Saturday, May 4, 2024

1.40 కోట్ల ఎకరాల మాగాణం కావాలె

- Advertisement -
- Advertisement -

CM KCR

 

ఎరువులు.. విత్తనాల కొరత రావొద్దు

16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు..
21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానాకాలం రైతుబంధుపై ఏం చేద్దాం..? లాక్‌డౌన్ సద్దుమణిగాక మొదటి దఫా రుణమాఫీ
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ఎరువులు, విత్తనాల కొరత రావొద్దని ముందస్తుగా నిల్వలు పెట్టుకోవాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున, లాక్‌డౌన్ పొడగింపు, సడలింపులపై ఇప్పుడే స్పష్టత రాదని వ్యవసాయ రంగానికి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఈ సందర్భంగా వచ్చే వానకాలం సీజన్‌లో ఏకంగా కోటి 40 లక్షల ఎకరాల భూమి సాగవుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులతో సిఎం వ్యాఖ్యానించారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తవడం, కాళేశ్వరం జలాలు పొలాలకు చేరుతుడంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. గడిచిన ఖరీఫ్‌లోనే కోటి 3 లక్షల ఎకరాల వరకు సాగైందని, ఈసారి అదనంగా మరో 40 లక్షల ఎకరాలు సాగవుతుందన్నారు. సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉండాలని, అదనపు నిల్వలు పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. 1.40 కోట్ల ఎకరాలకు 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ సిఎంకు తెలిపింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వం, రైతుల దగ్గర మొత్తం కలిపితే 18 లక్షల క్వింటాళ్ల వరకు విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇక ఈసారి వానకాలం సీజన్‌కు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి 21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించిందని సిఎం పేర్కొన్నారు. ఇందులో యూరియా 10 లక్షల టన్నులు, డిఎపి 1.50 లక్షల మెట్రిక్ టన్నులు, ఎన్‌పికె 8 లక్షల టన్నులు, ఎమ్‌ఒపి 1.50 లక్షల టన్నులుగా ఉందన్నారు.

మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్ సిద్ధంగా పెట్టుకోవాలని, గత ఏడాది మాదిరి కొరత వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఇక రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అమలుపై కూడా సిఎం సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత లాక్‌డౌన్‌తో రాష్ట్రం పూర్తిగా ఆదాయం కోల్పోయిందని, వచ్చే ఖరీఫ్‌కు పెట్టుబడి సాయం ఎలా చెల్లించాలనే దానిపై సమావేశంలో ఆలోచన చేశారు. కొంత ఆలస్యమైనా రైతుబంధు సొమ్ము అందజేసేందుకు ప్రయత్నిస్తామని కెసిఆర్ అధికారులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ రబీలో ఉన్న బకాయిలు ఇచ్చేదానిపై తరువాత నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. అదే సమయంలో రూ.25 వేలలోపు ఉన్న రుణాల మాఫీకి ప్రభుత్వం రూ.1198 కోట్లు విడుదల చేస్తూ మార్చిలోనే ఉత్తర్వులు జారీ చేసింది.

వీటిని చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని భావించినప్పటికీ కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. మాఫీ మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయిలో రుణమాఫీకి అర్హులెవరేనేది కూడా బ్యాంకులు ఇంకా తేల్చలేదని, లాక్‌డౌన్ ముగిసాక మాఫీ సొమ్ము రైతులకు ఇద్దామని సిఎం పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే వరికోత యంత్రాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి… వానకాలం పొలం పనులకు ట్రాక్టర్లు, ఇతర మిషనరీ ఏ మాత్రం అందుబాటులో ఉందనేదానిపై వివరాలు అడిగి తెలుసకున్నారు. గన్నీ బ్యాగుల కొరత కూడా పెద్దగా రాదని, కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

 

CM KCR review about Kharif season
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News