Saturday, April 27, 2024

ఆశావహ కవిత్వం

- Advertisement -
- Advertisement -

చుట్టూ ఉన్న పరిస్థితులపట్ల మనుషులెప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఇతరులకంటే ఎక్కువగా కవుల స్పందన ఉంటుంది. అది సహజం. భావుకత పుష్కలంగా ఉన్న కవయిత్రి చొప్పదండి రాధ కూడా అంతే. ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో బోధిస్తూనే సమాజాన్ని అధ్యయనం చేస్తున్న చొప్పదండి రాధ వివిధ సందర్భాలకు స్పందించి, చక్కటి కవిత్వాన్ని వెలువరించారు. అలా వెలువడ్డ కవిత్వమే ఇప్పుడు ‘మనసు పలికిన వేళ’ అనే పేరుతో నూటొక్క కవితల సమాహారంగా పుస్తకరూపంలో వెలువడింది.
కవులకు చాలా సందర్భాల్లో తమ అనుభవాలే కవితా వస్తువులు. ఇందుకు చొప్పదండి రాధ కూడా మినహాయింపు కాదు. పైగా ఈ కవయిత్రి ఉపాధ్యాయురాలు కూడా కావడం వల్ల నిరంతరం విద్యార్థులతో సన్నిహితంగా మెలగడం సహజం. విద్యార్థులతో సంభాషణల వల్ల సమాజంలోని అనేక విషయాలు తెలుస్తుంటాయి.

ఆ అంశాలను కవితావస్తువులుగా మలచుకునేందుకు వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన కవులకు అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులకు అదొక సౌలభ్యం.ఉపాధ్యాయులు చిన్నారుల చిరునవ్వుల్లో తమ సంతోషాలను వెతుక్కుంటారు. ‘చిన్నారుల చిరునవ్వులు’ అనే కవితలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు రాధ. / పసిడి కాంతులు చిమ్మే పసివారి /నవ్వులో నన్ను నేను /మైమరిచిపోతాను / వెలుగులు చిమ్మే చిన్నారుల / చిరునవ్వును చూసిన నా మనసు / వేయి బాధలైనా మరచిపోతుంది / ఉపాధ్యాయులందరి ఆలోచనాధోరణిని చిక్కటి కవిత్వ పంక్తుల్లో విడమర్చి చెప్పారు ఈ కవయిత్రి. / తన కవితల ద్వారా గొప్ప ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించారు రాధ. ‘బ్రతుకు’ అనే కవితలో కింది విధంగా పేర్కొంటారు.

బ్రతకాలి / ఎన్ని బాధలొచ్చినా/ ఎన్ని భయలొచ్చినా / ధైర్యంగా బతకాలి / జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా / ఎన్ని వేదనలున్నా / ఎన్ని రోదనలున్నా / గుండె బలమే ఆయుధంగా బతకాలి / బాధలు, భయాలు ఎన్ని ఉన్నా తెగువను ప్రదర్శించాలని ఉద్బోధించి, ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా పెరకవిన్న రాధ అక్కడితో ఆగిపోరు. తర్వాతి పంక్తుల్లో ఏం చెప్పారో ఒక్కసారి చూస్తే ఈ కవయిత్రి ఇచ్చే ధైర్యం ఎలాంటిదో అర్థమవుతుంది.ఆనందంగా బతకాలి / అందరూ అసూయపడేలాగా బతకాలి / కేవలం ఏదో రకంగా బతికితే చాలు అన్న పరిస్థితి నుండి ఇతరులు ఈర్ష్యపడేలాగా బతకాలని చెప్పడంలో బాధల్లో ఉన్నవారికి ఈ కవయిత్రి ఉన్నంతలో కాకుండా ఉన్నతంగా జీవించాలని ప్రోత్సహించడం కనిపిస్తుంది. ఇదేరకమైన ఆశావహ దృక్పథం ‘నిరాశ’, ‘ఎదురుచూపు’, ‘ఆశాజ్యోతి’, ‘వెలుగుబాట’ మొదలైన పలు ఇతర కవితల్లోనూ కనిపిస్తుంది.

