Saturday, May 4, 2024

చూడర బాబూ ఎపి సొగసు!

- Advertisement -
- Advertisement -

కరెంటు కట్లు.. చీకట్లు.. గుంతల రోడ్లు

ఎపిపై నా మిత్రులు ఆందోళన చెందారు తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం లేదు: క్రెడాయ్ సభలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని, రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని తన మిత్రులు తనతో చెప్పారని మంత్రి కె టిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న మంత్రి కెటిఆర్ ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధేశించి పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎపిలోని ప్రస్తుత పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని, ఎపిలో ఉన్నంతసేపు నరకంలో ఉన్నట్లు ఉందని మిత్రులు తనతో చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. అనుమానం ఉం టే ఎవరైనా ఎపికి వెళ్లిరండని, తాము చెప్పేది నిజమో కాదో తెలుస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తాను చెప్పేది అతిశయోక్తి కాదనీ, తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం కాదనీ, పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ అవి వాస్తవాలని మంత్రి తెలిపారు. ఒక బిజెపి ఎంపి సైతం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి వచ్చి ఇక్కడి అభివృద్ధిని సైతం ప్రశంసించారన్నారు. మాదాపూర్‌లో ఉన్న తన బంధువుల ఇంటికి 7 నిమిషాల్లో చేరుకున్నానని ఆ ఎంపి తనతో పేర్కొన్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు.

ఎపిని అభివృద్ధి చేసుకుంటే తాము అడ్డుపడతామా: మంత్రి వేముల

ఆంధ్రప్రదేశ్ గురించి మంత్రి కెటిఆర్ అన్నది నిజమేనని దీనిపై ఎపి మంత్రులకు ఎందుకంత అక్కసని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకుంటే తాము ఏమైనా అడ్డుపడుతున్నామా అంటూ మంత్రి వేముల పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే ఉంటుందని వారికి అభివృద్ధి గురించి తెలియదా అని మంత్రి వేముల ప్రశ్నించారు. బొత్స మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి వేముల తెలిపారు. గతంలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు కాబట్టే తెలంగాణ వచ్చిందని మంత్రి వేముల పేర్కొన్నారు. విజయవాడ నుంచి రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అంతా ఇక్కడకు వస్తున్నారని, ఇప్పటికీ విజయవాడలో స్థిరాస్తి రంగం వృద్ధి చెందడం లేదని, అక్కడి మంత్రులకు ఇది కనిపించడం లేదా అని వేముల ప్రశ్నించారు. హైదరాబాద్‌లో -రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయా లేదా అన్నది ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వస్తున్నారని మంత్రి వేముల తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎపి మంత్రుల కామెంట్స్‌పై ఈ విధంగా స్పందించారు.

బొత్స ఇంటికి కరెంట్ బిల్లు కట్టలేదేమో: ఎంపి రంజిత్‌రెడ్డి

హైదరాబాద్‌లో కరెంట్ లేదన్న ఎపి మంత్రి బొత్స వ్యాఖ్యలకు చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బొత్స ఇంటికి కరెంట్ బిల్లు కట్టలేదేమో అందుకే విద్యుత్‌ను కట్ చేసి ఉంటారని ఎంపి వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వైకాపా నేతలను అడిగితే నిజం తెలుస్తుందని, జగన్ కుటుంబం ఇక్కడే ఉంటుందని, వాళ్లను అడిగినా నిజం చెబుతారన్నారు. సిఎం కెసిఆర్ పాలన బాగుందని వైకాపా ఎంపిలే తనతో అన్నారన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడితే మీకు పాలన చేతగాదు అన్నవారే ప్రస్తుతం మమ్మల్ని ప్రశంసిస్తున్నారన్నారు. మాకు ఎపితో పోటీ కానే కాదనీ- రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎపి పథకాలను తెలంగాణలో అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందని, కెసిఆర్ పథకాలలే అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఎంపి రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News