Sunday, April 28, 2024

జలప్రణాళికపై నేడు సిఎం కెసిఆర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

CM KCR

 గోదావరి నీటి వినియోగంపై చర్చ
ప్రాజెక్టుల వారీగా నివేదికలు
ఖరీఫ్ సీజన్ నీటి డిమాండ్‌పై సమీక్ష

హైదరాబాద్: గోదావరి నీటి వినియోగంపై సిఎం కెసిఆర్ జలప్రణాళిక రూపొందించేందుకు ఆదివారం ప్రగతిభవన్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. వర్షాకాలంలోని ఖరీఫ్ సీజన్‌కు ప్రాజెక్టుల వారిగా నీటి వినియోగంపై ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించనున్నారు. గంగా నది తర్వాత అతిపెద్దనది గోదావరి. ఈ నది మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లా కందకూర్తిలో ప్రవేశించి అనేక ప్రాజెక్టులను నింపుతూ అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా ప్రవహిస్తోంది. ఈ నదీపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు పుష్కలంగా నీరు అందించేందుకు సిఎం కెసిఆర్ జలప్రణాళిక రూపొందించనున్నారు.

ప్రాజెక్టుల వారిగా ఉన్న ఆయకట్టుకు ఎంత నీరు అవసరమవుతుంది, ఏ రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేయాలనే అంశం ఈ సమావేశంలో కీలకం కానుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్లు నింపి ఆ నీటిని చివరి ఆయకట్టు వరకు చేర్చేందుకు పక్కా ప్రణాళిక రూపొందించనున్నారు. గోదావరి ప్రాజెక్టుల వారిగా ఆయకట్టు, నీటి వినియోగం. ఏ రిజర్వాయర్ ద్వారా ఎంత నీటిని విడుదల చేయాలో ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చ జరగనుంది. గోదావరి ఆయకట్టు విస్తరించి ఉన్న జిల్లాలకు చెందిన మంత్రులు కెటిఆర్, ఈటెల, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావులను ఈ సమావేశానికి సిఎం ఆహ్వానించారు.

అలాగే నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌తో పాటు గోదావరి ఆయకట్టు ప్రాంతం అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో శ్రీరాంసాగర్ 42 గేట్ల నుంచి ఆయకట్టుకు ప్రవహించే నీరు ఎంతమేరకు ఉపయోగించుకోవాలి, కాకతీయ, సరస్వతి కాలువలకు ఎన్ని టిఎంసిల నీటిని విడుదల చేయాలి అనే అంశంపై చర్చ జరగనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని దాదాపుగా వినియోగించి పంటల విస్తీర్ణం, అదనపు ఆయకట్టు పెంచేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తారు.

దిగువ మానేరు(ఎల్‌ఎండి) నీటి తరలింపు, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు నీటి వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారిత రిజర్వాయర్ల నీటి నిలువలు, వినియోగంపై సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే విస్తారంగా వర్షాలు కురువనున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ముందుగానే రిజర్వాయర్లలో నింపి తిరిగి వరదనీటితో ప్రాజెక్టు నింపేందుకు కూడా సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఈ సమావేశం పూర్తిగా అంతరంగిక సమావేశం. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారుల అభిప్రాయాలను సమీక్షించి వర్షాకాలం ప్రారంభం నాటికి జలప్రణాళిక రూపొందించి విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

CM KCR Meeting on Water Project Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News