Tuesday, April 30, 2024

పేదోళ్ల ఇంట చికెన్’@300′ ఉడికేనా?….

- Advertisement -
- Advertisement -

Chicken

కిలో ధర @ రూ.300
ఆల్‌టైం రికార్డ్.. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడమేనా?
మూడు నెలల కిందట కరోనా వదంతులతో ఉచితంగా పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చికెన్ ధరలు ఆల్‌టైం రికార్డును నమోదు చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం కిలో చికెన్ ధర రూ.300 పలికింది. దీంతో కోడి మాంసం తీసుకుందామని మార్కెట్‌లోకి వచ్చిన వినియోగదారులు ధరలను చూసి విస్తుపోయారు. వేసవిలో ఈ స్థాయిలో రేటు పెరగడం ఇదే తొలిసారి చికెన్ వ్యాపారులు అంటున్నారు. రానున్న రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.

డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతోనే ధరలు పెరిగాయని పౌల్ట్రీ రైతులు, చికెన్ వ్యాపారులు పేర్కొంటున్నారు. గత మూడు నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా దెబ్బకి చికెన్ పేరు చెబితేనే జనాలు వణికిపోయారు. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పౌల్ట్రీ యాజమానులు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశారు. చికెన్ షాపుల్లో ఆఫర్లు పెట్టినా ఎవరూ ముందుకు రాలేదు. కానీ రెండు, మూడు వారాలుగా పరిస్థితి మారిపోయింది. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముందు కిలోకి రూ.100కు చేరిన ధర తరువాత రూ.200, ఇప్పుడు రూ.300కు చేరింది. ఇక వారాంతంలో జనాలు చికెన్ షాపులకు క్యూ కడుతున్నారు.

Chicken rate increased all time record

కోళ్లకు డిమాండ్ పెరగడంతో ఫారాలన్నీ త్వరగానే ఖాళీ అవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం, మార్కెట్ కొరతను గుర్తించి ధరలు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో కరోనాతో కోళ్ల విక్రయాలు పడిపోయిన సమయంలో కోళ్ల పెంపకాలను తగ్గించడంతో డిమాండ్ పెరిగిందంటున్నారు. రెండు నెలల క్రితం ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్‌లను పెంచడం ఒక్కసారిగా ఆపేయడం కూడా మరొక కారణంగా చెబుతున్నారు. అయితే మరో రెండు వారాల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు.

రంజాన్ కారణంగా కూడా చికెన్ ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.సాధారణంగా రాష్ట్రంలో ప్రతినెలా నాలుగున్న కోట్ల కోడి పిల్లలను వేసేవారు. కానీ కరోనా దెబ్బకి అది సగం కంటే తక్కువ పడిపోయింది. అయితే ధర ఇంతగా పెరిగినా ఇప్పటి వరకు వచ్చిన నష్టాలతో చూస్తే కోళ్ల రైతులకు దక్కేది తక్కువేనని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ వెల్లడించడం కొసమెరుపు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ నిర్వాహకులకు మక్కలు, కరెంట్ విషయంలో ఎన్నో సబ్సిడీలు ఇస్తుందని, ఇలా ఇష్టారీతిన ధరలు పెంచడం సరికాదని వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వినియోగదారులు చేపలను కొనడానికి ఇష్టపడుతున్నారు. చికెన్ రేటుతో పోల్చితే చేపల రేట్ తక్కువగా ఉంది. మార్కెట్ లో తెల్ల చేపలు కిలోకు 120 నుంచి 150 మధ్యలో ఉంది

మటన్‌ది అదే దారి

చికెన్‌తో పాటు మటన్ ధరలు కూడా కిలోకు రూ.1000 వరకు చేరింది. మటన్ ధర కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కిలో మటన్ రూ.1000 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం ధరలు పెంచరాదని పలుమార్లు హెచ్చరించినప్పటికీ డిమాండ్‌కు అనుగుణంగా విక్రయదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అదే గొర్రెలు, మేకల కాపలదార్లకు మాత్రం పాత రేటుకే కొనుగోలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News