‘అందని ద్రాక్ష పుల్లన’ అని ఒక లోకోక్తి. అలా అందనిదేదైనా ఉంటే అది పుల్లగా ఉందని భావించి, మనసును సంతోషపెట్టుకోవాలని దాని అంతరార్థం. అలా సరిపెట్టుకునే మనస్తత్వం కాదీ కవయిత్రిది. ‘వెలుగుబాట’ అనే కవితలో కింది విధంగా పేర్కొంటారు.అందనిదాన్ని ఆశించకు / అనే నానుడిని సవాలు చేస్తూ / అందని దాన్ని అందుకోవడానికి / ప్రయత్నించు నేస్తం / అందలేదని నిరాశ చెందక / ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే నానుడిని / మనస్ఫూర్తిగా నమ్ముకొని సాగిపో నేస్తం / చక్కటి సందేశంతో, భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ సాగే కవిత ఇది. ఈ కవితలే కాకుండా ఇతర కవితల్లోనూ నిరాశను దూరం చేయాలన్న సందేశమిస్తారు ఈ కవయిత్రి. ఈ కవితాసంపుటిలో పలుచోట్ల ఆశావహ దృక్పథం కనబడుతుంది.
మనిషి సాధారణంగా నలుపుకు వ్యతిరేకం.

తెలుపంటే ఎందుకో అంతులేని వ్యామోహం. ఈ పరిస్థితిపై ‘నలుపు’ అనే శీర్షికతో రాధ రాసిన రెండు కవితలూ ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. నలుపు ప్రాధాన్యతను ఈ శీర్షికతో ఉన్న ఒక కవితలో ఆమె వివరించిన తీరు పాఠకులను ఆకర్షిస్తుంది. / జీవితాలను తీర్చిదిద్దే బల్లవుతుంది / పెళ్ళి కూతురి బుగ్గ చుక్కవుతుంది / ఆకలితీర్చే ఇనుప పెనమవుతుంది / అక్కడితో ఆగకుండా ఇంకా మన జీవితంలో నలుపు ఎక్కడెక్కడ ప్రాముఖ్యమైందిగా ఉందో చెప్తారు.మనిషి అందానికి జుట్టవుతుంది/ చంటిపాప దిష్టి చుక్కవుతుంది /కంటిపాప కనురెప్పవుతుంది / ఈ పంక్తుల్లో చంటిపాప, కంటిపాప అనే పదాల మధ్య సామ్యం ఉండడాన్ని గమనించవచ్చు. ఈ పదాలను ఈ కవయిత్రి చాలా అలవోకగా, అత్యంత సహజంగా ప్రయోగించారు. మేఘాలు మానవ జీవితానికి ఆలంబనలు. కారుమబ్బులు వర్షాలకు ఆధారాలు. వానలు పంటలకు మూలాలు.

పంట లేనిదే మనం లేం కదా. అందుకే కారు మబ్బులకు, మనిషి జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ‘నలుపు’ అనగానే మిగతా అంశాలతో పాటు వర్షించేందుకు సిద్ధంగా ఉన్న మేఘాలు కూడా కవయిత్రికి గుర్తుకు వచ్చాయి.
వాన చుక్కకు స్వాగతం పలికే / మేఘం అవుతుంది /చేతులెత్తి మొక్కే / దేవుడవుతుంది / ఇదే శీర్షికతో ఉన్న రెండో కవితలోనూ దాదాపు ఇవే విషయాలు పేర్కొన్నా చెప్పే పద్ధతిలో వైవిధ్యం కనబడుతుంది.మేఘమే కదా / ఆకాశంలో నాట్యం చేస్తూ / రైతన్న నాగలి కదలికకు / ఊపునిచ్చేది / ఈ కవిత్వ పాదాలు చిక్కనవుతున్న రాధ కవితకు చిహ్నాలు. ఈ పంక్తుల్లో ఎక్కడా ‘వర్షం’, ‘వాన’, ‘వ్యవసాయం’ లాంటి పడికట్టు పదాలను ప్రయోగించలేదు ఈ కవయిత్రి. ఆ పదాలను ఉపయోగించకుండానే తన భావనలను సమర్థవంతంగా కవిత్వరూపంలో వ్యక్తీకరించగలిగారు.

