Sunday, May 5, 2024

విధేయతకు పెద్ద పీట

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌
ఏఐసిసి కార్యాలయం నుంచి ఇద్దరు అభ్యర్థులకు సమాచారం
అసెంబ్లీ ఎన్నకల్లో టికెట్లు త్యాగం చేసిన ఇద్దరిక గుర్తింపు

18వ తేదీ లోపు నామపత్రాల దాఖలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసిసి కార్యాలయం నుంచి ఇద్దరు అభ్యర్థులకు సమాచారం అందించింది. అయితే అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా, చివరకు పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నెల 18వ తేదీ వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు గడువు ఉండటంతో, ఆ లోపు వారు నామినేషన్లు దాఖలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లు ఎల్లుండి లోపల నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 19వ తేదీ నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, అదే రోజు సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటాయి. రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉండటంతో శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ పార్టీకే రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి.
ఇద్దరూ టికెట్‌లను త్యాగం చేశారు…
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లు తమ టికెట్లను త్యాగం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్‌ను, బల్మూరి వెంకట్‌లు హుజురాబాద్ నియోజకవర్గ టికెట్‌లను వదులుకున్నారు.ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకున్న ఆ ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News