Sunday, April 28, 2024

బుద్ధి మార్చుకోని చైనా

- Advertisement -
- Advertisement -

China Attempt to infiltrate with 200 soldiers

200 మంది సైనికులతో చొరబాటుకు యత్నం
దీటుగా నిలువరించిన భారత జవాన్లు
అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో కొద్ది సేపు ఉద్రిక్తత

న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న పొరుగు దేశం చైనా భారత్‌కు తలనొప్పిగా మారుతోంది. తన వక్రబుద్ధితో సరిహదుల్లో నిత్యం బలగాలను మోహరిస్తూ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖ ( ఎల్‌ఎసి)ను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. అయితే డ్రాగన్ చర్యలను భారత బలగాలు సమర్థవంతంగా నిలువరించాయి. గత వారంచోటు చేసుకున్న ఈ సంఘటన కారణంగా సరిహద్దుల్లో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇరుపక్షాలకు చెందిన స్థానిక కమాండర్ల మధ్య చర్చల అనంతరం సమస్య పరిష్కారమయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సుమారు 200 మంది పీపుల్ లిబరేషన్ ఆర్మీ( పిఎల్‌ఎ) జవాన్లు వాస్తవాధీన రేఖకు అతి దగ్గరగా రావడాన్ని గమనించాయి. వీరు ఎల్‌ఎసిని దాటడానికి చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకొంది.

ఈక్రమంలో ఇరు పక్షాల సైనికుల మధ్య కొద్ది గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాలకు చెందిన బలగాలు వాస్తవాధీన రేఖనుంచి వెనక్కి వెళ్లినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. గతంలో కూడా చైనా సరిహద్దుల్లో ఇలాంటిచొరబాటు యత్నాలకు పాల్పడింది. ఈ ఏడాది ఆగస్టు 30న దాదాపు వందమంది చైనా జవాన్లు ఉత్తరాఖండ్‌లోని బారాహోతి ప్రాంతంలో వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 5 కిలోమీటర్లు భారత భూభాగంవైపు ప్రవేశించారు. దాదాపు 3 గంటలపాటు భారత భూభాగంలోనే ఉన్నారు. అక్కడి వంతెనను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు( ఐటిబిపి) జవాన్లు అక్కడికి చేరుకునే లోపు వారు వెనుదిరిగారు. తూర్పు లడఖ్ వివాదంలో పరిష్కారం కోసం భారత్ చైనా మధ్య మరికొద్ది రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్న సమయంలో అరుణాచల్ ఘర్షణలు చోటు చేసుకోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News