Tuesday, April 30, 2024

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా

- Advertisement -
- Advertisement -

Commonwealth Games 2022: India won 61 Medals

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా
స్వర్ణాలతో మెరిసిన తెలుగుతేజాలు సింధు, నిఖత్, ఆకుల శ్రీజ
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ క్రీడాంశం లేకపోవడంతో భారత్‌కు పతకాలు సాధించడం కష్టమేనని చాలా మంది భావించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఎక్కువ పతకాలను షూటింగ్‌లోనే గెలవడం అనవాయితీగా వస్తోంది. ఈసారి ఆ క్రీడాంశం లేక పోవడంతో భారత్ కనీసం టాప్5లోనైనా నిలుస్తుందా అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ భారత్ ఈసారి నాలుగో స్థానంలో నిలిచి పెను ప్రకంపనలు సృష్టించింది. భారత్ బలంగా ఉన్న షూటింగ్ క్రీడాంశం లేకున్నా ఏకంగా 61 పతకాలు సాధించి భారత ఆటగాళ్లు సత్తా చాటారు. వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, టిటి, అథ్లెటిక్స్‌లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. మీరాబాయి చాను, జెరెమీ లాల్‌రినునుంగా, అచింట షెయులి తదితరులు వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణాలు సాధించి సత్తా చాటారు. ఇక లాన్‌బౌల్స్ భారత మహిళల జట్టు పసిడి పతకంతో చరిత్ర సృష్టించింది. పురుషుల టీమ్ కూడా రజతంతో మెరిసింది. హాకీలో మహిళల జట్టు కాంస్య సాధించగా పురుషుల టీమ్‌కు రజతం దక్కింది. క్రికెట్‌లో మహిళల టీమ్ రజతం దక్కించుకుంది. టిటి టీమ్ విభాగంలో భారత్ స్వర్ణం సాధించింది. జూడోలో టులికా మాన్, సుశీలలు రజతాలు సాధించి సత్తా చాటారు. మరోవైపు బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం దక్కింది. రెజ్లింగ్‌లో భారత్ ఆకాశమే హద్దగా చెలరేగి పోయింది. సాక్షి మాలిక్, దీపక్ పునియా, భజరంగ్ పునియా, రవి దహియాలు పసిడి పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. అంతేగాక నవీన్ కుమార్, వినేశ్ ఫొగాట్‌లు కూడా రెజ్లింగ్‌లో స్వర్ణాలతో మెరిశారు.

అథ్లెటిక్స్‌లో మురళీ శ్రీశంకర్, తెజస్విని శంకర్‌లు పతకాలు సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేశారు. బాక్సింగ్‌లో తెలుగుతేజం నిఖత్ జరీన్, అమిత్ పంగల్, నీతు గంగాస్‌లు స్వర్ణాలతో చరిత్ర తిరగరాశారు. మరోవైపు టిటి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అచంట శరత్ కమల్‌ఆకుల శ్రీజా జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పి.వి.సింధు, సాత్విక్‌సాయిరాజ్‌లు బంగారు పతకాలను దక్కించుకున్నారు. లక్షసేన్ కూడా పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించాడు. ఇక టిటి సింగిల్స్‌లో శరత్ పసిడి గెలుచుకున్నాడు. అథ్లెటిక్స్‌లో ఎల్దొస్ పాల్ పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. బాక్సింగ్‌లో తెలుగుతేజం హసాముద్దీన్ కాంస్యం దక్కించుకున్నాడు. ఈ పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు మరో 23 కాంస్యాలతో 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 178 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా ఇంగ్లండ్ (176), కెనడా (92) పతకాలతో టాప్3లో చోటు సాధించాయి.

Commonwealth Games 2022: India won 61 Medals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News