Wednesday, May 15, 2024

22న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా అమరవీరుల స్మారకం ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైందని, ఈ నెల 22న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి సోమవారం ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడి నుంచే అమరజ్యోతికి సెల్యూట్ చేస్తారని, ప్రభుత్వం తరఫున సిఎం సమక్షంలోనే పోలీస్ గన్ సెల్యూట్ ఉంటుందన్నారు. అంబేద్కర్ విగ్రహ చౌరస్తా నుంచి అమరుల స్మారకం వరకు 5వేల మంది కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

సాయంత్రం సుమారు 800 డ్రోన్లతో అమరుల త్యాగాలు, తెలంగాణ ప్రగతి చాటి చెప్పే ప్రదర్శన ఉంటుందన్నారు. అమరుల స్మారకం ఆవిష్కరణ సందర్భంగా వారి త్యాగాలు స్మరిస్తూ సుమారు 10వేల మందితో దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అమరవీరుల స్మారక చిహ్నంపై ఇటీవల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. అమరుల త్యాగాల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. దేశాన్ని 50 ఏండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ దేశ రాజధాని ఢిల్లీలో దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన వీరుల స్మారకార్థం గొప్ప కట్టడం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.వారి త్యాగాలు గుర్తు చేసే ఒక్క నిర్మాణమైనా ఢిల్లీలో ఎందుకు లేదని, స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ విస్మరించిందంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ, పనికి మాలిన విమర్శలు చేసే రేవంత్ దీనికి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల స్మారకం మనసుపెట్టి నిర్మించామని, అది కెసిఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్‌తో అయితే ఈ ఆలోచన, ఈ నిర్మాణం సాధ్యమే కాదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేతలు అమరుల స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా మంత్రి వేముల సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News