Friday, April 26, 2024

చైనాకు ఆర్థిక సంక్షోభం తప్పదా?!

- Advertisement -
- Advertisement -
China
చైనాలో స్థిరాస్తి బుడగ పేలనుందా?

బీజింగ్: ప్రపంచంలో అత్యధిక నెట్‌వర్త్ ఉన్న సంపన్న దేశంగా చైనా నిలిచిందని, అమెరికాను సైతం రెండో స్థానానికి నెట్టేసిందని మెకిన్సే అంతర్జాతీయ సంస్థ ఈ మధ్య కాలంలోనే తన అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఇంత వరకు బాగనే ఉంది. కానీ దీనికి కారణం అమెరికా కన్నా చైనాలో స్థిరాస్తుల ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2008లో అమెరికాలో స్థిరాస్తి బుడగ పేలడంతో అది ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. ఇప్పుడు చైనాకు అదే గతి పట్టబోతుందన్న ఆందోళన నెలకొని ఉంది. చైనాలోని స్థిరాస్తి దిగ్గజ సంస్థ ఎవర్ గ్రాండేకు ఐదు లక్షల కోట్ల డాలరల ఋణం ఉందని నొమురా ఫైనాన్స్ సంస్థ పేర్కొంది. ఎవర్ గ్రాండే ఇటీవల తన ఋణ భారంలో ఎక్కువ భాగాన్ని తిరిగి చెల్లించింది. చైనా హౌజింగ్ సంక్షోభం అమెరికా, యావత్ ప్రపంచానికి విస్తరించే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ హెచ్చరించింది.
చైనాలో స్థిరాస్తి రంగం పతనమైతే చైనాకే కాక యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్షలాది కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని యూబిఎస్ గ్రూప్ తెలిపింది. చైనా కుటుంబాలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ము భారత్, బ్రిటన్, రష్యా, బ్రెజిల్, ఇటలీ దేశాల మొత్తం స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) కన్నా ఎక్కువ. చైనా తన ప్రజలను స్థిరాస్తి, షేర్ల కొనుగోళ్లకు ప్రోత్సహిస్తూ జిడిపిలో వినియోగం వాటాను ప్రభుత్వం పెంచుతోంది. దీని కారణంగానే చైనాలో స్థిరాస్తి రంగం వేడెక్కింది. చైనాలో 60 శాతం మంది ప్రజలు నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తున్నారు.
విచిత్రమేమంటే చైనాలో గోస్ట్ టౌన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడున్న ఖాళీ అపార్ట్‌మెంట్లు మొత్తం ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్, కెనడా జనాభాకు ఇళ్ల వసతి కల్పించొచ్చట. చైనాలో స్థిరాస్తి రంగం ఎంత వేగంగా దూసుకెళ్లిందో అంతే వేగంగా ఇప్పుడు సంక్షోభంలోకి వెళుతోంది. చైనాలో ఇప్పటికీ ప్రభుత్వరంగ సంస్థలదే కీలక పాత్ర. అక్కడ ప్రభుత్వం భారత్‌లాగా ప్రభుత్వ సంస్థల వాటాలను అమ్మేసుకుని నగదీకరించలేదు. ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితా కంపెనీల్లో చైనా కంపెనీలు 2000లో 10 ఉండగా 2020 నాటికి 124కి పెరిగాయి. ఆ 124లో 91 ప్రభుత్వ రంగ కంపెనీలే. అవి ముఖ్యంగా ఫైనాన్స్, విద్యుత్, ఆటోమొబైల్, టెలికమ్యూనికేషన్స్, గనుల రంగానికి చెందినవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News