Tuesday, May 21, 2024

కర్నాటక కౌన్సిల్‌లో బాహాబాహీ

- Advertisement -
- Advertisement -

Confusion in the Karnataka Legislative Council

 

చైర్మన్ స్థానం నుంచి ఉపాధ్యక్షుడిని లాగేసిన
కాంగ్రెస్ సభ్యులు, బిజెపి, కాంగ్రెస్ సభ్యుల మధ్య
కుమ్ములాట, ఏకమైన బిజెపి, జెడి(ఎస్)
గోవధ నిషేధం బిల్లు నేపథ్యంలో రభస

బెంగళూరు : కర్నాటక శాసన మండలిలో మంగళవారం తీవ్ర స్థాయిలో రసాభాస చెలరేగింది. ఉప సభాపతి ఎస్‌ఎల్ ధర్మేగౌడను సభాధ్యక్ష స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లాగారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సభలో చాలా సేపటివరకూ బిజెపి జెడిఎస్ సభ్యులు ఓ జట్టుగా, కాంగ్రెస్ సభ్యులు మరో జట్టుగా మారి పరస్పరం దూషించుకుంటూ, ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ఉండటంతో అరాచక పరిస్థితి ఏర్పడింది. సభాధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విషయం సభలో జగడానికి దారితీసింది. ఇప్పటివరకూ ఉన్న ఛైర్మన్ దిగిపోయినట్లుగా భావించుకుని ఈ స్థానంలో ఉపాధ్యక్షులు ధర్మేగౌడ ఆసీనులు అయి ఉండటంతో కాంగ్రెస్ సభ్యులు గుంపుగా వెళ్లి ఆయనపై దాడికి దిగారు. ఈ పరిస్థితుల మధ్య సభ నిరవధికంగా వాయిదా పడింది. మంగళవారం సభ మొదలు కాగానే జనతాదళ్ (సెక్యులర్)కు చెందిన సభ్యులు ధర్మేగౌడ్ సభాధ్యక్ష స్థానంలో కూర్చుని ఉన్నారు. సభాధ్యక్షులు కె ప్రతాప్ చంద్ర శెట్టికి రక్షణగా కాంగ్రెస్ సభ్యులు సభలోకి వచ్చారు. తరువాత ధర్మేగౌడను కుర్చీపై నుంచి లాగేందుకు, కుర్చీ అక్కడి నుంచి తీసివేసేందుకు యత్నించారు.

దీనితో సభలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గొడవ మధ్యనే సభాధ్యక్ష స్థానం నుంచి గౌడ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వేశారు. సభలో ఘటనలను బిజెపి నేత ఎస్ ప్రకాశ్ ఖండించారు. పెద్దల సభగా ఉండే కౌన్సిల్‌లో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడం దారుణం అన్నారు. ఏ పార్టీ వారైన బాధ్యతాయుతంగా ఉండాలని , ఈ విధంగా వ్యవహరించడం తగదని అన్నారు. బిజెపి, జెడిఎస్‌లు సభలో ఒక్కటిగా నిలిచేందుకు నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్‌కు కౌన్సిల్‌లో మెజార్టీ దెబ్బతింది. అయితే ఇప్పటివరకూ సభాధ్యక్షుడిగా ఉన్న శెట్టి పదవికి రాజీనామా చేయకపోవడం, దీనితో సభాధ్యక్ష స్థానంలో ఉప సభాపతిని కూర్చోబెట్టడం వంటి పరిణామాలు వరుసగా కౌన్సిల్‌లో చవకబారు రాజకీయాల ప్రదర్శన జరిగిందని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. సభలో జరిగిన పరిణామాలతో ఇప్పుడు గవర్నర్ వజ్జూభాయ్ వాలా ఇకపై ఏం చేస్తారనేది కీలకంగా మారింది. బిజెపి, జెడిఎస్ సభ్యులు సంయుక్తంగా వెళ్లి గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సభాధ్యక్షుడిపై అవిశ్వాన తీర్మానం ప్రస్తావించేందుకు వీలు కల్పించాలని కోరారు.

ఇప్పటివరకూ అధ్యక్షుడిగా ఉన్న కె ప్రతాప్ చంద్ర శెట్టిపై సభలో అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు.అయితే ఈ నెల 10వ తేదీన సభను అర్థాంతరంగా వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించి వెళ్లారు. మంగళవారం తిరిగి సభ ఆరంభం అయింది. అయితే అవిశ్వాస తీర్మానం అజెండాలో లేకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో డిప్యూటీ ఛైర్మన్‌ను కూర్చొబెట్టారు. దీనితో ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు ఆయనను లాగివేశారు. ఛైర్మన్‌గా వేరే వ్యక్తి ఉన్నప్పటికీ ఉప సభాధ్యక్షులు ఈ స్థానంలో కూర్చోవడం ఎంతవరకు సబబు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ముందు అక్కడికి వెళ్లి ఆయన సీటు నుంచి లేవాలని ముందు బెదిరించారు. అప్పటికే సభాధ్యక్షుడు శెట్టిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ధర్మేగౌడ యత్నించడంతో ఆయనను అక్కడినుంచి లాగేస్తూ ఉండటంతో బిజెపి, జెడిఎస్ ఎమ్మెల్సీలు కూడా పరుగులపై అక్కడికి దూసుకువచ్చి, ఆయనకు రక్షణ వలయంగా నిలిచేందుకు యత్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News