Friday, May 3, 2024

హెర్డ్ ఇమ్యూనిటీ కోసమే వ్యాక్సిన్!

- Advertisement -
- Advertisement -

Interview with Health Director Srinivasa Rao

 

టీకా స్వచ్ఛందమే కానీ తీసుకోవడం బెటర్
ఫస్ట్ ఫేజ్‌లో 4 కేటగిరీల్లో 80 లక్షల మందికి వ్యాక్సిన్లు
పది రోజుల్లో వ్యాక్సినైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం
మన తెలంగాణ ఇంటర్వూలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ వస్తోందని ప్రజల ఆశలు రెట్టింపయ్యాయి. అయితే వ్యాక్సిన్ పంపిణీ అనేది హెర్డ్ ఇమ్యూనిటీని క్రియేట్ చేయడం కోసమే కానీ పూర్తిగా వైరస్‌ను ఎలిమినేట్ చేయలేమని హెల్త్ డైరెక్టర్, వ్యాక్సినైజేషన్ ఇంచార్జీ డా జి శ్రీనివాసరావు వెల్లడించారు. టీకా ప్రయోగం తర్వాత కూడా కోనాళ్ల పాటు కోవిడ్ 19 నిబంధనలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అయితే మన దగ్గర వ్యాక్సిన్ పంపిణీ అనేది స్వచ్చంధంగా నిర్వహిస్తామని, కానీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. జనవరి చివరి వారంలో కరోనా వైరస్ నిరోధనకు వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో తొలి విడత వ్యాక్సిన్‌ను ఎవరు వేసుకోవాలి? ఎంత మందికి ఇస్తున్నారు? ఏ సంస్థల వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉంది? టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను ఎలా తొలగిస్తారు? వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అనే అంశాలను వ్యాక్సినైజేషన్ ఇంచార్జీ డా జి శ్రీనివాసరావు మన తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

తొలి విడత ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు?

తొలి విడత నాలుగు కేటగిరీల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించాం. మొదట ప్రభుత్వ, ప్రైవేట్‌లో పనిచేస్తున్న సుమారు 3 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు ఇస్తాం. రాష్ట్రంలో తొలి డోసు కూడా ఈ కేటగిరి వారికే ఇవ్వబోతున్నాం.ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పనిచేస్తున్న మున్సిపల్, శానిటేషన్, పంచాయితీరాజ్,పోలీస్, ఇతర అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి పంపిణీ చేస్తాం. ఇక మూడో విభాగంలో 50 సంవత్సరాలు పై బడిన వారందరికీ, నాలుగో విభాగంలో 50 సంవత్సరాల లోపు కో మార్పిడ్ కండీషన్ సమస్యలు ఉన్న వారందరికీ వ్యాక్సిన్‌ను ఇస్తాం. ఈ నాలుగు కెటగిరీల్లో సుమారు 80 లక్షల మందిని ఇప్పటికే గుర్తించాం. వీరికి కేవలం 10 రోజుల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తాం. అయితే కోవిన్ సాప్ట్‌వేర్‌లో నమోదైన వారికి మాత్రమే ఇవ్వాలనేది కేంద్ర మార్గదర్శకాలను సూచించింది.

వ్యాక్సిన్ వేసే ముందు ఏవైన ఆరోగ్య పరీక్షలు చేస్తారా?

ప్రస్తుతానికి అలాంటి నిబంధనలు ఏమీ లేవు. కానీ టీకా సంస్థ ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తాం. అయితే టీకా వేసిన తర్వాత చిన్నపాటి రీయాక్షన్ వస్తే మేనేజ్ చేయడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. పైన పేర్కొన్న ఆ నాలుగు కేటగిరిల్లో వైరస్ వచ్చిపోయినా, రాకున్న వ్యాక్సిన్ తప్పకుండా వేస్తాం. వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేగాక ఈ కేటగిరిల్లో గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్నా టీకాను వేస్తాం. మరోవైపు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది టీకా సంస్థ నిర్ణయించిన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది..?

