప్రచారం సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను గమనిస్తున్నారు.

బస్తర్ ప్రాంతంలో మొత్తం 5304పోలింగ్ కేంద్రాలుండగా వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. నిఘాను పటిష్టం చేసిన అధికారులు ఇక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్టా ఈ డివిజన్‌లోని అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 149 పోలింగ్ కేంద్రాలను పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేశారు. మరోవైపు 156 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందితో పాటుగా ఇవిఎంలను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ 20 నియోజకవర్గాల్లోను అధికార కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ రెండు పార్టీలతో పాటుగా ఎస్‌పి, బిఎస్‌పి,మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీకి చెందిన పార్టీ కూడా బరిలో ఉండడంతో పోటీలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 223 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో 9 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న జరిగే రెండో విడతలో పోలింగ్ జరగనుంది.

మిజోరాంలో..
కాగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అసెంబ్లీకి కూడా మంగళవారం పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కాగా మొత్తం పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి హెచ్ లియాంజెలా చెప్పారు. మొత్తం1,276 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 149 పోలింగ్ కేంద్రాలు మారుమూల కొండప్రాంతాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. అంతర్రాష్ట్ర, అ్తదర్జాతీయ సరిహద్దుల వెంట ఉండే 30 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వెంట భద్రతను మరితం కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మిజో నేషనల్ ఫ్రంట్, బిజెపి కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో కాంగ్రెస్ ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News