Tuesday, April 30, 2024

గ్రీన్‌ ఛాలంజ్‌కు మెగా పవర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి పర్యావరణ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మా హీరో అని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. గ్రీన్‌ఇండియా ఛాలంజ్‌లో భాగంగా జూబ్లిహిల్స్ హౌజింగ్ సోసైటీ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి నాయకత్వంలో రాజ్యసభ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు దూసుకు పోతున్న సంతోష్‌కుమార్ మా హీరో అని ప్రశంసించారు. కరోనాతో ఊపిరితిత్తులు గాలి పీల్చుకోలేక చనిపోతున్నారని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రాణవాయువుకు ఉన్న ప్రాధాన్యత సామాన్యులకు సైతం తెలియ వచ్చిందన్నారు. భూమాతకు అడవులు, చెట్లు, వృక్షాలు ప్రాణవాయువును అందిస్తాయనీ, భూమికి ఊపిరితిత్తులు చెట్లు అని ఆయన చెప్పారు. జీవకోటికి ప్రాణవాయువును అందించేందుకు ఎంపి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని చెప్పారు. సంతోష్‌కుమార్ మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చిరంజీవి చెప్పారు.


ఆఫ్రికాలో గడ్డిమొక్కలను కూడా అపురూపంగా పెంచుకుంటారు
మొక్కలు పెంచుకునే అవకాశం మనకున్నందుకు అదృష్టవంతులమని సినిమా హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. దుబాయ్ లాంటి దేశంలో పచ్చదనం కోసం ఎంతో కష్టపడతారు. ఆఫ్రికాలో గడ్డిమొక్కలను కూడా అపురూపంగా పెంచుకుంటారు అని ఆయన అన్నారు. మొక్కలు పెంచే స్ఫూర్తిని కల్పిస్తున్న ఎంపి సంతోష్‌కుమార్‌ను ఆయన అభినందించారు. ప్రకృతి ప్రేమికుడిని, పర్యావరణం కాపాడుకోవాలనే తపన ఉన్న తనకు మొక్కలు పెంచడం ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, నరేంద్రచౌదరి, హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు చలసాని దుర్గాప్రసాద్, సెక్రటరీ సురేష్‌రెడ్డి, సభ్యులు చలసాని శ్రీనివాస్, విద్యాసాగర్, బాలకృష్ణ, అట్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


ప్రకృతిని కాపాడుకోవల్సిన బాధ్యత మనది
కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు శాతవాహన కాలనీ జిహెచ్‌ఎంసి పార్కులో కెఎల్‌ఎం ఫ్యాషన్ మాల్ డైరెక్టర్ సుభాష్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యతని చెప్పారు. అనంతరం కళామందిర్ కళ్యాణ్, కాంచీపురం వరలక్ష్మి సిల్క్ డైరెక్టర్ సోమరాజ్, బ్రాండ్ అంబాసిడర్ ఫార్ సిల్క్ మార్క్ శైలజకు ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నేను కొమ్మను
పచ్చదనాన్ని పెంపొందించే ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి నేను ఓ కొమ్మను అయ్యానని సినిమా నటుడు, మా అధ్యక్షుడు నరేష్ చెప్పారు. సినిమా దర్శకుడు వేగ్నేశ చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి నరేష్ విజయ కృష్ణా ఎస్టేట్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన నటి జయసుధ, నటులు రాజీవ్ కనకాల, శివబాలాజీలకు గ్రీన్ ఇండియా సవాల్ విసిరారు.

Chiranjeevi and Pawan Kalyan plant sapling in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News