ప్రతి పిహెచ్‌సి, సిహెచ్‌సిలతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో వ్యాక్సినైజేషన్ బూత్‌లను ఏర్పాటు చేస్తాం. ఈ విధానమంతా ఎన్నికల ప్రక్రియలో ఉండబోతుంది. కోవిడ్ సాప్ట్‌వేర్‌లో నమోదైన వారికీ ముందుగానే ఏ తేదిలో ఏ కేంద్రంలో వ్యాక్సిన్ ఇస్తారు? ఎవరు ఇస్తారు? అనే పూర్తి వివరాలను మొబైల్‌కి పంపిస్తాం. ఆ సమయాన్ని బట్టి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఇలా కేంద్రానికి చేరుకున్న వారు మొదట రిజిస్ట్రేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. అక్కడ ఐడీ కార్డు చూపిన తర్వాత సదరు వ్యక్తి వివరాలను కోవిడ్ సాప్ట్‌వేర్‌లో చెక్ చేస్తారు. ఆ తర్వాత వ్యాక్సినైజేషన్ బూత్‌లోకి వెళతారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని అబ్జర్వేషన్‌లో 30 నిమిషాలు పాటు ఉంచుతాం. అనంతరం ఏలాంటి రీయాక్షన్లు లేకపోతే అక్కడ్నుంచి పంపిచేస్తాం. ఒకవేళ రీయాక్షన్లు వచ్చినా అక్కడ ఉన్న మెడికల్ టీం వెంటనే స్పందిస్తుంది. వారి వద్ద 20 రకాల మందులతో కూడిన కిట్ ఉంటుంది. వాటిని వాడి రీయాక్షన్లకు చెక్ పెడతారు. అయినప్పటికీ తగ్గకపోతే అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రులకు తరలిస్తారు.

వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్‌కు వెళ్లదు. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేశాం. మరోవైపు వ్యాక్సినైజేషన్ ప్రక్రియ అనేది పూర్తిగా ఆన్‌లైన్ బేస్‌లో నడుస్తుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు రావని భావిస్తున్నాం. మరోవైపు వ్యాక్సిన్ ఎవరికి ఇచ్చామనేది కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ వ్యాక్సిన్ డోసులను ట్యాలీ చేసుకుంటాం.

వ్యాక్సిన్లు ఏసంస్థల నుంచి రాబోతున్నాయి?

ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా చెప్పలేం. కానీ సీరమ్, భారత్ బయోటెక్ సంస్థల ఆక్స్‌ఫర్ట్ ఆస్ట్రాజెనికా, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి 90 నుంచి 94 శాతం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లు నిల్వ కోసం ఆరోగ్యశాఖ కార్యాలయంలో సెంట్రల్ స్టోరేజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. దీనిలో సుమారు 2 కోట్ల డోసులను నిల్వ ఉంచవచ్చు. అంతేగాక జిల్లాల్లో కూడా కోటి డోసులను నిల్వ ఉంచేందుకు రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. దీంతో పాటు ప్రతి పిహెచ్‌సికి వ్యాక్సిన్లు తరలించేందుకు జిల్లాకు ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచాం.

స్వచ్ఛందంగా టీకాలు తీసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

టీకాలు తీసుకోవడంలో ప్రజలెవ్వరూ అపోహలకు గురికావొద్దు. నిపుణుల బృందం పూర్తిగా పర్యవేక్షించిన తర్వాతనే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. అయితే కొందరిలో భయం, అపోహలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. ఆశాలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీల ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలను చేపట్టబోతున్నాం.

వ్యాక్సిన్‌ను ఎన్ని డోసులు వేస్తారు?

వ్యాక్సిన్‌ను రెండు డోసులలో ఇస్తున్నాం. తొలి డోసు తీసుకున్న తర్వాత 28 గ్యాప్ తర్వాత రెండో డోసు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే టీకా తీసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. రెండు డోసులు తీసుకున్న వారికి కొన్ని రోజుల్లోనే ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. అయితే ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే సుమారు 9 నుంచి 12 నెలల వరకు కరోనా వైరస్ నుంచి రక్షణ ఉంటుందని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News