Sunday, April 28, 2024

చైనా మోసం

- Advertisement -
- Advertisement -

China is competing with US for world domination

 

నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే విద్యలో ఆరితేరిన చైనా ఇలా చేయడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. అయితే 1962 తర్వాత ఇంత వరకు దానితో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తలేదు, 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లో తులుంగ్ లా వరకు చొచ్చుకొచ్చి చైనా జవాన్లు మన సైనికులు నలుగురిని హతమార్చిన అనంతరం ఇప్పటి వరకు దానితో సరిహద్దుల్లో దాదాపు శాంతియుత వాతావరణమే కొనసాగుతూ వచ్చింది. ఇందుకు తోడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మంచి సంబంధాలు తరచూ రుజువవుతున్నాయి. ఇంతలోనే చైనా వైఖరిలో అసాధారణమైన వ్యతిరేక మార్పు వచ్చింది. గత నెల 5వ తేదీన చైనా బలగాలు సిక్కిం సరిహద్దుల్లోనూ, తూర్పు లడఖ్‌లోనూ, మన భూభాగాల్లోకి చొచ్చుకు రావడం తో జరిగిన బాహాబాహీలో మన సైనికులు ముగ్గురు, నలుగురు చనిపోయారు. చైనా దళాలు 3 నుంచి 5 కి.మీ. మేర మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయని వార్తలు వెల్లడించాయి.

ఈ వివాదాన్ని పరిష్కరించుకోడానికి రెండు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఉభయుల సేనలు తమ పూర్వ స్థితికి చేరుకోవాలనే అంగీకారం కుదిరింది. ఆ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. సోమవారం నాడు మరో విడత సంభాషణలు జరిగాయి. ఈ సమయంలో సోమవారం రాత్రి లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సేనలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందినట్లు అధికారిక సమాచారం. మరణించిన మన వీర జవానుల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సైన్యాధికారి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. అయితే చైనా తన వైపు మృతులు, క్షతగాత్రుల సంఖ్యను అధికారికంగా వెల్లడించ లేదు. 30 మంది చైనా సైనికులు మృతి చెందారని తెలుస్తున్నది. రెండు దేశాలు పరస్పరం దురాక్రమణ ఆరోపణలు చేసుకున్నాయి. చైనాది అసత్య ఆరోపణ అన్నది సుస్పష్టం. అయితే ఈ ఘర్షణలో రెండు వైపుల వారూ కాల్పులకు పాల్పడలేదు. కర్రలు, ఇనుపరాడ్లతో తలపడడంతో ఈ రక్తపాతం సంభవించింది.

రెండు దేశాల మధ్య 4056 కి.మీ.ల నిడివిన ఉన్న బ్రిటిష్ కాలం నాటి సరిహద్దును ఖరారు చేస్తూ ఇంతవరకు ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అందుచేత ఉభయుల అంగీకారంతో వాస్తవాధీన రేఖగా అది స్థిరపడింది. సరిహద్దులకు అంతిమ రూపమిచ్చి ఖరారు చేసుకుందామన్న భారత దేశ ప్రతిపాదనకు చైనా సహకరించడం లేదు. అయితే ఇంతకాలంగా శాంతియుత సంబంధాలు, వాణిజ్య పరమైన ఇచ్చిపుచ్చుకోడాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతున్నందున సరిహద్దు ఖరారు గురించి మనం కూడా పదేపదే పట్టుపట్టడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి చైనా పాల్పడుతున్న దొడ్డిదారి దురాక్రమణతో భారత్ అప్రమత్తంకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నాటి రక్తపాతంతో ఇది మరింత పెరిగింది. సైనికాధికారుల స్థాయి చర్చల వల్ల ప్రయోజనం శూన్యమని తేలిపోయింది. దీనిని రాజకీయ స్థాయిలో పరిష్కరించుకోడమో, తప్పనిసరి అయితే తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధపడడమో శరణ్యమనిపిస్తున్నది.

చైనా ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో పోటీ పడుతున్నది. తనకు సమ ఉజ్జీగా ఇండియా తయారు కాకూడదన్నది దాని ఆశ. ఇటీవల ఆస్ట్రేలియాతో మనం కుదర్చుకున్న సైనిక సదుపాయాల సహకార ఒప్పందం చైనాకు కన్నెర్రగా ఉండి ఉండవచ్చు. మన పొరుగునున్న పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బర్మాలతో మన సంబంధాలు మంచిగా లేవు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఆహ్లాదకర అనుబంధం కూడా చైనాకు గిట్టడం లేదు. సోమవారం నాటి చైనా దురాక్రమణ దుస్సాహసాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలని పరిశీలకులు భావిస్తున్నారు. చైనాతో సరిహద్దుల్లో ఏమి జరుగుతున్నదో వాస్తవాలు తెలియజేయాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ నెల 19వ తేదీన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ నిర్ణయించారు.

దేశ సార్వభౌమత్వ విషయంలో రాజీకి తావేలేదని జాతికి హామీ ఇచ్చారు. భారత దేశ సువిశాల మార్కెట్ ఇక్కడగల పెట్టుబడుల అవకాశాలు చైనాకు అత్యంత ఆకర్షణీయమైనవి. అందుచేత మనతో మరోపూర్తి స్థాయి యుద్ధాన్ని చైనా కోరుకునే అవకాశాలు తక్కువ అనిపిస్తున్నది. అయితే ఎటువంటి ఒప్పందాలకు ఒదగకుండా ప్రపంచ వ్యవస్థను తన కాలి కింది చెప్పులా చేసుకోవాలని అమెరికా పేట్రేగిపోతున్న నేపథ్యంలో నూతన అంతర్జాతీయ సమాజం అవతరణకు భారత, చైనాల పరస్పర సహకారం అవసరం ఎంతైనా ఉన్నది. ఈ పరిస్థితిలో చైనాతో సమగ్రమైన చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతూనే సరిహద్దుల విషయంలో దాని మోసకారి వైఖరిపట్ల జాగరూకతతో నిత్య సైనిక సన్నద్ధతతో ఉండక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News