Sunday, April 28, 2024

కరోనా లీక్‌పై మళ్లీ దర్యాప్తునకు చైనా వ్యతిరేకత

- Advertisement -
- Advertisement -

China rejects WHO plan for study of Covid origin

బీజింగ్ : వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్‌పై మరోసారి ప్రపంచ ఆరోగ్యసంస్థ దర్యాప్తు చేపట్టడానికి ప్రయత్నిస్తుండడంపై చైనా మండిపడింది. వైరస్ మూలాల కోసం రెండవ సారి చేపట్టే దర్యాప్తును అడ్డుకుంటున్నట్టు చైనా వెల్లడించింది. ల్యాబ్ లీక్‌పై ఎటువంటి ఆధారాలు లేవని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ నెలలో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని డబ్లుహెచ్‌ఒ ప్రతిపాదించింది. చైనా లోని వైరాలజీ ల్యాబ్‌లను ఆడిట్ చేయడంతోపాటు వుహాన్‌లో ఉన్న జంతుమార్కెట్లను పరిశీలించాలని ప్రణాళిక రూపొందించుకుంది. పారదర్శకమైన విచారణ నిర్వహించాలనుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా నుంచి వ్యతిరేకత ఎదురైంది. చైనా నిపుణుల బృందానికి అధ్యక్షత వహిస్తున్న లియాంగ్ వాన్నియన్ గురువారం బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

ఈ వైరస్ సహజంగా జంతువుల్లోంచి మరో ఆతిధ్య జంతువు లోకి చేరి, అక్కడి నుంచి మనుషులకు సోకిందని వెల్లడించారు. ల్యాబ్ లీక్ సిద్ధాంతం అసంభవమని పేర్కొన్నారు. వుహాన్ ల్యాబ్‌లో అసలు కరోనా వైరస్‌లే లేవని చెప్పారు. అలాంటప్పుడు దానిపై వనరులను ఖర్చు చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే చాలా సార్లు ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని చైనా కొట్టి పారేసింది. గురువారం మరో అడుగు ముందుకేసి ఇంతకు మించి దర్యాప్తు చేసేది లేదని స్పష్టం చేసింది. ఈ సిద్ధాంతం ఎంత ప్రచారంలో ఉన్నా చైనా దర్యాప్తులో భాగస్వామిగా ఉండబోమని పేర్కొంది.

ఈ దర్యాప్తుపై ప్రపంచ ఆరోగ్యసంస్థ పిలుపును చైనా మొదటిసారి నేరుగా తిరస్కరించింది. వైరస్ పుట్టుకపై రెరండో దర్యాప్తులో కేవలం పుకార్లే ఉన్నాయని, కరోనా గుట్టు విప్పడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే సైన్స్ ఆధారంగా నికార్సయిన పరిశోధన జరగాలని, చైనా నేషనల్ హెల్త్ కమిషన్‌మంత్రి జెంగ్ ఇక్సిన్ తెలిపారు. దీనిలో రాజకీయ జోక్యాన్ని దూరం చేయాలని, వైరస్ పుట్టుకపై అధ్యయనాన్ని రాజకీయం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని జెంగ్ తెలిపారు. వైరస్ ఆనవాళ్ల కోసం కేవలం చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లో పరిశోధనలు జరగాలని జెంగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News