ఆకాశంలో ఉన్న మేఘం నృత్యం చేస్తుందట. ఆకాశంలో మబ్బులు చేసే డ్యాన్స్ భూమిపైన నాగలి కదిలేందుకు ప్రేరణగా నిలిచిందట. సమూహంలో ఒకరు నృత్యం చేస్తే మరొకరికి ఊపు వస్తుంది కదా! అలా అన్నమాట! ఎంత చక్కటి భావన!! ఈ పంక్తుల్లో మేఘాలను, నాగలిని మానవీకరించడం కనబడుతుంది. ఇలా ప్రకృతిని మానవీకరించడం ‘అడవి’ అనే కవితలోనూ కనబడుతుంది.అడవి ఏడుస్తుంది / హాహాకారాలు చేస్తూ ఈ పంక్తులతో కవిత ప్రారంభమవుతుంది. అడవి బాధకు కారణమేంటో తర్వాతి పంక్తుల్లో పేర్కొంటూనే అందులో మనిషి బాధ్యత ఎంతవరకు ఉందో చెప్తారు కవయిత్రి. ప్రకృతికి నష్టం కలిగిస్తే మానవాళికి కూడా నష్టం కలగడం తప్పదన్న సందేశాన్ని ఈ కవిత ద్వారా అందించారు.అందమైన నన్ను / నామరూపాలు లేకుండా చేస్తే / క్రూర మృగాలు / నిన్ను కుళ్ళబొడుస్తాయని / అడవిలో చెట్లు లేకపోవడం వల్ల జంతువులు గ్రామాల్లో సంచరిస్తుండడాన్ని మనం గమనిస్తున్నాం. అటవీ సంపదను మనుషుల అవసరాల కోసం వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విస్పష్టంగా పేర్కొంటారు రాధ.

సమకాలీన సంఘటనలపై స్పందనలకు రాధ కవితల్లో చూడవచ్చు. ఇటీవల విశాఖపట్నంలో విషవాయు దుర్ఘటన అలాంటిదే. ఈ దుర్ఘటన విశాఖ వాసుల జీవితాలను అతలాకుతలం చేసింది. దీన్ని ‘విషజ్వాలలు’ అనే కవితలో కిందివిధంగా రాశారు రాధ.
బ్రతికించాల్సిన ప్రాణవాయువు / విషవాయువు అయ్యింది / అందాల విశాఖ / అల్లాడిపోయింది / ఊరివాళ్ల ఉపాధి కోసం / పెట్టిన ఫాక్టరీ / ఉరి తాడై బిగిసింది / నిజమే! ప్రాణ వాయువు బతికిస్తుంది కదా! ఈ సందర్భంలో చంపేసిందేంటనే ఆవేదన ఈ కవయిత్రిది. అందుకే ప్రాణం ఇవ్వాల్సిన వాయువే విషమైపోయిందన్న బాధను వ్యక్తం చేస్తారు. ఈ పంక్తుల్లో ‘ఊరివాళ్లు’, ‘ఉరితాడు’ అనే పదాలను గమనిస్తే పదప్రయోగంపై ఈ కవయిత్రికి ఉన్న ఆసక్తి వెల్లడవుతుంది.
గాంధీజీ, అంబేద్కర్, వివేకానందుడు, రవీంద్రనాథ్ టాగోర్ మొదలైన మహానీయులపై కూడా ఈ కవయిత్రి కవితలను రాశారు. వారి జీవిత విశేషాలను అందజేస్తూనే వారి జీవితాలు అందించే సందేశాలను సూటిగా ఈ కవితల్లో పేర్కొనడం ఈ కవయిత్రి శైలి. ‘వివేకానందుడు’ అనే కవితలో కిందివిధంగా వివేకానందుని బోధనలను వివరిస్తారు.
వివేకానంద బోధనలు/ విజయానికి సోపానాలు/ భయం వీడండి అంటూ / భరోసా ఇచ్చాడు / మందలో ఉండకు
వందలో ఒకడిగా ఉండు అంటూ / మందలించి చెప్పాడు / చక్కటి కథలను కవిత్వరూపంలో రాయడమూ ఈ కవయిత్రికి వెన్నతో పెట్టిన విద్య అని నిరూపించే కవిత ‘కల’. ఇటీవలి కరోనా మహమ్మారి పరిస్థితులను పేర్కొంటూ కవితారూపంలో రాసిన కథ ఇది. కవయిత్రి ఒకరోజు నిద్రలో కల కాంటారు. రోజూ వెళ్ళినట్టుగానే ఉద్యోగానికి వెళ్ళినట్టుగా, మిత్రులతో మాట్లాడినట్టుగా.. ఇలా అనేక విషయాలు ఆ కలలో కనబడతాయి. మెలకువ రాగానే అది కల అనే విషయం తెలుస్తుంది. ఆ కల నిజమైతే బాగుందని దేవుడిని కోరుకుంటారు. ఈ కవితాసంకలనం ‘మనసు పలికిన వేళ’ కవయిత్రి రాధ సృజనశీలతకు అద్దం పడుతుంది. కవిత్వ సృజన దిశగా కృషి చేస్తే మరింత చిక్కనైన కవిత్వాన్ని ఆమె వెలువరించగలరన్న భరోసాను ఈ సంకలనం ఇస్తోంది.

డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News